close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/01/2020 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంతి తిప్పారు..బ్యాట్‌తో బాదారు..!

* హోరాహోరీగా ‘ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019’ ప్రాంతీయ స్థాయి పోటీలు

* క్రికెట్‌ ఫైనల్‌కు కడప, అనంత జట్లు

 * బాలికల విభాగంలో అనంత, చిత్తూరు జట్ల జోరు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: కళ్లు చెదిరే బ్యాటింగ్‌ విన్యాసాలు.. కట్టిపడేసే బౌలింగ్‌ మెరుపులు.. హోరాహోరీగా క్రికెట్‌ పోటీలు.. కొన్ని ఏకపక్షం కాగా.. మరికొన్ని చివరి బంతి వరకు ఉత్కంఠ రేపాయి. మొత్తంగా ‘ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019’ ప్రాంతీయస్థాయి సీనియర్, జూనియర్, బాలికల క్రికెట్‌ పోటీలు నువ్వానేనా అన్నట్లు ఆసక్తిగా జరిగాయి. అనంతపురంలోని క్రీడాగ్రామం వేదికగా గురువారం జరిగిన సీనియర్‌ విభాగం పోటీల్లో అనంత ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాల, కడప శ్రీహరి డిగ్రీ కళాశాల జట్లు తుది పోరుకు దూసుకెళ్లాయి. జూనియర్‌ విభాగంలో కడప, కర్నూలు జిల్లాల జట్లు ఫైనల్లో ప్రవేశించాయి. బాలికల విభాగంలో అనంతపురం, చిత్తూరు జట్లు చివరి పోరుకు సిద్ధమయ్యాయి. 

కడప జట్టు జయభేరి

మధ్యాహ్నం జరిగిన సీనియర్‌ విభాగం పోటీలో కడప శ్రీహరి డిగ్రీ కళాశాల జట్టు, చిత్తూరు ఎమరాల్డ్‌ డిగ్రీ కళాశాల జట్టుపై 8 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కడప జట్టు అబ్బాస్‌ (62; 39 బంతుల్లో), యూసుఫ్‌ (46; 34 బంతుల్లో) అద్భుతంగా బ్యాటింగ్‌తో 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగుల భారీస్కోరు సాధించింది. చిత్తూరు బౌలర్లు సూర్యచరణ్, జయదీప్‌ చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన చిత్తూరు జట్టు 19.4 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. క్రీజులో కుదురుకున్న జయదీప్‌ (48), దీపక్‌ (23) భారీ షాట్లకు యత్నించి ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. 

అనంత జట్టు దూకుడు 

ఉదయం బి-మైదానంలో జరిగిన సీనియర్‌ విభాగం పోటీలో అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాల జట్టు, కర్నూలు వైద్యకళాశాల జట్టును 27 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అనంత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఈ జట్టులోని ఖాదర్‌వలి (69; 8×4; 1×6) బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. కర్నూలు బౌలరు వెంకటేశ్వర్లు (2/22) కొంతమేర కట్టడి చేశాడు. ఆ తర్వాత 144 పరుగుల విజయలక్ష్యంగా బ్యాటింగ్‌ ఆరంభించిన కర్నూలు జట్టు 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టులోని నాగప్రవీణ్‌ (42), వెంకటేశ్వర్లు (20) ఆశలు రేకెత్తించినా ఫలితం చేజారింది. అనంత బౌలర్లు భార్గవ్‌ (3/17), కిశోర్‌ (3/21), ఖాదర్‌ (2/13) ప్రత్యర్థి జోరును అడ్డుకున్నారు. 

కడప ఇడుపులపాయ జట్టు విజయం

విన్సెంట్‌ మైదానంలో ఉదయం జరిగిన జూనియర్‌ బాలుర విభాగం పోటీలో కడప జిల్లా ఇడుపులపాయ జట్టు చిత్తూరు ఎస్వీ జూనియర్‌ కళాశాల జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగుల భారీస్కోరు సాధించింది. జట్టులోని భాను (47), ఉదయ్‌ (28), జయంత్‌ (25) చక్కగా ఆడారు. కడప బౌలర్లు రాజ్‌కుమార్, మోహిత్‌ చెరో రెండు వికెట్లు కూల్చారు. కడప జట్టు తర్వాత బ్యాటింగ్‌ చేసి 18.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు చేజార్చుకుని లక్ష్యాన్ని అధిగమించింది. రాజ్‌కుమార్‌ (74), మోహిత్‌ (37) బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించారు. 

 

* ఇదే మైదానంలో మధ్యాహ్నం జరిగిన మరో పోటీలో కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జట్టు అనంతపురం శ్రీసత్యసాయి జూనియర్‌ కళాశాల జట్టుపై 4 పరుగుల తేడాతో పోరాడి నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కర్నూలు జట్టు 20 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. నిరంజన్‌ (56) ఒంటరిపోరు కొనసాగించి జట్టుకు మూడంకెల స్కోరు అందించాడు. అనంత బౌలర్లు శ్రీకాంత్, అభిలాష్‌ చెరో మూడు వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అనంత జట్టు 18.1 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. అబిద్‌ (48) సంయమనంతో బ్యాటింగ్‌ చేసినా ఫలితాన్ని మార్చలేకపోయాడు. కర్నూలు బౌలరు అరుణ్‌సింగ్‌ (5/13) అనంత జట్టు పతనాన్ని శాసించాడు. 

బాలికల వీరవిహారం 

ఉదయం హాకీ మైదానంలో జరిగిన బాలికల విభాగం పోటీలో అనంతపురం జట్టు, కడప జట్టును 117 పరుగుల తేడాతో చిత్తుచేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అనంత జట్టు మమత (81), బిందు (39) బ్యాటింగ్‌లో వీరవిహారం చేయడంతో 15 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 158 పరుగుల భారీస్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన కడప జట్టు 10.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది.

* ఇదే మైదానంలో మధ్యాహ్నం జరిగిన పోటీలో చిత్తూరు జట్టు కర్నూలుపై 148 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు జట్టు పద్మజ (80), హంస (76) బ్యాటింగ్‌లో కదంతొక్కడంతో 15 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 212 పరుగులు చేయగా.. కర్నూలు జట్టు 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కేవలం 64 పరుగులు చేసి ఓటమిపాలైంది. గురువారం గెలిచిన జట్లు శుక్రవారం జరిగే ఫైనల్‌ పోటీలకు అర్హత సాధించాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.