close
Array ( ) 1

తాజా వార్తలు

ఎన్నాళ్లో వేచిన ఆటగాళ్లు

ఏళ్ల తరబడి పొట్టి క్రికెట్‌కు దూరయ్యారు 

ఏ క్రీడాకారుడైనా దేశం తరఫున ఆడాలని ఎన్నో కలలు కంటాడు. అందుకోసం నిరంతర సాధన చేసి ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా సరే.. లేదంటే మరో అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే. అలా ఎదురు చూడడంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేవారు కొందరుంటారు. ఆ కొందరిలో ఐదుగురు టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. ఏడాది, రెండేళ్లు దూరమైనా ఓపికతో గడిపేయొచ్చు. కానీ వీరిలో ముగ్గురు క్రికెటర్లు ఏకంగా ఆరేడేళ్లు పొట్టి క్రికెట్‌కు దూరమయ్యారు. తిరిగి జట్టులో స్థానం సంపాదించి తమ ముద్ర వేయడానికి ప్రయత్నించారు.

సంజూ శాంసన్ ఐదేళ్లు

శ్రీలంకతో శుక్రవారం జరిగిన మూడో టీ20లో యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌(6) ఆడిన సంగతి తెలిసిందే. అతడికిది రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌. శాంసన్‌ తొలి మ్యాచ్‌ ఎప్పుడు, ఎవరిపై ఆడాడో గుర్తుందా?2015 జులైన 19న జింబాబ్వేతో. ఆ మ్యాచ్‌లో టీమిండియా 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సంజు (19; 24 బంతుల్లో 1x4) పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత అతడికి అవకాశాలు రాలేదు. ఐదేళ్ల తర్వాత గత మూడు టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసినా తాజాగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో ఆడే అవకాశం వచ్చింది. సంజూ ఆడని ఐదేళ్లలో టీమిండియా 73 పొట్టి మ్యాచ్‌లు ఆడింది. 

ఉమేశ్‌ యాదవ్‌ ఆరేళ్లు

టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ 2012లో పొట్టి క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆగస్టు 7న శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 39 పరుగులతో విజయం సాధించింది. ఉమేశ్‌ ఆ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 24 పరుగులిచ్చాడు. అయితే ఒకే వికెట్‌ తీయడంతో అప్పటి నుంచి అతడిని పక్కన పెట్టింది టీమిండియా. ఆరేళ్ల తర్వాత 2018లో ఉమేశ్‌కు రెండో అవకాశం వచ్చింది. జూన్‌ 29న ఐర్లాండ్‌తో జరిగిన టీ20లో భారత్‌ 143 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసిన ఉమేశ్‌ 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్‌ ఆడిన ఈ రెండు మ్యాచ్‌ల మధ్య టీమిండియా 65 టీ20లు ఆడింది.

దినేశ్‌ కార్తిక్‌ ఏడేళ్లు 

సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ 2006 డిసెంబర్‌లో టీ20 కెరీర్‌ ఆరంభించాడు. అప్పట్లో వరుసగా అవకాలొచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. 2010 మే 11న శ్రీలంకతో జరిగిన ఒక మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఆ తర్వాత టీమిండియా ఏడేళ్ల పాటు కార్తిక్‌ని పక్కన పెట్టింది. చివరికి 2017 జులై 9న వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో ఆడి 48 పరుగులతో జట్టులో అత్యధిక స్కోర్‌ సాధించాడు. టీమిండియా ఓటమిపాలైనా అతడికి మంచి పేరు వచ్చింది. ఇక 2018 నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ కార్తిక్‌ కెరీర్‌లోనే అత్యుత్తమం. బంగ్లాతో జరిగిన తుది పోరులో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి భారత్‌ను గెలిపించాడు. దినేశ్‌ ఆడని ఏడేళ్ల కాలంలో టీమిండియా 56 టీ20లు ఆడింది.

మహ్మద్‌ షమి రెండేళ్లు

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి 2014లో పొట్టి క్రికెట్‌లో అరంగేట్రం చేయగా ఇప్పటివరకు 9 మ్యాచ్‌లే ఆడాడు. 2017 జులై 9న వెస్టిండీస్‌తో జరిగిన ఒక టీ20లో అతడు మూడు ఓవర్లే వేసి 46 పరుగులిచ్చాడు. దాంతో రెండేళ్ల పాటు పొట్టి క్రికెట్‌కు దూరమయ్యాడు. గతేడాది బాగా రాణించడంతో తిరిగి టీ20 జట్టుకు ఎంపికైన షమి డిసెంబర్‌లో విండీస్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో భారత్‌ 67 పరుగులతో విజయం సాధించింది. కాగా, షమి ఆడని కాలంలో టీమిండియా 43 టీ20లు ఆడింది.

రవీంద్ర జడేజా రెండేళ్లు..

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టి పదేళ్లు దాటింది. 2009 ఫిబ్రవరిలో అరంగేట్రం చేసిన అతడు 2017 వరకు చాలా మ్యాచ్‌లు ఆడాడు. 2017 జులై 9న విండీస్‌తో ఆడిన టీ20లో బ్యాటింగ్‌ చేసిన అతడు 13 పరుగులు తీశాడు. అనంతరం బౌలింగ్‌లో 3.3 ఓవర్లలోనే 41 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్‌ తర్వాత టీమిండియా జడేజాను రెండేళ్లు దూరం పెట్టింది. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఎంపిక చేసి విండీస్‌ పర్యటనకు పంపించింది. అమెరికాలో జరిగిన రెండో టీ20లో జడేజా 9 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో ఒక ఓవర్‌ వేసి ఆరు పరుగులిచ్చాడు. జడేజా ఆడని రెండేళ్లలో టీమిండియా 33 పొట్టి మ్యాచ్‌లు ఆడింది.  

 - ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం, హైదరాబాద్‌

 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.