
తాజా వార్తలు
పాతబస్తీ అభివృద్ధి అడ్డుకుందెవరు?
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంది ఎవరని.. అక్కడకు మెట్రోరైలు ఎందుకు తీసుకెళ్లడం లేదని సీఎం కేసీఆర్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఖజనాను ఖాళీ చేసి రూ.10వేల కోట్ల విలువైన భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెరాస సభ విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ ముఖంలోనే ఓటమి భయం కనపడుతుందని ఎద్దేవా చేశారు.
వరద బాధితులకు ఇచ్చే రూ.10వేల ఆర్థికసాయం తాను ఆపానంటున్న కేసీఆర్.. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. సంఘ విద్రోహశక్తులకు నగరం అడ్డాగా మారిందని.. వారికి ఎంఐఎం వత్తాసు పలుకుతోందని బండి సంజయ్ ఆరోపించారు. కనీసం ఇచ్చిన హామీలను నెలవేర్చని తెరాస సర్కార్ ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. భాజపా జాతీయ నాయకులపై సీఎం మాట్లాడిన భాష ఆక్షేపణీయమన్నారు. భారీ వర్షాలు, వరదలతో నగరవాసులు అవస్థలు పడుతుంటే సీఎం పరామర్శించేందుకు వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్‌పై ప్రజలకు భరోసా కల్పించేందుకే దిల్లీ నుంచి జాతీయ నాయకులు నగరానికి వస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.