
తాజా వార్తలు
ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
2021 ఐపీఎల్లో ఎవరెవరు ఎంతంత వెల కట్టిన చోప్రా..
ఇంటర్నెట్‌డెస్క్: ఈ ఏడాది ఐపీఎల్లో అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నిలుస్తాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 2021 ఐపీఎల్‌కు సంబంధించి ఆయా ఫ్రాంఛైజీలు ఏ ఆటగాడిని తమ వద్ద కొనసాగిస్తున్నాయో, ఎవరెవరిని వదిలేస్తున్నాయో బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆకాశ్ చోప్రా స్పందిస్తూ ట్విటర్లో పలువురు ఆటగాళ్ల ధరలను అంచనా వేశాడు.
పంజాబ్ వదిలేసిన ముజీబుర్ రెహ్మాన్ ఈసారి వేలంలో రూ.7-8 కోట్ల మధ్య ధర పలుకుతాడని చోప్రా పేర్కొన్నాడు. అలాగే కోల్‌కతా ఆటగాడు క్రిస్‌గ్రీన్ ధర రూ.5-6 కోట్లు ఉండొచ్చని చెప్పాడు. ఇక ఇటీవల టీమ్ఇండియాతో ఆడిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఈ టోర్నీలోనే అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా నిలుస్తాడని అంచనావేశాడు. అయితే, అతడెంత ధర పలుకుతాడనే విషయాన్ని మాత్రం చోప్రా పేర్కొనలేదు. తర్వాత దిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన జేసన్ రాయ్ రూ.4-6 కోట్ల మధ్య ధర పలుకుతాడన్నాడు. ఇక 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేయకపోవడంతో పంజాబ్, ముంబయి వదిలేసిన మాక్స్వెల్, నాథన్ కౌల్టర్ నైల్ ఇప్పటికీ మంచి ధర పలుకుతారని కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ బ్యాట్స్‌మన్ వివరించాడు. అయితే, ఇవన్నీ తన ఊహాగానాలేనని, ఆయా ఆటగాళ్ల ఆసక్తిపైనే ఆయా ధరలు ఆధారపడతాయని చోప్రా వివరించాడు.
ఇవీ చదవండి..
ఇక చాలు
2-1 కాదు 2-0!