డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేసిన ట్రంప్‌
close

తాజా వార్తలు

Published : 15/04/2020 08:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేసిన ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్‌ ప్రధాన ఆరోపణ. 

సంస్థను ఆదేశించే హక్కు మాకుంది..

ఈ విషయంలో సంస్థ చైనాకు పక్షపాతిగా వ్యవహరించిందని ఆయన మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ బాధ్యతాయుతంగా నడుచుకునేలా ఆదేశించే హక్కు సంస్థకు అత్యధిక నిధులు అందిస్తున్న అమెరికాకు ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చైనా సహా ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొన్న ‘అత్యంత వినాశకరమైన’ నిర్ణయమన్నారు.

సంస్థతో తొలి నుంచి ఏకీభవించలేదు.. 

అమెరికా తీసుకున్న చాలా నిర్ణయాల్ని డబ్ల్యూహెచ్‌ఓ వ్యతిరేకించిందని ట్రంప్‌ చెప్పకొచ్చారు. కానీ,  డబ్ల్యూహెచ్‌ఓతో ఏకీభవించని తాను చైనా ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేశామని తెలిపారు. తద్వారా చెప్పలేనంత మంది ప్రాణాల్ని రక్షించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనారోగ్య ముప్పు తలెత్తినప్పుడు ప్రపంచ దేశాలూ సరైన సమాచారం కోసం డబ్ల్యూహెచ్‌ఓపై ఆధారపడతాయని గుర్తుచేశారు. కానీ, సంస్థ మాత్రం ఈ కనీస బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని ఆరోపించారు. 

డిసెంబరులోనే ఆధారాలున్నప్పటికీ..

కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందనడానికి చైనాలో డిసెంబర్‌లో సరైన ఆధారాలు ఉన్నాయని.. కానీ, డబ్ల్యూహెచ్‌ఓ వాటిపై ఏమాత్రం దృష్టి సారించలేదన్నారు. పైగా కొవిడ్‌-19 అంటువ్యాధి కాదన్న చైనా వాదనకు మద్దతుగా నిలిచిందన్నారు. జనవరి రెండో వారం పూర్తయ్యేనాటికీ సామూహిక వ్యాప్తి జరుగుతుందనడానికి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించడంలోనూ డబ్ల్యూహెచ్‌ఓ జాప్యం చేసిందని ఆరోపించారు. ఈ పరిణామాల వల్లే ఇప్పుడు వైరస్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 19,79,477 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 1,26,539 మందిని  ఈ వైరస్‌ బలిగొంది. ఇక ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాయే అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అక్కడ ఇప్పటి వరకు 6,12,576 మందికి వైరస్‌ సోకగా.. వీరిలో 29,798 మంది మృతిచెందారు.

ఇవీ చదవండి..

హెచ్‌-1బీ వీసాదారులకు ఊరట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని