మేం గోదారోళ్లం.. మర్యాదలో తగ్గేదే లే!

తాజా వార్తలు

Updated : 20/07/2021 16:25 IST

మేం గోదారోళ్లం.. మర్యాదలో తగ్గేదే లే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్తగా అమ్మాయికి పెళ్లి చేశాక అత్తారింటికి పంపేటప్పుడు తగిన కానుకలు పంపడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీ. మర్యాదకు మారుపేరుగా చెప్పుకొనే గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ సంప్రదాయం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆడపిల్లల తరఫు వారు ఆషాఢంలో వియ్యంకుడి ఇంటికి సారె (ఆషాఢం కావిడి) పంపించడాన్ని ఇక్కడ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. పుట్టింటివారి గురించి అత్తింటి బంధువులు గొప్పగా చెప్పుకొనేలా ఉండాలని ఇంట్లో సరకుల దగ్గర నుంచి  స్వీట్లు దాకా రకరకాల వస్తువులు పంపిస్తుంటారు. ఎవరి తాహతుకు తగినట్టు వారు ఇచ్చుకుంటారు. అయితే, రాజమహేంద్రవరంలో ఓ తండ్రి ఇటీవల పెళ్లైన తన కుమార్తెకు పంపించిన ఆషాఢం కావిడ చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించనంత భారీ స్థాయిలో కుమార్తెకు కానుకలు పంపడం అందరినీ అబ్బురపరిచింది.

యానాంకు చెందిన ఓ ద్విచక్ర వాహన షోరూం యజమాని తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన వ్యాపారవేత్త బత్తుల రామకృష్ణ కుమార్తె ప్రత్యూషా దేవికి ఇటీవల వివాహం జరిగింది. వియ్యంకుడి ఇంటికి రామకృష్ణ ఆదివారం పంపిన ఆషాఢం సారె చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఊరు ఊరంతా ఆశ్చర్యపడేలా  స్టీలు బిందెల్లో 30 రకాల స్వీట్లు, 250 కిలోల కిరాణా సరకులు, 10 మేకపోతులు, 50 కోళ్లు, టన్ను చొప్పున కొర్రమేను, పండుగప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, టన్ను కూరగాయలు, 200 జాడీల ఆవకాయ పంపించి తన కుమార్తె పట్ల ప్రేమను చాటుకున్నారు.  వీటిని పెద్ద ఊరేగింపుగా రాజమహేంద్రవరం నుంచి యానాం వరకు తీసుకెళ్లారు. తోట రాజు ఈ సారెను గ్రామంలో తెలిసిన వారు, బంధువులకు పంచిపెట్టారు. దీంతో ఈ అంశం టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని