Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 21/10/2021 12:58 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఏ మూల దాక్కున్నా లాగి వడ్డీతో సహా చెల్లిస్తాం: అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందని ఆవేదనతో పోరాడుతుంటే దాడికి దిగుతున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారన్నారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులు అర్పిస్తూ.. ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మలు డీజీపీ తీరుతో ఘోషిస్తున్నాయని తెలిపారు.

2. ఈటల రాజీనామా ప్రజల కోసం కానప్పుడు ఓటెందుకెయ్యాలి?: వినోద్‌ కుమార్‌

హుజూరాబాద్‌ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని ప్రజల కోసం కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. అలాంటప్పుడు ఈటలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌- జమ్మికుంట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

పోలీస్‌ అమరులు సేవలను జాతి మరవదు: కేసీఆర్‌ 

3. అక్కసుతో పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్ర: సీఎం జగన్‌

అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్‌ పరోక్షంగా ఆరోపించారు. సంక్షేమ పథకాలకు అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల బాగోగుల గురించి ఆలోచించామన్నారు.

4. నవ చరిత్రను లిఖించాం.. ‘100కోట్ల ఘనత’పై మోదీ

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌ చేపట్టిన టీకా ఉద్యమం నేడు 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తి, భారత సైన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

భారత్‌ రికార్డ్‌.. 100కోట్లు దాటిన డోసుల పంపిణీ..!

5. ఏం చేయాలో చేసి చూపిస్తా: చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన చంద్రబాబు మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింబం అని.. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందన్నారు.

6. క్రియాశీల కేసుల తగ్గుదలకు బ్రేక్‌

దేశంలో నేడు కరోనా కేసులు భారీగా పెరిగాయి. ముందురోజు 14 వేలుగా ఉన్న కేసులు అమాంతం 18 వేలకు పెరిగాయి. దాంతో క్రియాశీల కేసుల తగ్గుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రికవరీల కంటే కొత్త కేసులే అధికంగా ఉన్నాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.

7. టీ20 ప్రపంచకప్‌లో సంచలన ఇన్నింగ్స్‌ గుర్తున్నాయా?

ప్రతి ప్రపంచకప్‌లో ఒక ఆటగాడు ఉంటాడు.. అన్ని మ్యాచ్‌ల్లో రాణించకపోయినా కీలక సమయాల్లో మెరుస్తాడు. బ్యాటింగ్‌లోనో, బౌలింగ్‌లోనో సంచలన ప్రదర్శన చేసి తమ జట్టుకు అపురూప విజయం అందించడమే కాకుండా అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాడు. అలా 2007 నుంచి 2016 వరకు ఒక్కో టీ20 ప్రపంచకప్‌లో ఒక్కో ఆటగాడు తమలోని అత్యుత్తమ నైపుణ్యాలతో అభిమానులను అలరించారు. మరి ఏయే టోర్నీలో ఏయే ఆటగాడు ఎప్పుడు ఎలా రాణించాడంటే..?

8.ట్రూత్‌ సోషల్‌’.. ట్రంప్‌ సొంత సోషల్‌ మీడియా..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతగానే సోషల్‌ మీడియాను ప్రారంభించనున్నట్లు బుధవారం ప్రకటించారు. అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు ఆయన్ను బహిష్కరించాయి. దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన ఇంటర్నెట్‌లో చురుగ్గా లేరు. ఇందుకోసం ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ)ను ఏర్పాటు చేశారు.

9.సెంటర్‌ మార్చుకునేందుకు సీబీఎస్‌ఈ వెసులుబాటు
వచ్చే నెలలో జరగనున్న సెమిస్టర్‌ పరీక్షలకుగానూ విద్యార్థులు తమకు వెసులుబాటు ఉండేలా సెంటర్లను మార్చుకోవచ్చని బుధవారం సీబీఎస్‌ఈ ప్రకటించింది. తాము విద్య అభ్యసిస్తున్న పాఠశాలలు ఉన్న నగరాల్లో కాకుండా కొందరు విద్యార్థులు ప్రస్తుతం వేరే చోట్ల ఉన్నారని, వారు తమకు సౌలభ్యం ఉండేలా ఆయా ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేలా వీలు కలిగిస్తున్నట్టు తెలిపింది.

10. వివాదంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై పలువురు ప్రతిపక్ష నేతలు బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇతర దేశాధినేతలు అందజేసిన బహుమతులను ఆయన అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఓ గల్ఫ్‌ దేశ యువరాజు ఇచ్చిన ఖరీదైన గడియారాన్ని విక్రయించి సుమారు రూ.7.4 కోట్లు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. ఆయన తీరు సిగ్గుచేటని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని