బఫర్ స్టాక్ తగ్గకుండా చూసుకోవాలి: నిరంజన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 06/05/2021 17:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బఫర్ స్టాక్ తగ్గకుండా చూసుకోవాలి: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈ ఏడాది రాబోయే వానాకాలం సీజన్‌ కోసం 25.50 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్‌కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ సంస్థ అధికారులతో ఎరువుల సరఫరా, నిల్వపై మంత్రి ఆన్‌లైన్‌లో సమీక్షించారు. కేంద్రం కేటాయించిన నిల్వలు, వానాకాలం పంట సాగు విస్తీర్ణం, డిమాండ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.65 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు  అందుబాటులో ఉండగా.. వీటిలో 3.73 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత వానాకాలం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

మార్క్‌ఫెడ్‌ వద్ద ప్రస్తుతం ఉన్న బఫర్ నిల్వలను జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు తరలించి సామర్థ్యం పెంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ తగ్గకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కొత్తగా నిర్మించిన గోదాములు మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నందున వరంగల్, ఖమ్మం, వనపర్తిలోని కొత్త గిడ్డంగులను ఎరువుల నిల్వలకు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్ జిల్లాలకు ఎరువులు ముందే తరలించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని