close

తాజా వార్తలు

పథకం ప్రకారమే బూటకపు ఎన్‌కౌంటర్‌

 రాష్ట్ర పౌరహక్కుల సంఘం నేతల ఆరోపణ
 నిందితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: దిశ హత్యకేసు నిందితులను పోలీసులు పథకం ప్రకారమే బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఆరోపించింది. జాతీయ మానవహక్కుల సంఘం.. బాధ్యులైన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేరు గ్రామాల్లో నిందితుల కుటుంబసభ్యులను సంఘ సభ్యులు బుధవారం కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. నిందితులు చేసింది నేరమేనన్నారు. దిశ తండ్రి సైతం చట్టబద్ధంగా తక్షణ దండన కోరారే తప్ప ఇలా ఎన్‌కౌంటర్‌ చేయాలని చెప్పలేదన్నారు. నిందితులు పరుగెత్తే స్థితిలో లేరని, తుపాకీ సైతం కాల్చలేరని కుటుంబసభ్యులు చెప్పారన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ.. నిందితులను చంపడానికే పోలీసులు ‘సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌’ అంటూ అర్ధరాత్రి తీసుకెళ్లారని ఆరోపించారు. సంఘం ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది రఘునాథ్‌ మాట్లాడుతూ.. అత్యాచారం జరగడానికి ఏ శక్తులు కారణమో, వాటిపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

‘దిశ సెల్‌ఫోన్‌ గుడిగండ్ల గుట్టపై దొరికింది’..
పౌరహక్కుల  నేతలు నిందితుల తల్లిదండ్రులను అడిగి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. నవీన్‌ తల్లి లక్ష్మి మాట్లాడుతూ.. పోలీసులు దిశ సెల్‌ఫోను సంఘటన స్థలంలో దొరికిందంటున్నారని, కానీ అది గ్రామానికి దగ్గరలోని గుడిగండ్ల గుట్ట మీద దాచారని, అక్కడే దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. చెన్నకేశవులు తండ్రి కురుమయ్య మాట్లాడుతూ.. నిందితులు ఎదురుతిరగాలనుకుంటే పోలీసులు ఊరి నుంచి వారిని తీసుకెళ్లినప్పుడే ఆ పని చేసేవారన్నారు. శివ తండ్రి రాజప్ప మాట్లాడుతూ.. ‘పోలీసులను తీసుకొని మా ఊరికి రండి.. వాళ్లను నేనే చంపుతా.. శిక్షలు కూడా వీళ్లే విధిస్తే ఇక కోర్టు తీర్పులెందుకు!’ అంటూ వ్యాఖ్యానించారు. మహ్మద్‌ ఆరిఫ్‌పై గ్రామంలో ఫిర్యాదులేం లేవని స్థానికులు కొందరు పౌరహక్కుల సంఘం నేతల దృష్టికి తెచ్చారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.