close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే 75 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 229కి చేరింది. కరోనాతో ఈరోజు ఇద్దరు మృతిచెందారు. సికింద్రాబాద్‌, షాద్‌ నగర్‌కు చెందిన వ్యక్తులు మృతిచెందగా.. మృతుల సంఖ్య 11కి చేరింది.  మరోవైపు కరోనా సోకి కోలుకున్న వారిలో 15 మంది ఈరోజు డిశ్చార్జ్‌ అవగా.. ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 32కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఒకే ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్

2. ఈ సమయంలో ఇసుక తవ్వకాలా?:చంద్రబాబు

రోనా కట్టడిలో భాగంగా ఐదు ప్రధాన సమస్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో రక్షణ ఉపకరణాల తయారీ చేపట్టడం, ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరల నియంత్రణ, ఇసుక, గ్రావెల్‌, మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల్లో మాఫియా తలమునకలైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా వేళ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

 రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవల చట్టం (ఎస్మా)ని తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా పనిచేసేందుకు నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో పేర్కొంది. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా సిబ్బంది, మంచినీరు, విద్యుత్‌ సరఫరాలను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మల్కాజిగిరిలో కానిస్టేబుల్‌పై దాడి

 కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గుంపులుగా రావొద్దని, ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణం చేయవద్దని చెప్పినందుకు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మల్కాజిగిరి పరిధి మౌలాలీలోని ప్రశాంతినగర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే ద్విచక్ర వాహనంపై యువకుడితో పాటు తల్లిదండ్రులు ప్రయాణిస్తున్నారు. గమనించిన ఓ కానిస్టేబుల్‌ వారిని ఆపి లాక్‌డౌన్‌ అమల్లో ఉందని.. ద్విచక్ర వాహనంపై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని వారించారు. దీంతో ఆ యువకుడితో పాటు అతడి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకుని దాడి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 14 రాష్ట్రాల్లో ‘తబ్లిగీ జమాత్‌’ కేసులు

దిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం కారణంగా దేశంలోని 14 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత రెండు రోజుల్లో ఈ సమావేశానికి హాజరైన వారిలో 647 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. నిన్న ఒక్కరోజే 336 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా: 30వేల మంది వైద్యులు స్వచ్ఛందంగా..

6. ఆ రెండూ కరోనాపై పోరుకు విఘాతం: రాష్ట్రపతి

ఆనంద్‌ విహార్‌లో వలస కూలీలు గుమిగూడటం, నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్‌ మత సమ్మేళనం కరోనా వైరస్‌ కట్టడికి విఘాతంగా మారాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఆ రెండు సంఘటనలు వైరస్‌ నియంత్రణ చర్యలకు ఎదురు దెబ్బలని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో ప్రజలెవ్వరూ పస్తులు ఉండకుండా చూడాలని గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరెన్సీ నోటు నాకి, చీది భయపెట్టిన వ్యక్తి అరెస్టు

కొందరు ఆకతాయిలకు కరోనా వైరస్‌ తీవ్రత అర్థం కావడం లేదు! సామాజిక మాధ్యమాల్లో వెకిలి, నకిలీ, భయపెట్టే సమాచారం, చిత్రాలు, వీడియోలు సృష్టిస్తున్నారు. నాసిక్‌లో సయ్యద్‌ జమీల్‌ సయ్యద్‌ బాబూ (38 ఏళ్లు) కరెన్సీ నోటును జుగుప్సాకరంగా నాకుతూ, ముక్కుతో దానిపై చీదాడు. ఔషధం లేని నావెల్‌ కరోనా వైరస్‌ ‘దేవుడి శాపం’ అంటూ టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశాడు. ఆ వీడియో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉండటంతో మాలెగావ్‌ పరిధిలోని రంజాన్‌పుర పోలీసులు గురువారం రాత్రి సయ్యద్‌ను అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒకరికి కరోనా: 54వేల మంది క్వారంటైన్‌

గుజరాత్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో దాదాపు 54,000 మంది ఇంట్లోనే క్వారంటైన్‌ కావాల్సి వచ్చింది. సూరత్‌లోని రాండర్‌ జోన్‌లో లాండ్రీ దుకాణం నడిపే ఓ వ్యక్తికి కొవిడ్‌-19 సోకింది. దీంతో ఆ దుకాణం చుట్టుపక్కల ఉన్న 16,785 ఇళ్లలో 54,003 మంది గృహ నిర్బంధంలోకి వెళ్లారు. 12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 82 అంతర్గత దారులున్న ఈ ప్రాంతం మొత్తాన్ని అధికారులు క్రిమి సంహారకాలతో శుభ్రం (శానిటైజ్‌) చేయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మనుషుల కదలికల్లో ఎంతమార్పో

సెలవు దొరికితే ఏ సినిమాకో, షికారుకో వెళ్లడం సగటు భారతీయుడి అలవాటు. సాధారణ రోజుల్లో అయితే బస్టాండ్లకు పోటెత్తుతారు. రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతాయి. పార్కులు నిండిపోతాయి. లాక్‌డౌన్‌ పుణ్యమా ఇవన్నీ బంద్‌. నిత్యావసరాల దుకాణాలు, మెడికల్‌ షాపులు మినహా! దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ ఆసక్తికర డేటా వెల్లడించింది. మొబైల్‌ లోకేషన్‌ డేటాను ఉపయోగించి దేశంలోని ప్రజల కదలికలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 131 దేశాలకు సంబంధించిన డేటాను కొవిడ్‌-19 కమ్యూనిటీ మొబిలిటీ రిపోర్ట్‌ పేరిట గూగుల్‌ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అమెరికన్లు కరోనా నిబంధనలు పాటించటం లేదా?

10. కరోనా దెబ్బతో అత్యల్ప వృద్ధిరేటు తప్పదు

సంస్కరణలు ప్రవేశపెట్టాక 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యల్ప వృద్ధిరేటు నమోదు చేయనుందని సీనియర్‌ ఆర్థికవేత్త ఒకరు అంచనా వేస్తున్నారు. ఆరు నెలలుగా మందగమన దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ పెను ప్రభావం చూపిస్తోందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పబ్లిక్‌ ఫైనాన్స్‌, పాలసీ ప్రొఫెసర్‌ ఎన్‌ఆర్ భానుమూర్తి అన్నారు. చైనాలో మొదట వెలుగు చూసిన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.