
తాజా వార్తలు
ఆ పార్టీ వస్తే.. బెంగాల్ మరో కశ్మీరే!
భాజపా నేత సువేందు అధికారి వ్యాఖ్య
కోల్‌కతా: శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ను మరో కశ్మీర్‌గా మార్చేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తాజాగా భాజపా నేత సువేందు అధికారి దీదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ లేకుంటే దేశం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయేది అని బెహాలాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సువేందు అధికారి విమర్శించారు. ‘జై బంగ్లా’ నినాదంతో పశ్చిమ బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌గా మారుస్తారంటూ గత నెలలో తీవ్ర వ్యాఖ్యాలు చేసిన సువేందు అధికారి, తాజాగా మరోసారి తృణమూల్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు.
అలా చేస్తే తప్పేంటి..?
పశ్చిమ బెంగాల్‌ను కశ్మీర్‌గా మారుస్తారంటూ సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ‘మీ భాజపా నేతల ప్రకారం, ఆగస్టు 2019 తర్వాత కశ్మీర్ స్వర్గధామంగా మారిందని చెబుతున్నారు. అలాంటప్పుడు పశ్చిమ బెంగాల్ మరో కశ్మీర్‌లా మారితే తప్పేంటి?’ అని ప్రశ్నించారు. ఏదేమైనా బెంగాలీయులకు కశ్మీర్ అంటే ఎంతో ఇష్టమని, పెద్ద ఎత్తున కశ్మీర్‌ను సందర్శిస్తారన్నారు. అందుకే మీ తెలివితక్కువ వ్యాఖ్యలకు మిమ్మల్ని క్షమిస్తున్నామని ఒమర్ అబ్దుల్లా సువేందు అధికారి వ్యాఖ్యలకు ట్విటర్లో బదులిచ్చారు. కశ్మీర్ ఆర్టికల్ 370ను రద్దుచేసి కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ఈ విధంగా స్పందించారు.
రాష్ట్రంలో ఎన్నికల పోరులో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు రాజకీయ విమర్శలకు పదనుపెట్టాయి. రాష్ట్రంలో కీలక స్థానంగా భావిస్తోన్న నందిగ్రామ్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భాజపా నుంచి సువేందు అధికారి తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బెంగాల్ ఎన్నికల్లో మొత్తం 20 బహిరంగ సభల్లో పాల్గొంటారని అంచనా. ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 శాసనసభ స్థానాలకు ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 27న తొలి దశ పోలింగ్ జరుగనుండగా, ఏప్రిల్ 29వరకు చివరిదశ పోలింగ్ జరగనుంది.