
తాజా వార్తలు
పంజాబ్‌కు ఇదే ఆఖరి అవకాశం
చెన్నైపై గెలుస్తుందా.. లేదా?
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 మెగా క్రికెట్ లీగ్‌లో ఈ సీజన్ ఆరంభంలో కేవలం ఒక్క విజయంతో చివరి స్థానంలో నిలిచిన పంజాబ్ ఆ తర్వాత విశేషంగా రాణించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలుపొంది అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. అయితే, గత మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో భంగపడ్డ ఆ జట్టు ఈరోజు చివరగా చెన్నైతో పోటీపడనుంది. కాగా, ధోనీసేన ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో లేకున్నా విజయంతోనే ఈ సీజన్‌కు ముగింపు పలకాలని భావిస్తోంది. దీంతో పంజాబ్‌కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్ టీమ్‌కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఎందుకంటే ఇప్పటికే నాలుగో స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో పోరాడుతోంది.
రెండూ ఫేవరెట్లుగానే..
రుతురాజ్ గైక్వాడ్, అంబటిరాయుడు, రవీంద్ర జడేజా రాణిస్తుండడంతో చెన్నై చివర్లో విజయాల బాట పట్టింది. ఈ క్రమంలోనే బెంగళూరు, కోల్‌కతాలపై ఘన విజయాలు సాధించింది. మరికాసేపట్లో పంజాబ్‌పైనా విజయం సాధించి ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, పంజాబ్‌లో రాహుల్, మన్దీప్, క్రిస్‌గేల్ రాణిస్తున్నారు. దాంతో ఆ జట్టు కూడా మంచి స్థితిలోనే కనిపిస్తోంది. ఇప్పుడు 12 పాయింట్లతో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని భావిస్తోంది.
పంజాబ్ గెలిచినా మెరుగైన రన్‌రేట్ ముఖ్యం..
ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచినా చెన్నైపై మెరుగైన రన్‌రేట్ సాధించాలి. లేదంటే ఇప్పటికే హైదరాబాద్ దానికన్నా ముందుంది. అలాగే ప్రస్తుతం రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న బెంగళూరు, దిల్లీ జట్లతోనూ రన్‌రేట్ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. కాబట్టి రాహుల్ టీమ్ కచ్చితంగా అద్భుతమైన విజయం సాధించాల్సిన అవసరం ఉంది.