AP News: విశాఖపట్నంలో ‘అసైన్డ్‌’ దందా!

తాజా వార్తలు

Updated : 30/06/2021 08:23 IST

AP News: విశాఖపట్నంలో ‘అసైన్డ్‌’ దందా!

 అసైన్డ్, డీపట్టాల రైతులతో బేరసారాలు

విశాఖపట్నం: విశాఖ నగరంతోపాటు సమీప మండలాల్లో భూములకు విలువ పెరుగుతున్నా కొద్దీ కొందరు నేతల ప్రలోభాలూ ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం పలువురి దృష్టి ప్రధాన మార్గాలకు సమీపంలో ఉన్న భూములపై పడింది. వాటిని తమ చేతుల్లోకి తీసుకొని రైతులను ముందుంచి సొమ్ము చేసుకోవాలన్న వ్యూహం కనిపిస్తోంది. ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచిస్తోంది. మరో వైపు మధ్య, అల్పాదాయ వర్గాల కోసం (ఎంఐజీ, ఎల్‌ఐజీ) ప్లాట్లు విక్రయించడానికి లేఅవుట్లు అభివృద్ధి చేయనుంది. ఇందుకు అవసరమైన భూమి కోసం నగర పరిధిలోని సబ్బవరం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం మండలాల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఈ వివరాల ఆధారంగా సంబంధిత నాయకులు ఆయా ప్రాంతాల్లో అసైన్డ్‌ భూముల కోసం బేరసారాలకు దిగుతున్నారు. ఈ భూములను తీసుకుంటే ప్రభుత్వమిచ్చే పరిహారంపై స్పష్టత లేకపోయినా భారీ మొత్తంపై ఆశతో  మధ్యవర్తులు గ్రామాల్లోనే మకాం వేశారు. ఇంకో రూపంలో.. గతంలో ‘ఒక సెంటు ప్లాట్ల’ కోసం భూసమీకరణ చేసిన తీరుగా ఈ విధానం అమలుచేస్తే ఎకరా డీపట్టాకు 900 గజాలు, అనుభవదారులకు 450 గజాలు, ఆక్రమణదారులకు 200 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసి ఇవ్వనున్నారు. ఇలా వచ్చిన స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయించినా భారీగానే ఆదాయం రానుంది. మరోవైపు తమకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని, ఎక్కువ భూమి ఇవ్వాలని రైతులనుంచి డిమాండ్‌ చేయించేలా కూడా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాల్లో రైతులే ముందున్నా ఆర్థిక లబ్ధి పొందేందుకు తెరవెనక సూత్రధారులే ప్రయత్నిస్తున్నారు. 

విషయం బయటకు రాకుండా.. 
నగరంలో స్థిరాస్తి వ్యాపారం నిర్వహించే ఓ నేత జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాలకు మధ్యవర్తులను పంపుతున్నారు. డీపట్టాలున్న రైతులు, ఇతర అసైన్డ్‌ భూములున్న వారిని గుర్తించి వాటిని అప్పగించాలని తీవ్ర స్థాయిలోనే ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఆనందపురం మండలంలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో కొందరు రైతులను ఇప్పటికే గుర్తించి ప్రలోభపెట్టి ముందస్తు చెల్లింపులు చేసినట్లు సమాచారం. విషయం బయటకు తెలిస్తే ఇబ్బందుల్లో పడతారని రైతులను హెచ్చరించడంతో అంతా గోప్యంగా ఉంచుతున్నారు. 

ఆనందపురంలో ఓ మాజీ సైనికోద్యోగికి ప్రభుత్వం ఐదెకరాలను ఇచ్చింది. సదరు వ్యక్తి, ముగ్గురు సంతానం మృతి చెందారు. ఆయన భార్య ఉన్నారు. ఇటీవల ఆమె ఇంటికి కొందరు మధ్యవర్తులు వెళ్లి భూములు కొంటామంటూ సంబంధిత దస్త్రాలపై ఆరా తీశారు. బేరం పెట్టి చివరికి అంగీకారం కుదుర్చుకున్నట్లు తెలిసింది. 
ఆనందపురం మండలంలోని ఓ రెవెన్యూ గ్రామంలో డీపట్టాదారులు, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులతో కొందరు నేతలు బేరసారాలు సాగించారు. వారి వద్దనున్న దస్త్రాలను ఇప్పటికే స్వాధీనం చేసుకొని కొంత సొమ్మును ముట్టజెప్పినట్లు సమాచారం. 
రూ.5 కోట్ల విలువ.. రూ.30 లక్షల నుంచి రూ.80లక్షలకే..: ఆనందపురం మండలంలోని తర్లువాడ, పాళ్లవలస, గిరిజాల, కణమాం గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ అధికారులు పలు దఫాలు సర్వే చేశారు. ఈ గ్రామాలు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్నాయి. భూములు వివరాలు, ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎన్నేళ్లనుంచి వాటిని అనుభవిస్తున్నారో ముఖ్య నేత అనుచరులు ఆరా తీశారు. ఈ గ్రామాల్లో ఎకరా విలువ దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. మధ్యవర్తులు మాత్రం డీపట్టా రైతులకు రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. ఆ మేరకు వారితో ఒప్పంద పత్రాలు సైతం రాయించుకున్నట్లు తెలిసింది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని