close

తాజా వార్తలు

Published : 15/02/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సవాల్‌!

విసరండి... ఖాళీ కంచం

స్కూల్‌ నుంచి తిరిగొచ్చిన పిల్లల లంచ్‌ బాక్స్‌ తెరిచిచూస్తే అందులో పెట్టింది పెట్టినట్టే ఉంటుంది.. అమ్మ తిడుతుందనుకుంటే చెత్తబుట్టలో పారేసే పిల్లలూ ఉంటారు.. పిల్లలు ఇలా చేయడం వల్ల.. ఓపక్క ఆహారం వృథా అవ్వడమే కాదు... మరోపక్క పిల్లలకు సరైన పోషకాలూ అందవు. దీనికి ‘ఖాళీ కంచం సవాలే’ పరిష్కారం అంటున్నారు దీనికి శ్రీకారం చుట్టిన ప్రశాంతి...

గరాల్లో ఉండే చాలామంది పిల్లలకు ఒక్క అన్నం మెతుకు పండాలంటే ఎంత శ్రమ ఉంటుందో తెలియడం లేదు. ఆ కష్టం తెలిస్తే కొంతైనా ఆహారాన్ని వృథా చేయకుండా ఉంటారనే పోషకాహార నిపుణురాలు ప్రశాంతి.. మైస్టోరీ అనే సంస్థతో కలిసి ‘ఖాళీ కంచం సవాలు’(ఎమ్టీ ప్లేట్‌ ఛాలెంజ్‌) మొదలుపెట్టారు. పిల్లల్లో రక్తహీనతను నివారించి... పోషకాహారాన్ని అందించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన అనుభవం ఉందామెకు. ఆ అనుభవంతోనే పిల్లల కోసం వినూత్నంగా ఈ ఛాలెంజ్‌తో వారిలో పోషకాహారలేమికి చెక్‌పెట్టాలనుకున్నారు. ఇంట్లో ప్లేట్‌ నిండా అన్నం పెట్టుకుని.. చివరికి తినకుండానే వదిలిపెడుతుంటారు చిన్నారులు. పిల్లలు ఎక్కువగా తినాలని లంచ్‌ బాక్సులో కుక్కికుక్కి అన్నం పెడతారు తల్లులు. దాన్ని పిల్లలు ఇంటికి అలాగే తిరిగి తీసుకువస్తారు. ఇలా చాలా ఆహారం వృథా అవుతుంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడమే ఖాళీ కంచం సవాల్‌ లక్ష్యం.

కంచంపై రైతు కథ...

పిల్లలు అన్నం విలువ గుర్తించాలంటే వాళ్లు రైతు కష్టం గురించి తెలుసుకోవాలి. అందుకే ప్రత్యేకమైన ప్లేట్లు తయారు చేశారు మైస్టోరీ బృంద సభ్యులు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం దగ్గర్నుంచి నల్లని మట్టిలో తెల్లని మల్లెల్లాంటి అన్నం చేతికొచ్చేవరకూ ఎంత కష్టపడాలి... ఎన్ని రోజులు శ్రమించాలో కంచాలపై ముద్రించారు. పిల్లలకూ రైతుల కష్టం గురించి వివరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ నిజాంపేటలోని సంగమిత్ర పాఠశాలల్లో మూడు వేల మంది విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజన సమయంలో వారితో ఈ సవాల్‌ని చక్కగా పూర్తి చేయించారు.

ఏంటీ సవాల్‌..

పిల్లలు తినేటప్పుడు ఒక్క మెతుకు కూడా వదిలేయకూడదు. ప్లేట్‌ను మొత్తం ఖాళీ చేయాలి. ఒకవేళ తినకపోతే ముందే దాన్ని స్నేహితులతో పంచుకోవాలి. ఇంట్లో అయితే సరిపడేంత అన్నమే పెట్టుకోవాలి.

పిల్లలే ఎందుకు...

పిల్లలకు చెబితే... ఈ విషయం ఇంట్లో ఉన్న అమ్మలకు వివరిస్తారు. భోజనం చేసేటప్పుడు ఆహారం వృథా కావొద్దంటే ఏం చేయాలో చెబుతారు. టిఫిన్‌ బాక్సుల్లో సరిపోయేంత మాత్రమే భోజనం ఉండేలా చూస్తారు. భవిష్యత్తు తరాలకూ దారి చూపుతారు. అందుకే పిల్లలను ఎంచుకున్నారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని మరిన్ని పాఠశాలలో నిర్వహించనున్నారామె. మీ ఇంట్లోనూ ఈ సవాల్‌ విసరండి మరి!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని