స్టేజ్‌ చూస్తే నాకు ఊపొస్తుంది..:సుమ
close

తాజా వార్తలు

Published : 21/08/2020 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టేజ్‌ చూస్తే నాకు ఊపొస్తుంది..:సుమ

పల్లెటూరు... పట్టణం.. నగరం.. మెగా సిటీ. ప్రాంతమేదైనా సరే..! అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ.. మహిళెవరైనా సరే... ప్రతిఒక్కరినీ స్టార్‌ను చేసింది ‘స్టార్‌ మహిళ’ కార్యక్రమం. 2008లో ఈటీవీలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 2019 జనవరి 26న ముగిసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ బుల్లితెర సన్సేషన్‌.. 3,181 ఎపిసోడ్లతో భారత దేశంలోనే అతిపెద్ద రెండో ఆటల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడీ ‘స్టార్‌ మహిళ’ చిన్న గ్యాప్‌ తర్వాత తిరిగి ప్రారంభమైంది. సుమ గలగల మాటలతో ప్రతి ఇళ్లూ మళ్లీ సందడిగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే కార్యక్రమ విశేషాలను, ఈ షోతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ‘ఈనాడు సినిమా’తో పంచుకుంది సుమ.

మీరిప్పటి వరకు ఎన్నో టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘స్టార్‌ మహిళ’ అనగానే మీకు ప్రత్యేకంగా అనిపించిందేంటి?

‘స్టార్‌ మహిళ’... దశాబ్ద కాలానికి పైగా కొనసాగింది. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో నన్ను ఎంతో మంది కుటుంబాలకు దగ్గర చేసింది ఈ ప్రోగామ్‌. ఇన్నేళ్ల పాటు వారంలో ఆరు రోజులు నన్ను చూస్తుండటం వల్ల ప్రతి ఒక్కరికీ నేను సొంతింటి మనిషిలా మారిపోయా. అంతకు ముందు నేను ‘మహిళలు మహారాణులు’.. ఇతరత్రా కార్యక్రమాలతో అందరికీ తెలిసినప్పటికీ, నన్ను ప్రతి ఇంటి ఆడపడుచులా సుపరిచితం చేసింది ఈ కార్యక్రమమే. అందుకే నాకు ‘స్టార్‌ మహిళ’ చాలా ప్రత్యేకం.

‘స్టార్‌ మహిళ’ షోలో బాగా గుర్తుండిపోయిన మధురానుభూతులు?

ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేనెంతో మంది మహిళల్ని నేరుగా కలుసుకోగలిగా. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లయిన యువతులు, అమ్మలు, అమ్మలు, తాతమ్మలు.. ఇలా అనేక మందిని కలిశా. ఉద్యోగం చేసే మహిళలకు వృత్తితో పాటు మరో వ్యాపకమేదైనా ఉంటుంది. కానీ, ఇంట్లోనే ఉండే ఆడవాళ్ల దృష్టంతా భర్తకు ఎలాంటి వంటలు చేసి పెట్టాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి.. వంటి విషయాల చుట్టూనే తిరుగుతుంటుంది. అలాంటి వాళ్లు ‘స్టార్‌ మహిళ’ షోకి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉండటాన్ని చూశా. ఎందుకంటే వాళ్లలో చాలా మంది గాయకులు, డ్యాన్సర్లు ఉండొచ్చు. ఆ ప్రతిభను చూపించడానికి గతంలో ఎప్పుడూ అవకాశం రాకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్లంతా ‘స్టార్‌ మహిళ’ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించినప్పుడు చాలా సంతోష పడటాన్ని స్వయంగా చూశా. కొంత మంది అమ్మాయిలకి ఈ ‘స్టార్‌ మహిళ’లో చేసిన తర్వాత సంబంధాలు కుదిరాయట. ఇలా పెళ్లిళ్లయ్యాక తమ భర్తలతో కలిసి షోకి వచ్చిన వాళ్లున్నారు. చదువుకునే రోజుల్లో వచ్చి.. పెళ్లి తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్లని చూశా. అమ్మలుగా వచ్చిన వాళ్లు మళ్లీ అమ్మమ్మలుగా షోకి వచ్చిన వాళ్లున్నారు. ఇలా ‘స్టార్‌ మహిళ’తో రెండు తరాల్ని చూశా (నవ్వుతూ).

ఇప్పుడు రెండో సీజన్‌లో ఎలాంటి లక్ష్యాలతో వస్తున్నారు?

నిజం చెప్పాలంటే.. 2008లో ‘స్టార్‌ మహిళ’ను మొదలు పెట్టినప్పుడు ‘ఇన్నేళ్ల పాటు కొనసాగించాలి, ఇన్ని ఎపిసోడ్లు చేయాలి’ అనుకొని చేసింది కాదు.  ఈటీవీలో ఉండే గొప్పతనం ఏంటంటే.. కొత్తగా ప్రారంభించే ఏ కార్యక్రమం విషయంలోనైనా అది పూర్తిగా ప్రేక్షకుల్లోకి చేరువయ్యే వరకు ఓపికగా ఎదురుచూస్తారు. ఎప్పుడూ ఒకే విధంగా చక్కగా కొనసాగిస్తారు. తొందర పాటు నిర్ణయాలు తీసుకొని షోలను అకస్మాత్తుగా రద్దు చేయరు. అలాగే ఈటీవీ షో టైమింగ్స్‌ విషయంలోనూ చక్కటి సమయపాలన కనిపిస్తుంటుంది. ఒక టైంలో వర్కవుటవ్వట్లేదని మరో టైంకి మార్చడం.. రోజుల్ని మార్చడం వంటి పనులతో ప్రేక్షకుల్ని ఎప్పుడూ గందరగోళానికి గురిచేయరు. ఇప్పుడు ‘స్టార్‌ మహిళ సీజన్‌ 2’ కోసం ఇలాంటి చక్కటి ప్రణాళికనే రూపొందించి ఉంచారు. మరి ఈసారి ఎన్నేళ్లు నడుస్తుందన్నది భగవంతుని ఆశీర్వాదాన్ని బట్టీ ఉంటుంది. చూద్దాం ఏమౌతుందో.

ఈ సీజన్‌ కోసం ప్రత్యేకంగా ఎలాంటి రౌండ్లు డిజైన్‌ చేశారు?

‘స్టార్‌ మహిళ’ మొదలైన కొత్తలో చిన్నగా గవ్వలతో ఆటలు, మరికొన్ని ఆసక్తికర టాస్క్‌లు ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్లుగా కొన్ని కొత్త టాపిక్‌లు, టాస్క్‌లు తీసుకున్నాం. ఎలాంటి టాస్క్‌లైతే ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తాయో అలాంటివి చేయించబోతున్నాం. గతంలో ఉన్న క్వశ్చన్‌ ఆన్సర్‌ రౌండ్‌తో పాటు మరికొన్ని రౌండ్స్‌ని అలాగే ఉంచాం. ప్రత్యేకంగా ‘అంతకు మించి’ అనే మూడో రౌండ్‌ అందరినీ చాలా మెప్పిస్తుంది. ఆ రౌండ్‌లో డైస్‌ వేశాక మహిళలు అక్కడుండే బ్లాక్‌ల మీద నడవాల్సి ఉంటుంది. వాటిని ప్రత్యేకంగా కొన్ని ఎమోజీస్‌తో డిజైన్‌ చేశాం. వాటిపై ప్రత్యేకంగా టాస్క్‌లు ఏర్పాటు చేశాం. ఇవన్నీ నవ్వులు పూయించేలా ఉంటాయి.

ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ దొరకనంత విశ్రాంతి కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో దక్కినట్టుంది. ఈ విరామ సమయాన్ని ఎలా గడిపారు?

నా ‘సుమక్క’ యూట్యూబ్‌ ఛానెల్‌ కోసం కొన్ని వీడియోలు చేశా. నా కూచిపూడి డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ మళ్లీ మొదలుపెట్టాను. ముఖ్యంగా మా పిల్లలతో గడపటానికి చాలా సమయం దొరికినట్లయింది. వాళ్లు పుట్టినప్పుటి నుంచి ఇంత సమయమెప్పుడూ వాళ్లతో గడపలేదు. ప్రతిరోజూ పిల్లలకేం కావాలో, ఏం తింటారో.. అడిగి మరీ వండిపెట్టడంలో తల్లికొక తృప్తి కలుగుతుంది కదా. ఆ సంతృప్తిని ఈ లాక్‌డౌన్‌ సమయంలో తనివితీరా   అనుభవించా.

ఈ కరోనా పరిస్థితుల తర్వాత మీ జీవిన శైలిని ఏమన్నా మార్చుకున్నారా?

గతంలో షూటింగ్‌లో ఉన్నప్పుడు షాట్ అయిపోయాక చకచకా వెళ్లిపోయి ఏది కావాలంటే అది పెట్టుకొని తినేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు చేతులు కడుగుతుంటే వాటిలో నుంచి వస్తున్న మురికి చూసి ‘దేవుడా.. ఇన్నేళ్లు ఎంత మురికి తిన్నానా’ అనిపిస్తోంది (నవ్వుతూ). ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిత్రీకరణల్లో పాల్గొంటున్నా కాబట్టి ఊపిరితిత్తుల్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ప్రత్యేక యోగాసనాలు వేస్తున్నా.

స్టేజి చూస్తే ఊపొస్తుంది..

  ‘‘అందరికీ స్టేజ్‌ ఎక్కాలంటే భయం వేస్తుంటుంది. నాకు ఎక్కడి లేని ఊపు, ఉత్సాహం వస్తుంది. పంచ్‌ల కోసం నేనెప్పుడూ ప్రత్యేకంగా కసరత్తులేం చేయను. కాకపోతే ఒక షోలోకి అడుగు పెడుతున్నానంటే దాని నేపథ్యం, సారాంశమేంటో గ్రహించి అక్కడ ఎలా మాట్లాడాలో ముందే ఓ అవగాహనకు వచ్చేస్తా. ఇక స్టేజిపైకి వెళ్లాక మాటల ప్రవాహం దానంతటే మొదలైపోతుంది’’.

రహస్యమదే..

‘‘అందం అన్నది నాకు వారసత్వంగా వచ్చింది. మా అమ్మమ్మ వందేళ్లకూ చాలా అందంగానే ఉంది. ఆవిడకు ముఖంపై ముడతలే రాలేదు (నవ్వుతూ). నిజానికి నా అందం   రహస్యమంటూ ప్రత్యేకంగా ఏం లేదు. టైంకి తింటా. మంచి ఆహారం తీసుకుంటా. క్రమం తప్పకుండా యోగా చేస్తుంటా. ఇవే నన్ను ఉత్సాహంగా ఉంచుతుంటాయి’’.

నటిస్తా.. కానీ!

‘‘నటన పట్ల ఆసక్తి ఉంది కానీ, నా తొలి ప్రాధాన్యం యాంకరింగే. మంచి కథలు, విభిన్న పాత్రలు దొరికితే కచ్చితంగా సినిమాలు చేస్తా. పూర్తిస్థాయిలో వెండితెరపైనే స్థిరపడాలి అనుకోవట్లేదు. ప్రస్తుతం ‘స్టార్‌ మహిళ’, ‘క్యాష్‌’ షోలతో పాటు ఓటీటీ కోసం ప్రత్యేక షోలు చేస్తున్నా’’.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని