close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 12/07/2020 22:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నెగిటివ్‌ వచ్చినా.. లక్షణాలుంటే చికిత్స తప్పదు!

కరోనా విషయంలో అప్రమత్తత తప్పదంటున్న నిపుణులు

దిల్లీ: కరోనా మహమ్మారి దేశమంతా విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. కరోనా సోకిన వారితో పాటూ వారితో సన్నిహితంగా మెలిగిన వారికీ పరీక్షలు చేయడం ఇప్పటికీ జరుగుతోంది. కానీ ఇప్పుడు కరోనా లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగిటివ్‌ అని వచ్చిన వారికీ చికిత్స అందివ్వాలా అంటే కొంతవరకూ ‘అవును’ అనే నిపుణులు అంటున్నారు. వైద్యపరంగా కొవిడ్‌ లక్షణాలుండి తొలిసారి పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చి.. తర్వాత పలుమార్లు చేసిన పరీక్షల్లో పాటిజివ్‌లు వచ్చిన  కేసులు కూడా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటప్పుడే ఎలాంటి అజాగ్రత్త వహించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ కాకపోయినా కరోనా లక్షణాలు అధికంగా ఉంటే తప్పనిసరిగా వైద్యం అందించాలని సూచిస్తున్నారు. 

ప్రస్తుతం వైద్య పరమైన కరోనా లక్షణాలు ఉండి, నెగిటివ్‌ వచ్చిన వాటిపైనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయనీ, అలాంటప్పుడు సీటీ స్కాన్‌ నివేదిక ఆధారంగా వైద్యం అందించవచ్చని దిల్లీలోని సఫ్దర్‌ ‌జంగ్‌ ఆసుపత్రి ప్రొఫెసర్‌ డాక్టర్‌ నీరజ్‌ గుప్తా పేర్కొన్నారు. కేవలం ఆర్టీపీసీఆర్‌ ఫలితాల మీదే ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీపీసీఆర్‌ సెన్సిటివిటీ 70 శాతం మాత్రమేనని, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ సెన్సిటివిటీ కేవలం 40 శాతం మాత్రమేనని చెప్పారు. వీటిమీదే ఆధారపడితే చాలామంది బాధితులకు చికిత్స అందించలేకపోవచ్చన్నారు. యాంటీబాడీ పరీక్షల సెన్సిటివిటీ 90 శాతం వరకు ఉందని, అయితే ప్రాథమిక దశలో ఉపయోగకరంగా ఉండదని తెలిపారు. కరోనా ఫలితాల కోసం వేచి చూడకుండా లక్షణాలు ఉంటే వెంటనే చికిత్సను అందించడం వల్ల వ్యాధిని ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చని వివరించారు. 

మూడు నాలుగు సార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ నెగిటివ్‌ వచ్చినా.. సీటీ స్కాన్‌లో న్యుమోనియాగా సూచించే అవకాశాలు ఉన్నట్లు ఎయిమ్స్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ గుర్జార్‌ తెలిపారు. సీటీ స్కాన్‌లో ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు గుర్తించినా.. ఆర్టీపీసీఆర్‌లో ఫలితాలు మాత్రం పాజిటివ్‌ రావడం లేదన్నారు. ఒకవేళ ఏవైనా లక్షణాలు ఉంటే వయసుతో సంబంధం లేకుండా, పరీక్షా ఫలితాల కోసం వేచి చూడకుండా వారికి కొవిడ్‌ చికిత్స అందించడం మేలని సూచించారు. సరైన పద్ధతిలో కరోనా పరీక్షలకు నమూనాలు సేకరించకపోతే ఫలితం కూడా తప్పుగా వచ్చే ప్రమాదం ఉందని మరో వైద్యులు డాక్టర్‌ నిఖిల్‌ మోదీ హెచ్చరించారు. వైరస్‌ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని, సదరు అనుమానితుడిలో తక్కువగా ఉంటే నెగిటివ్‌ వస్తుందని, అయితే బాధితుడు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని వివరించారు. కాబట్టి ఫలితాల్లో నెగిటివ్‌ వచ్చినా అధిక కొవిడ్‌ లక్షణాలు ఉంటే వైద్యం అందించడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.