ఇకపై ఏటా జాబ్‌ క్యాలెండర్‌ : కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 13/07/2021 21:29 IST

ఇకపై ఏటా జాబ్‌ క్యాలెండర్‌ : కేసీఆర్‌

హైదరాబాద్‌: ఇకపై ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది. ఇదే అంశంపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2గంటలకు మరోమారు సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్‌ తయారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా మంత్రివర్గం చర్చించనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్‌ ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎన్‌జీవో, టీజీవో విజ్ఞప్తిపై కేబినెట్‌లో చర్చ జరిగింది.

గురుకుల పాఠశాలల్లో స్థానిక రిజర్వేషన్లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు కేబినెట్‌కు నివేదిక సమర్పించాయి. నెలలోపు వైకుంఠధామాలు పూర్తి చేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్టు చేయాలన్నారు.హైదరాబాద్‌ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించారు. తక్షణమే అదనంగా రూ.1,200 కోట్లను సీఎం మంజూరు చేశారు. అలాగే నీటి ఎద్దడి నివారణ చర్యలు, పురపాలికల అభివృద్ధికి ప్రత్యేకంగా లే అవుట్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవస్థ ద్వారా లే అవుట్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను అన్వేషించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్‌ లభ్యత, మౌలిక వసతుల కల్పనపై కేబినెట్‌ సమావేశంలో చర్చించారు. జిల్లాల్లో కొవిడ్‌ పరిస్థితి, కట్టడి చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. వ్యాక్సినేషన్‌, ఔషధాల లభ్యత, మూడో వేవ్‌ సన్నద్ధతపై తీసుకుంటున్న చర్యలపై అధికారులు వివరించారు. ఫీవర్‌ సర్వే, మందులు అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని