
తాజా వార్తలు
ప్రత్యేకహోదా ఊసే లేకుండా చేశారు: చంద్రబాబు
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సృష్టించడం కంటే అప్పులు ఎక్కువ చేసిందని.. వీటికి రెవెన్యూ లోటు తోడైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇష్టానుసారంగా పన్నులు పెంచేసి లెక్కలు తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటల బీమాలో రైతుల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26లక్షల మందికి పంటల బీమా కట్టి 50లక్షల మందికి కట్టినట్లు అసత్యాలు చెప్పారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు వేలం వేయటానికి అవేమీ జగన్ సొంత ఆస్తులు కాదన్నారు. వివిధ పథకాలపై ఎన్నికల ముందు జగన్ మాట్లాడిన పలు వీడియోలను మీడియా ముందు చంద్రబాబు ప్రదర్శించారు.‘‘చేసింది చెప్పుకునే సత్తా లేకే ప్రభుత్వం అసెంబ్లీలో ఐదు రోజులుగా తమను సస్పెండ్ చేస్తూ వచ్చింది. ప్రజల్ని బెదిరించటం, వారి తరఫున మాట్లాడే వారిపై దాడులు చేయటం నీచమైన చర్య. రైతు సమస్యల పరిష్కారంపై జగన్కు ఆలోచనే లేదు. దశ దిశ లేని ‘దిశ’ చట్టాన్ని ఆటకెక్కించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు ‘దిశ’ చట్టం ఓ ఉదాహరణ. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక న్యాయంతో ముందుకు వెళ్లాం. దాడులు చేస్తూ అవాస్తవాలను నిజం చేయాలనుకోవడం కుదరదు. ప్రత్యేక హోదాపై కథలు చెప్పి ఆ ఊసే లేకుండా చేశారు. భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి వైకాపా నేతలు పొట్టలు నింపుకొన్నారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.