
తాజా వార్తలు
కోపాన్ని కంట్రోల్ చేసుకోక తప్పదు : రాశీఖన్నా
ముంబయి: దక్షిణాదిలో నటిగా గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు నటి రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె షాహిద్‌కపూర్ సరసన ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సెట్లోకి అడుగుపెట్టిన రాశీఖన్నా తాజాగా కిక్ బాక్సింగ్ చేస్తున్న ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఇందులో ఆమె బాక్సర్‌గా కనిపించనున్నారా? అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె స్పందించారు.
‘‘చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్లో నటిస్తున్నాను. షాహిద్కపూర్తో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర గురించి ఇప్పుడే బయటపెట్టలేను. కాకపోతే పాత్ర కోసం సిద్ధమవడంలో భాగంగా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. నా లుక్స్ పట్ల ఫిల్మ్‌మేకర్స్ ఎలాంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. కాకపోతే నేనే ఇంకొంచెం ఫిట్‌గా మారాలని భావించాను. అందుకే ఇలా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే సెట్లో ఉన్నంతసేపు కోపాన్ని ప్రదర్శించలేం. అలాంటి కోపం, చిరాకు నుంచి బయటకు రావడం కోసం జిమ్‌లో వర్కౌట్లు చేసేదాన్ని. ఇప్పుడు కిక్ బాక్సింగ్ సైతం చేస్తున్నాను’’ అని రాశీఖన్నా వివరించారు.