close

తాజా వార్తలు

హోరెత్తిన నగరం

నగరంలో కార్మికుల మహా ప్రదర్శన

● జనవరి 8న సార్వత్రిక సమ్మెకు పిలుపు

● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజం

● హాజరైన త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌


బహిరంగ సభలో పాల్గొన్న సీఐటీయూ నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు

నెల్లూరు (వైద్యం, నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ఎర్ర జెండా రెపరెపలతో నెల్లూరు నగరం ఎరుపెక్కింది.. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కార్మిక సోదరులతో నిండిపోయింది.. కార్మిక నినాదాలు.. డప్పు వాయిద్యాలు.. కళాకారుల ప్రదర్శనలతో కోలాహలం నెలకొంది.. నెల్లూరు వీఆర్సీ మైదానంలో జరుగుతున్న సీఐటీయూ(సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌) 15వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ‘మహా ప్రదర్శన’ భారీ ఎత్తున జరిగింది. పలు కార్మిక సంఘాలు తరలి రావడంతో నెల్లూరు నగరం ఎర్ర జెండాలతో హోరెత్తింది. నగరంలోని ఆత్మకూరు బస్టాండు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ, కనకమహాల్‌ సెంటర్‌, ఏసీబొమ్మ, గాంధీ బొమ్మ కూడళ్ల మీదుగా వీఆర్సీ మైదానంకు చేరుకుంది. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ముందుగా కస్తూరీదేవి గార్డెన్స్‌లో పతాకావిష్కరణ నిర్వహించి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. సాయంత్రం వీఆర్సీ మైదానంలో జరిగిన సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ముఖ్య అతిథిగా హాజరయై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా మారుతోందని తెలిపారు. జనవరి 8న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెకు అన్ని వర్గాల కార్మిక సంఘాలు తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని తెలిపారు. జాతీయ పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ తెదేపా, వైకాపా, జనసేన పార్టీలు ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తనదైన శైలిలో అభ్యుదయ గీతాలను ఆలపించి.. కార్మికులు, ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, సీపీఎం జిల్లా అధ్యక్షుడు చండ్ర రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమాల గడ్డ సింహపురి..!

ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

నెల్లూరు (వైద్యం), నగరపాలక సంస్థ : స్వాతంత్య్ర పోరాటాల నుంచి నేటి కార్మిక ఉద్యమాల వరకు సింహపురి ప్రధాన కేంద్రంగా నిలుస్తూ వస్తోందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సీఐటీయూ 15వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం స్థానిక కస్తూరీదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా కార్మికుల పోరాటాల్లో అమరులైన పలువురు నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విఠపు మాట్లాడుతూ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అత్యంత బలమైన కార్మిక వ్యవస్థ కలిగిన ప్రాంతంగా నెల్లూరు జిల్లా నిలుస్తోందన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు సీఐటీయూ మరింతంగా కృషి చేయాలన్నారు.ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడే సీఐటీయూకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు చండ్రా రాజగోపాల్‌, నాయకులు అజయ్‌కుమార్‌, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు:బహిరంగ సభలో పాల్గొన్న సీఐటీయూ, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు.. (అంతరచిత్రం) ప్రసంగిస్తున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

పార్టీ జెండాకు సెల్యూట్‌ చేస్తున్న పార్టీ నాయకులు


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.