close

ప్రధానాంశాలు

చిచ్చర పిడుగల్లే చెలరేగారు

 అత్యంత వేగంగా అర్ధశతకాలు సాధించిన వీరులు

ఐపీఎల్‌ 12వ సీజన్‌ ప్లేఆఫ్ దశకు చేరుకుంటోంది.  గెలుపు బాటలో నడిచిన జట్లు అనూహ్యంగా మట్టికరుస్తున్నాయి. ఓటమి అంచున నిలిచినవి విజయ బావుటా ఎగరేస్తున్నాయి. అప్పటి వరకు చప్పగా సాగిన మ్యాచులకు కళ్లు చెదిరే సిక్సర్లు, సొగసైన బౌండరీలతో బ్యాట్స్‌మెన్‌ ఊపుతెస్తున్నారు. మెరుపులు మెరిపిస్తున్నారు. అలా  ఈ సీజన్‌లో తక్కువ బంతుల్లో అర్ధశతకం సాధించింది ఎవరంటే..!

పంత్‌ ప్రతాపం

వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌పై దిల్లీ క్యాపిటల్స్‌కు గంపెడాశలు ఉన్నాయి. కోచ్‌ రికీ పాంటింగ్‌, సలహాదారు గంగూలీకి అతడిపై అపారమైన గురి. అందుకు తగ్గట్టే ముంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12.6వ బంతికి కొలిన్‌ ఇంగ్రామ్‌ ఔటయ్యే సరికి స్కోరు 112/3. ఇక ఆ జట్టు 160 చేస్తే ఎక్కువే అనుకున్నారు. క్రీజులోకి వచ్చిన పంత్‌ సైతం ఎదుర్కొన్న ఐదో బంతి వరకు ఖాతా తెరవలేదు. ఆ తర్వాతే మొదలైంది సిక్సర్ల వర్షం. బంతి ఎటువేసినా లెగ్‌సైడ్‌లోనే సిక్సర్‌గా వెళ్లింది. జస్ప్రీత్‌ బుమ్రా వేసిన యార్కర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటిది అతడి యార్కర్‌ను డీప్‌స్క్వేర్‌ లెగ్‌లో స్టాండ్స్‌ దాటించేశాడు పంత్‌. 18 బంతుల్లో అర్ధశతకం సాధించేశాడు. మొత్తం 78 పరుగులు చేశాడు. దిల్లీ నిర్దేశించిన  213 లక్ష్య ఛేదనలో ముంబయి 176కే పరిమితమైంది. 

అమ్మో.. రసెల్‌!

వెస్టిండీస్‌ వీరుడు ఆండ్రీ రసెల్‌ ఈ సీజన్‌లో విశ్వరూపం చూపిస్తున్నాడు. మైదానం ఆవలకు బంతులు పంపిస్తున్నాడు. అతడికి బంతులేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు జంకుతుండటం గమనార్హం. రసెల్‌ ఈ ఐపీఎల్‌లో  రెండుసార్లు తక్కువ బంతుల్లో అర్ధశతకాలు చేశాడు. ఏప్రిల్‌ 19న బెంగళూరుపై 214 పరుగుల లక్ష్య  ఛేదనలో 21 బంతుల్లోనే 50 చేశాడు. 79 పరుగుల వద్ద రాబిన్‌ ఉతప్ప ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన రసెల్‌ (65) విధ్వంసకర బ్యాటింగ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి పెవిలియన్‌ చేరడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. ఇక దిల్లీ క్యాపిటల్స్‌తో సూపర్‌ ఓవర్‌ ఆడిన మ్యాచ్‌ గుర్తుంది కదా! ఆ పోరులో తొలి ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో రసెల్‌ (62) అర్ధశతకం చేశాడు. సూపర్‌ ఓవర్‌లో దిల్లీ గెలిచింది.

పొలార్డ్‌ కొడితే..

ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠ రేపిన మ్యాచుల్లో ముంబయి×పంజాబ్‌ ఒకటి. కేఎల్‌ రాహుల్‌ అజేయ శతకంతో పంజాబ్‌ మొదట 197 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి 63 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకోవడంతో విండీస్‌ పొడగరి పొలార్డ్‌ క్రీజులోకి వచ్చాడు. అతడిలో మునుపటి ఊపు తగ్గిందని అప్పటికే వార్తలొచ్చాయి. అందుకే తన సత్తా ఏంటో నిరూపించుకొనేందుకు ఈ అవకాశం వినియోగించుకున్నాడు. ఓవైపు వికెట్లు పడ్డా క్రీజులో నిలిచాడు. శామ్‌ కరణ్ బౌలింగ్‌ను లక్ష్యంగా ఎంచుకొని ఊచకోత కోశాడు. సొంత మైదానం వాంఖడేలో 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 3 సిక్సర్లు, 10 బౌండరీలతో 83 పరుగులు చేశాడు. జట్టును గెలిపించాడు.

అలీ అడుగేస్తే..

ఆరు వరుస ఓటములతో అల్లాడిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మొయిన్‌ అలీ అండగా నిలిచాడు. బంతి, బ్యాటుతో రాణించాడు. కోహ్లీసేన సాధించిన విజయాల్లో కీలకమయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఏప్రిల్‌ 19న జరిగిన మ్యాచులో అలీ (66) బ్యాటింగ్‌ విధ్వంసకరంగా సాగింది. కేవలం 24 బంతుల్లో 50 పరుగుల మైలురాయి అందుకున్నాడు. జట్టు స్కోరు 59 వద్ద 8.5వ బంతికి అక్షదీప్‌నాథ్‌ ఔటవ్వడంతో మొయిన్‌ బరిలోకి దిగాడు. విరాట్‌ కోహ్లీ (100)తో కలిసి రెచ్చిపోయాడు. ముఖ్యంగా కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడు వేసిన 16వ ఓవర్లో  వరుసగా 4, 6, 4, 6, వైడ్‌, 6 సాధించాడు. చివరి బంతిని భారీ షాట్‌ ఆడబోయి పెవిలియన్‌ చేరాడు. అతడి విధ్వంసానికి కుల్‌దీప్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. బెంగళూరు నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా 203 వద్దే ఆగిపోయింది.Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net