కన్నప్రేమకు వైరస్‌ కాటు!
close

తాజా వార్తలు

Updated : 31/08/2020 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్నప్రేమకు వైరస్‌ కాటు!

పాదబాటపై తల్లి మృతదేహం
కొవిడ్‌ భయంతో కుమారుడి నిర్వాకం

జూబ్లిహిల్స్‌, న్యూస్‌టుడే: మానవ సంబంధాలను, రక్త సంబంధాలనూ కరోనా తెంచేస్తోంది. అలాంటి ఘటన బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. జ్వరంతో తల్లి మరణించడంతో కరోనా అని భావించి.. ఆమె మృతదేహాన్ని కుమారుడు పాదబాట (ఫుట్‌పాత్‌)పై వదిలివెళ్లిన హృదయవిదారక సంఘటన ఇది. నిజామాబాద్‌ జిల్లా వర్ని ప్రాంతానికి చెందిన తలారి రమేశ్‌ (45) బంజారాహిల్స్‌లోని షౌకత్‌నగర్‌లో నివసిస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు-2లోని ఓ ప్లాజాలో కాపలాదారుగా పనిచేస్తున్నారు. అతని భార్య, పిల్లలు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉంటున్నారు.. కుమారుడిని చూసుకొనేందుకు నెల రోజుల కిందట తల్లి తలారి భగీరథ(70) ఇక్కడికి వచ్చారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు-3లోని గ్రీన్‌ మాస్క్‌ ప్రాంతంలో ఆమె అప్పుడప్పుడు భిక్షాటన చేస్తుండేవారు. నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం ఉండడంతో కుమారుడు తీసుకొచ్చిన మాత్రలు వాడుతూ.. కషాయం తాగుతున్నారు. ఆమెకు జ్వరం తగ్గకపోగా శనివారం రాత్రి మృతిచెందారు. రమేశ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. కరోనాతోనే ఆమె చనిపోయిందని భావించారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టారు. ఒక సంచిలో పెట్టి అర్ధరాత్రి దాటిన తరువాత బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు-2లోని లుంబినీ మాల్‌ ముందు పాదబాటపై చెట్టు కింద పెట్టి వెళ్లిపోయారు. ఆదివారం మూటను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.కళింగరావుతోపాటు ఎస్సైలు పరిశీలించారు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ.. సంచి తెరిచి చూడగా మృతదేహం కనిపించింది. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆమె చిత్రంతో పోలీసులు చుట్టుపక్కల ఆరా తీశారు. షౌకత్‌నగర్‌ ప్రాంతంలో ఒకరు ఆమెను గుర్తించారు. రమేశ్‌ను అదుపులో తీసుకొని పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. తన వద్ద డబ్బులు లేకపోవడంతో పాటు కరోనా నేపథ్యంలో ఏం చేయాలో తెలియక ఇలా చేశానని అతను చెప్పారు. కాగా మృతురాలి పెద్ద కుమారుడు దత్తు వర్నిలో నివసిస్తాడని పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని