
తాజా వార్తలు
రజనీ పొలిటికల్ ఎంట్రీపై పవన్ స్పందన
తుపాను బాధిత రైతులకు రూ.35వేలు చెల్లించాలన్న జనసేనాని
తిరుపతి: నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. వ్యవసాయం లాభసాటి కావాలనేదే జనసేన ఆలోచన అని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేల పరిహారం చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిహారం ఆలస్యం చేయడం మూలంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఇప్పటికే నలుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టంపై అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు ప్రత్యక్షంగా పర్యటించి నివేదిక తయారు చేస్తామని.. దాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందిస్తామని వివరించారు. ఎప్పుడూ పంటనష్ట పరిహారం రైతులకు కొద్దోగొప్పో అందుతోందని.. కౌలు రైతులకు మాత్రం సంపూర్ణసాయం అందడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల మాదిరిగానే కౌలురైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.
రైతుల కోసం త్వరలోనే ‘జైకిసాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని పవన్ చెప్పారు. ఎకరాకు రూ.5వేలు, రూ.10వేలు ఇస్తే న్యాయం జరగదన్నారు. అధికంగా పింఛన్లు ఇచ్చేందుకు నిధులు ఉన్నప్పుడు రైతులకు రూ.35వేలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేంద్రం తీసుకొచ్చిన కిసాన్ బిల్లులో అభ్యంతరాలుంటే చెప్పాలని ప్రభుత్వం కోరుతోందన్నారు. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై మీడియా ప్రతినిధులు పవన్ స్పందన కోరగా.. భారీగా అభిమాన బలం, బలమైన ఆలోచన ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రజనీ ప్రత్యక్షంగా ఎప్పుడూ రాజకీయాల్లోకి రానప్పటికీ పరోక్షంగా ఆయన ప్రభావం ఉండేదని పవన్ చెప్పారు. తిరుపతి ఉపఎన్నికకు జనసేన, భాజపా ఉమ్మడి కమిటీ అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఈ విషయంలో ఎలా ముందుకెళ్తే బావుంటుందనేదానిపై చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.