‘జనతా కర్ఫ్యూ’కు సిద్ధం కండి: ఏపీ గవర్నర్‌

తాజా వార్తలు

Updated : 20/03/2020 16:30 IST

‘జనతా కర్ఫ్యూ’కు సిద్ధం కండి: ఏపీ గవర్నర్‌

విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో వైద్య నిపుణులు సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాల్లోనే ఉండాలని.. అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలని గవర్నర్‌ సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కలిగిన వ్యక్తులెవరైనా తమ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, అదేవిధంగా మాస్క్‌ ధరించాలని పేర్కొన్నారు. తమ నివాసాల్లోని వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. కరోనా లక్షణాలు కనిపిస్తే భయపడకుండా కాల్ సెంటర్‌ను సంప్రదించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో వైద్యుల సలహాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా వైరస్‌ ప్రభావం సాధారణ స్థితికి చేరే వరకు ప్రజలు ఎప్పటికప్పుడు అధికారుల సలహాల మేరకు వ్యవహరించాలని గవర్నర్‌ సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, మత పరమైన ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కదలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. 

ఏపీ రాజ్‌భవన్‌ సందర్శనపై ఆంక్షలు..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్ ప్రవేశంపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్యోగులతో సహా రాజ్‌భవన్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది థర్మల్, నాన్-టచ్ ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ల ద్వారా స్కానింగ్ చేస్తున్నట్లు చెప్పారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. మరోవైపు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను వాయిదా వేసేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సైతం ఈ నెలాఖరు వరకు తన పర్యటనలను రద్దు చేసుకున్నారని వివరించారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని