ట్రంప్‌పై ఎదురుదాడి: నిషేధంపై కోర్టెక్కిన టిక్‌టాక్‌
close

తాజా వార్తలు

Updated : 25/08/2020 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రంప్‌పై ఎదురుదాడి: నిషేధంపై కోర్టెక్కిన టిక్‌టాక్‌

వాషింగ్టన్‌: అమెరికాలో తమ కార్యకలాపాల మీద డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నిషేధం విధించటంపై సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సెప్టెంబరు 15లోగా ఈ సంస్థ దేశంలో కార్యకలాపాలను మూసివేయాలన్న ట్రంప్‌ యంత్రాంగం పరిపాలనా ఉత్తర్వును సవాలు చేస్తూ.. కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. తమ వాదనను వినేందుకు అమెరికా అధికారిక యంత్రాంగం సిద్ధంగా లేకపోవటంతో, న్యాయస్థానంలో సవాలు చేయటం అనివార్యమైందని సంస్థ ప్రకటించింది.

అధ్యక్షుడు ట్రంప్‌ దేశభద్రతకు సంబంధించి సదుద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని టిక్‌టాక్‌ తన ఫిర్యాదులో ఆరోపించింది. ట్రంప్‌ జారీచేసిన ఈ ఉత్తర్వు.. రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నదని కూడా విమర్శించింది. యాప్‌ను నిషేధించేందుకు, యాజమాన్య సంస్థ బైట్‌డాన్స్‌ ఆస్తులను వదులుకోవాల్సిందిగా ఆదేశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చేందుకు ట్రంప్‌ ప్రభుత్వం అనుసరించిన విధానం.. నిష్పక్షపాతంగా లేదని సంస్థ వివరించింది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌, కామర్స్‌ సెక్రటరీ విల్బర్‌ రాస్‌, ఆ దేశ వాణిజ్య శాఖలపై ఫిర్యాదు చేసింది.  

అమెరికన్‌ యూజర్లకు సంబంధించిన సమాచారం.. అమెరికా, సింగపూర్‌లలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షితంగా ఉంటుందని టిక్‌టాక్‌ వెల్లడించింది. కాగా, టిక్‌టాక్‌ తాజా ముందడుగు..  కొనుగోలు చర్చల్లో ధర పెరిగేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అమెరికాలో టిక్‌టాక్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌, తదితర సంస్థలతోపాటు .. రిలయన్స్‌ కూడా చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని