25 నగరాలే 52 శాతం కాలుష్యానికి కారణం

తాజా వార్తలు

Published : 18/07/2021 01:34 IST

25 నగరాలే 52 శాతం కాలుష్యానికి కారణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభివృద్ధి చెందిన దేశాల్లోని కేవలం 25 నగరాలే 52 శాతం కర్బన ఉద్గారాలకు, హరిత గృహ వాయువులకు కారణమవుతున్నాయని చైనాలో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. అయితే ఆసియాలోని పెద్ద నగరాలైన టోక్యో, చైనాలోని షాంఘై, బీజింగ్‌  ఆ 25 నగరాల్లో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నగరాలకంటే యూరప్‌, ఆస్ట్రేలియా, అమెరికాలోని నగరాలే  సగటు తలసరి ఉద్గారాలను అధిక మొత్తంలో విడుదల చేస్తున్నాయని తెలిపింది. చైనాలోని చాలా నగరాలు అభివృద్ధి చెందిన దేశాల్లాగానే కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని వెల్లడించింది. పారిశ్రామికీకరణ ముందు రోజులతో పోల్చితే  ఇప్పటికే 1 డిగ్రీ సెల్సియస్ భూతాపం పెరిగిందనేది విదితమే. అయితే 1.5 నుంచి 2 డిగ్రీల మేరకు గ్లోబల్‌ వార్మింగ్‌ చేరుకోవచ్చని ప్యారిస్‌ ఒప్పందం చెబుతోంది. అయినా ఇంకా భూతాపాన్ని పెంచే దిశలోనే  చాలా దేశాలు పయనిస్తుండటం విచారకరమని ఆ అధ్యయనం తెలిపింది. 

రవాణా ద్వారా 15 శాతం కాలుష్యం!

‘ట్రాక్‌ ఆఫ్‌ గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఎమిషన్‌ రిడక్షన్‌ ప్రోగ్రెస్‌ అండ్‌ టార్గెట్స్‌’ పేరిట చైనాకు చెందిన పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 53 దేశాల్లోని 167 నగరాలకు చెందిన సమాచారాన్ని విశ్లేషించారు.  ఉద్గారాలను అధిక మోతాదులో విడుదల చేస్తూ, అన్నిటికంటే ఎక్కువగా కాలుష్యానికి కారణమవుతున్న రంగం విద్యుత్‌ ఉత్పత్తిదని, రెండోస్థానం పరిశ్రమలదని, మూడోస్థానం రవాణా వ్యవస్థదని పరిశోధకులు పేర్కొన్నారు. రహదారుల నుంచి జరిగే రవాణా వల్ల 30 శాతం కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని, ఇది నగరాల్లోని కాలుష్యకారకాల్లో మూడోస్థానం ఆక్రమించిందని  అధ్యయనం తెలిపింది.  అయితే రైల్వేలు, విమానాలు, ఓడల రవాణా ద్వారా అధికంగా కాలుష్యం జరగట్లేదని తెలిపింది. మొత్తం పర్యావరణ కాలుష్యంలో రవాణారంగానిది 15 శాతం వాటా ఉంది. 

30 నగరాల్లో తగ్గిన కాలుష్యం

2005 నుంచి 2016 మధ్య ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తున్న 42 నగరాల్లో ప్రస్తుతం 30 నగరాలు మునుపటికంటే తక్కువ గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌లను వదులుతున్నాయని పేర్కొంది.  ఆ నగరాల్లో ఓస్లో, హ్యూస్టన్‌, సియాటెల్‌, బొగొటా మొదలైనవి ఉన్నాయి. అయితే రియో డిజనైరో, జోహాన్స్‌బర్గ్‌, వెనిస్‌ తదితర తక్కిన 12 నగరాల్లో చాలా ఎక్కువ కాలుష్యం వెలువడుతోందని తెలిసింది. ‘‘నేడు ప్రపంచ జనాభాలో దాదాపు 50 శాతం ప్రజలు నగరాల్లోనే నివసిస్తున్నారు. వారు 70 శాతం గ్రీన్ హౌస్‌ వాయువుల విడుదలకు కారణమవుతున్నారు’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న సన్‌యెట్‌ సేన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన షావోక్వింగ్‌ చెన్‌ తెలిపారు. ‘‘మనం ఇప్పటికైనా మేల్కొనకపోతే భారీ వాతావరణ మార్పులకు కారణమవుతాం. తద్వారా వినాశనాన్ని కొని తెచ్చుకుంటాం’’ అని హెచ్చరించారు. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని