అలా చేస్తేనే ప్రాణాలు కాపాడగలం: ఈటల

తాజా వార్తలు

Published : 26/04/2021 01:18 IST

అలా చేస్తేనే ప్రాణాలు కాపాడగలం: ఈటల

వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఈటల టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్‌: కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ పూర్తి భిన్నంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇంట్లో ఒక్కరికి వైరస్‌ సోకితే మిగతా అందరికీ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువల్లే ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరి కోసం  ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఈటల తెలిపారు. వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా చూడటమే మనందరి లక్ష్యంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాల వైద్యాధికారులు, వైద్యారోగ్య శాఖ ఉన్నధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారన్నారు. వీరిలో కొంత మంది ఇంటి వద్ద నిర్లక్ష్యం చేయడం వల్లే తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అందువల్ల కరోనా వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆశా వర్కర్లు రోజుకు రెండు సార్లు ఆక్సిజన్ లెవెల్స్, జ్వరం పరీక్ష చేయాలని ఆదేశించారు. అలా చేసినప్పుడే ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతామని ఈటల అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘టెస్టింగ్ కిట్స్ మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాశాం. మరిన్ని కిట్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. లక్షణాలు ఉన్నవారు ఏ ప్రాంతం వారైనా కచ్చితంగా పరీక్షలు చేయాలి. ప్రైవేటులో పరీక్షలు చేసుకుని పాజిటివ్ వచ్చిన వారందరి వివరాలు కూడా వైద్యారోగ్య శాఖకు అందేలా చూడాలి. వారికి కూడా హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలి. టెలీమెడిసిన్ ద్వారా అనుమానాలు నివృత్తి చేయాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ అవసరమైతే అందించే ప్రయత్నం చేయాలి. గత వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రంగా లేదు. వైద్యారోగ్య శాఖలో అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలి. వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియమించుకోవాలి’’ అని అధికారులకు ఈటల దిశానిర్దేశం చేశారు.

జిల్లాల్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అవసరాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు ఈ సందర్భంగా డీహెచ్ఎంఓలు మంత్రికి వివరించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారందరి దగ్గరికి వెళ్తున్నామని.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. రెమ్‌డెసివిర్‌ అందరికీ అవసరం ఉండదని.. ఐసీఎంఆర్ నిబంధనల మేరకే అందించేలా ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని మంద్రి అధికారులు సూచించారు. అర్బన్ పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు, జీహెచ్ఎంసీ ఏరియాలో ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఎక్కువ మందిని నియమించాలని అధికారులను మంత్రి ఈటల ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని