Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 19/09/2021 20:56 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. ఇండస్ట్రీని ఆదుకోండి.. తెలుగు ప్రభుత్వాలకు చిరు విజ్ఞప్తి

‘ఏ విపత్తు జరిగినా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. కానీ, కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమ సాధక, బాధకాలను గుర్తించి తగిన సాయం చేయండి’ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి తెలుగు ప్రభుత్వాలను కోరారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్‌ మూవీ ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది.

2. ఓటుతో పాటు చీటీ.. ఏపీ సర్కారుకు మందుబాబు విన్నపం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కంపు నేపథ్యంలో బ్యాలెట్‌ బాక్స్‌లో వచ్చిన ఓ మందు బాబు విన్నపం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది. రకరకాల మద్యం బ్రాండ్లతో విసుగెత్తి పోతున్నామని, ఇప్పుడు సరఫరా చేసిన బ్రాండ్లను మార్చాలంటూ ఒక ఓటరు తన ఓటుతో పాటు చీటీ రాసి బ్యాలెట్‌ బాక్సులో వేశారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని  బ్యాలెట్‌ బాక్సులో ఈ చీటీ బయటపడింది. మద్యం దుకాణాల్లో చల్లని బీర్లతో పాటు మంచి బ్రాండ్‌ ల మద్యాన్ని అందుబాటులో ఉంచాలని చీటీలో మందుబాబు పేర్కొన్నాడు. 

3. పోడు భూముల పోరాటానికి విపక్షాల ఉద్యమ కార్యాచరణ

జాతీయ, రాష్ట్ర స్థాయిలో పోడు భూముల సమస్య పరిష్కారానికి తెరాస, భాజపాయేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెరాస, భాజపాయేతర ప్రతిపక్షాలనేతలు ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు భేటీ అనంతరం రేవంత్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా, 27న భారత్‌ బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మహాధర్నా తర్వాత భారత్‌ బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకొని సమావేశాలు పెట్టాలని పేర్కొన్నారు.

4. సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారు: మంత్రి పెద్దిరెడ్డి

పరిషత్‌ ఎన్నికల్లో సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్‌ పాలనకు ఏకపక్షంగా మద్దతు పలికారని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు తెదేపాతో పాటు ఇతర పార్టీలకు చెంపపెట్టన్నారు. ‘‘రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నేరవేర్చలేదు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లలోనే అమలు చేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు.

85 శాతానికిపైగా స్థానాలు గెలిచాం: సజ్జల రామకృష్ణారెడ్డి
పరిషత్‌ ఎన్నికల లెక్కింపు లైవ్‌బ్లాగ్‌

5. క్లబ్‌హౌస్‌లో వేవ్‌ ఫీచర్‌.. ఒక్క క్లిక్‌తో ఛాట్ షురూ!

ఆడియో మెసేజింగ్ యాప్‌ క్లబ్‌హౌస్‌ విభిన్న ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇన్వైట్ ఫీచర్‌ని తొలగించడంతోపాటు లైవ్‌ ఆడియో అనుభూతి కోసం స్పేషియల్ ఆడియో ఫీచర్‌ను పరిచయం చేసింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో యూజర్స్ తమ స్నేహితులను ఛాట్‌ రూంకి ఆహ్వానించొచ్చు. ఇందుకోసం క్లబ్‌హౌస్‌లో వేవ్‌ సింబల్‌ను యాడ్ చేయనుంది. మెసేంజర్‌లోలానే క్లబ్‌హౌస్‌లో మీరు ఎవరితో చాట్ చేయాలనుకుంటున్నారో వారి ప్రొఫైల్ ఓపెన్ చేసి వేవ్‌ సింబల్‌పై క్లిక్ చేస్తే మీరు వారితో చాట్‌ చేయాలనుకుంటున్నట్లు అవతలి వారికి తెలుస్తుంది.

6. మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా.. విద్యార్థుల వినూత్న నిరసన

అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు అక్కడి మహిళలు, యువతులపై అనేక ఆంక్షలు విధించారు. బాలికలకు పురుష ఉపాధ్యాయులు చదువు చెప్పకూడదని తేల్చి చెప్పారు. కాగా పలు ఆంక్షల నేపథ్యంలో అనేక మంది బాలికలు విద్యకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వారిపై వివక్షను నిరసిస్తూ బాలురు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. కొంతమంది పాఠశాలలకు వెళుతున్నప్పటికీ.. సమాజంలో మహిళలు సగభాగం అని పేర్కొంటున్న కొందరు బాలురు పాఠశాలలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది.

7. ఉత్కంఠకు తెర.. పంజాబ్‌ సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

పంజాబ్‌ రాజకీయాల్లో కెప్టెన్‌ అమరీందర్‌ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (47) పేరును కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. చరణ్‌జిత్‌ సింగ్‌ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. కాసేపట్లో కొత్త సీఎల్పీ నాయకుడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ కలవనున్నారు. కెప్టెన్‌ రాజీనామా తర్వాత తదుపరి సీఎం విషయంలో పలు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.

2022 ఎన్నికలకు కాంగ్రెస్‌ స్కెచ్‌.. చరణ్‌జిత్‌ పేరు అందుకేనా?

8. 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్‌ మైలురాయి.. అధిక వేగంలో రికార్డ్‌!

దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పుణెలో నిర్వహించిన 5జీ ట్రయల్స్‌లో 3.7 గిగాబిట్‌ పర్‌ సెకెన్‌ (జీబీపీఎస్‌) వేగంతో డేటాను బదిలీ చేసినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గాంధీనగర్‌, పుణెలో మిడ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో 1.5 జీబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అందుకున్నట్లు తెలిపింది. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే ఇదే అత్యధిక వేగంగా కావడం గమనార్హం.

9. ‘ఇంతటితో సమాప్తం’.. రికార్డు వ్యాక్సినేషన్‌పై రాహుల్‌ వ్యంగ్య ట్వీట్‌

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రికార్డు స్థాయిలో దేశంలో వ్యాక్సిన్లు ఇవ్వడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి స్పందించారు. ‘ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం’ అంటూ మోదీ పుట్టినరోజు కోసమే ఈ రికార్డులు అనే అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశారు. కొవిన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న గత పదిరోజుల వ్యాక్సినేషన్‌ వివరాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రికార్డుకు ముందు, రికార్డు తర్వాత వ్యాక్సినేషన్‌లో వేగం తగ్గడం గ్రాఫ్‌లో కనిపిస్తోంది. అంతకుమందు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై శనివారం రాహుల్‌ గాంధీ స్పందిస్తూ ఇలాంటి మరెన్నో రోజులు ఇదే తీరున వ్యాక్సినేషన్‌ జరగాలని, దేశానికిదే కావాలని ట్వీట్‌ చేశారు.

10. శుభ్‌మన్‌, నితీశ్‌ రాణా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తారు: డేవిడ్‌ హస్సీ

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాళ్లు శుభ్‌మన్‌గిల్‌, నితీశ్‌ రాణా రాబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో అదరగొడతారని, తమ ఆటతో అందర్నీ షాక్‌కు గురిచేస్తారని ఆ జట్టు చీఫ్‌ మెంటార్‌ డేవిడ్ హస్సీ ధీమా వ్యక్తం చేశాడు. తొలి దశలో పేలవంగా ఆడి ఆకట్టుకోలేకపోయిన వీరు రెండో దశలో చెలరేగుతారని అన్నాడు. కోల్‌కతా సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనున్న నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. ‘వాళ్లిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లు. కోల్‌కతా జట్టు కోసం, తమ అంతర్జాతీయ కెరీర్ల కోసం అంకితభావంతో ఉన్నారు. 

ఐపీఎల్‌: CSKvsMI లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని