గతేడాది రూ.20 కోట్లు చెల్లించా: కంగన
close

తాజా వార్తలు

Published : 19/09/2020 21:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గతేడాది రూ.20 కోట్లు చెల్లించా: కంగన

మరి మీరు ఎంత ఇచ్చారు సంజయ్‌ జీ?

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన క్షమాపణలు చెప్పి తీరాలని తాజా ఇంటర్వ్యూలో డిమాండ్‌ చేశారు. కంగన ఇటీవల ముంబయిని ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌’ (పీవోకే)తో పోల్చిన సంగతి తెలిసిందే. దీనికి సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ఆమె తన సొంత రాష్ట్రంలోనే ఉండాలని, ముంబయి రావొద్దని అన్నారు. ‘కంగన మోసగత్తె’ అని చెప్పారు. దీని తర్వాత బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టవిరుద్ధంగా నిర్మించిన భవనం అంటూ నటి ఆఫీసును కూల్చివేశారు. ఈ వివాదాల గురించి కంగన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సంజయ్ రౌత్‌ తనను బాధించాడని అన్నారు.

‘నేను అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న నటిని. గత ఏడాది దాదాపు రూ.20 కోట్ల పన్ను కట్టాను. మహారాష్ట్ర ఎకానమిలో నేను చాలా చిన్న భాగాన్ని. నేను చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించా. నాతో కలిసి దాదాపు 30 మంది ఎప్పుడూ పనిచేస్తుంటారు. నా జీతంలో కేవలం 40-45 శాతం మాత్రమే నేను తీసుకుంటున్నా. మిగిలింది మహారాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తున్నా. కాబట్టి అక్కడ ఉండటానికి, పనిచేయడానికి నేను పన్ను చెల్లిస్తున్నా సంజయ్‌ జీ. మీరు ఎంత మొత్తం ప్రభుత్వానికి ఇస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది’ అని పేర్కొన్నారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి నుంచి కంగన బాలీవుడ్‌ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శివసేన పార్టీ నాయకులకు, ఆమెకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. మరోపక్క ఆమె తలైవి జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారు. తమిళంతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగింది. గత ఏడాది కంగన ‘మణికర్ణిక’, ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని