ప్రధానాంశాలు

Published : 23/08/2020 22:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అయితే ఔట్‌ లేదా నాటౌట్‌.. వేరే ముచ్చటే లేదు! 

మన్కడింగ్‌ ఔట్‌పై స్పందించిన దినేశ్‌ కార్తిక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది ఐపీఎల్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన మన్కడింగ్‌ ఔట్‌ ఇంకా వివాదాస్పదంగానే కొనసాగుతోంది. క్రికెట్‌ వర్గాలను రెండుగా చీల్చిన ఆ సంఘటనను ఆటగాళ్లింకా మర్చిపోలేనట్లున్నారు. రోజుకో క్రికెటర్‌ దానిమీద స్పందిస్తున్నాడు. రెండు రోజుల క్రితమే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ మన్కడింగ్‌ విషయంపై అశ్విన్‌తో మాట్లాడతానని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడతడు పంజాబ్‌ జట్టు కాదు, దిల్లీ జట్టు. ఇది పక్కన పెడితే, తాజాగా ఇదే విషయంపై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ స్పందించాడు. క్రికెట్‌ నెక్ట్స్‌ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఆ విధానాన్ని కుదిరితే ఔటివ్వాలని, లేదా నాటౌటివ్వాలని చెప్పాడు. అంతే కానీ అనవసర చర్చలకు, వివాదాలకూ చోటివ్వరాదని వ్యాఖ్యానించాడు. నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉండే బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటితే బౌలర్‌కు అతడిని రనౌట్‌ చేసే అవకాశం ఇవ్వాలన్నాడు. 

మన్కడింగ్‌ విషయంలో చాలా స్పష్టంగా ఉండాలని, అందులో క్రీడాస్ఫూర్తి అనే పదాన్ని తీసుకురాకూడదని పేర్కొన్నాడు. దాన్ని అంపైర్‌, బౌలర్ల పరిమితుల నుంచి తొలగించాలన్నాడు. ఆ విషయంలో కెప్టెన్‌ను లేదా రీఫరీని అడగాల్సిన అవసరం లేదన్నాడు. ఏ బ్యాట్స్‌మన్‌ అయినా కచ్చితంగా క్రీజులోనే ఉండాలని, అలా లేకపోతే బౌలర్‌ బెయిల్స్‌ను పడగొట్టి అతడి వికెట్‌ తీసే అవకాశమివ్వాలని పేర్కొన్నాడు. ఈ విషయంలో ప్రజలంతా బౌలర్‌ను నిందిస్తారని, అలా చేయడం సరైంది కాదంటారని దినేశ్‌ కార్తిక్‌ అన్నాడు. అలా కాకుండా బ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి ముందుకెళ్లే విషయంపై ఎవరూ స్పందించరని నిలదీశాడు. మన్కడింగ్‌ అనే విధానం రెండు జట్లకూ వర్తిస్తుందని, అలాంటప్పుడు ఆ బౌలర్‌ను విమర్శించడం సరికాదని చెప్పాడు. ఈ విషయంలో క్రికెట్‌ నియమాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశాడు. అయితే ఔటివ్వాలని, లేదా నాటౌటివ్వాలని సూచించాడు. అంతేకానీ వేరే మాటలు ఉండొద్దని కోల్‌కతా కెప్టెన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net