మరో 2 రోజులకు సరిపడా టీకానే ఉంది: మహారాష్ట్ర
close

తాజా వార్తలు

Published : 08/04/2021 17:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో 2 రోజులకు సరిపడా టీకానే ఉంది: మహారాష్ట్ర

ముంబయి: కరోనా విజృంభణ వేళ..మహారాష్ట్రలో టీకా కొరతపై అక్కడి ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే టీకా కొరత ఉందని ప్రభుత్వం చెప్పగా.. అసలు కొరతకు తావులేదని కేంద్రం తోసిపుచ్చింది. ఈ క్రమంలో ముంబయిలో 26 టీకా కేంద్రాలు మూతపడ్డాయని గురువారం మహారాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్‌ తోపే చెప్పారు. మరో రెండు రోజులకు మాత్రమే స్టాక్ అందుబాటులో ఉందని, కేంద్రం నుంచి సరఫరా కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.

ముంబయిలో ఉన్న మొత్తం 120 టీకా కేంద్రాల్లో ఇప్పటికే 26 కేంద్రాల్లో టీకా నిండుకుందని అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేశ్ కాకాని వెల్లడించారు. మరో 20 కేంద్రాల్లో గురువారం నాటికి టీకా ఉండదని, మరో 25 కేంద్రాల్లో శుక్రవారం నాటికి ఈ పరిస్థితి తలెత్తుందని తెలిపారు. వెంటనే రాష్ట్రానికి టీకా సరఫరా చేయకపోతే మరిన్ని కేంద్రాల్లో కొరత ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కరోనాతో తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న వేళ..ఈ పరిస్థితి తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆ రాష్ట్రంలోని సంగ్లి, సతారా, గోండియా, చంద్రాపూర్‌లో టీకా కొరత నెలకొన్నట్లు సమాచారం. 

టీకా కొరతపై మంత్రి రాజేశ్‌ తోపే మాట్లాడుతూ..‘మేం జనాలకు వేగంగా టీకాలు వేస్తున్నాం. టీకా కేంద్రాలు పెరిగాయి. దేశంలో అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రానికి తక్కువ డోసులు ఎలా ఇస్తారు? మా రాష్ట్రంపై చూపుతున్న వివక్షపై ఇప్పటికే  కేంద్ర ఆరోగ్య శాఖ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశాను. ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్, హరియాణా రాష్ట్రాలకు మాకంటే ఎక్కువ టీకా డోసులు అందాయి. తాజాగా 7.5 లక్షల టీకా డోసుల్ని మాత్రమే మాకు కేంద్రం కేటాయించింది’ అంటూ గణాంకాలను వెల్లడించారు. ‘మేము రోజూ సుమారు 6 లక్షల మందికి టీకాలు అందిస్తున్నాం. ఆ లెక్కన వారానికి 42 లక్షల మందికి టీకాలు వేస్తున్నాం. దాంతో మాకు ప్రతి నెలా 1.6 కోట్ల డోసులు అవసరమవుతాయి’ అని లెక్కగట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని