
తాజా వార్తలు
నెలసరి చేస్తుంది!
ఒమేగా ఆహారం
పీసీఓడీ పేరు చెప్పండి... అమ్మాయిలు ఉలిక్కిపడతారు. ఊబకాయం పేరు చెప్పండి అమ్మాయిలే కాదు... అమ్మలూ కంగారు పడతారు.. వీటినే కాదు.. హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలకు సైతం ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సరైన పరిష్కారం అందిస్తాయని అంటున్నారు నిపుణులు...
ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, మధుమేహం .. లాంటి రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటన్నింటికీ పూర్తిగా కొవ్వులే (ఫ్యాట్స్) కారణమనుకుంటారు కొందరు. కొవ్వులనేవి శరీరానికి అవసరం లేని పోషకమని, వీటివల్ల శరీరానికి హాని జరుగుతుందని అపోహపడేవారూ ఉన్నారు. నిజానికి కొవ్వులన్నీ చెడ్డవికాదు. మానవ శరీరానికి అవసరమైన పోషకాల్లో కొవ్వులూ ఉంటాయి. ఇవి లేకపోతే శరీరం కొన్ని రకాల విటమిన్లను శోషించుకోలేదు. మరీ ముఖ్యంగా ఎ, డి, ఇ, కె విటమిన్లు. హార్మోన్ల సమతుల్యతకు, మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి కొవ్వులు కావాల్సిందే.కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు. అవి... శాచురేటెడ్, అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు. ఈ రెండు ఫ్యాటీ ఆమ్లాలు అన్ని నూనెల్లో ఉంటాయి. కానీ, అవి ఉండే మోతాదు మారవచ్చు. నెయ్యి, వెన్న, కొబ్బరినూనెలో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. పల్లీ, కుసుమ, పొద్దుతిరుగుడు, రైస్‌బ్రాన్ నూనెల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
* ఆరోగ్యవంతమైన మహిళకు రోజుకు దాదాపు 1800 కెలొరీలు అవసరమవుతాయనుకుంటే... వీటిలో 25 నుంచి 35 శాతం కొవ్వుల నుంచే శక్తి అందాలి. ఈ శక్తిలో దాదాపు కొంతభాగం శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల నుంచి, మరికొంతభాగం పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల నుంచి అందాల్సి ఉంటుంది. ద్రవస్థితిలో ఉండే వంటనూనెలన్నీ ఈ పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల కోవలోకి వస్తాయి. రసాయనికంగా వీటిని ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలనీ, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలనీ అంటారు.
* ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా చేపల (సాల్మన్, ట్యూనా, ట్రౌట్, మాక్రెల్, సార్డిన్స్, హెర్రింగ్) నుంచి అందుతాయి. అవిసె గింజలు, వాల్‌నట్స్‌లో కూడా పుష్కలంగా ఉంటాయి. అవిసెగింజలు, వాల్‌నట్స్‌తో పోలిస్తే చేపల్లోని ఒమేగా-3 త్వరగా శోషితమవుతుంది.
ఈ ఫ్యాటీ ఆమ్లాల ఉపయోగం
* గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటాయి. అంతర్గత వాపులు రాకుండా చూస్తాయి.
* పీసీఓడీ సమస్యను ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కనిపించడం సహజమే. హార్మోన్ల సమతుల్యతకు ఈ ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరమవుతాయి.
* ప్రతి మహిళ రోజూ దాదాపు 20 గ్రాములు లేదా నాలుగు చెంచాల కొవ్వులు/నూనెలు తీసుకోవచ్చు. ఊబకాయానికి చికిత్స తీసుకుంటున్నవారు కూడా కొవ్వులు నిర్ణీత మొత్తంలో తీసుకోవాల్సిందే. వాటిల్లో ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. వాల్నట్స్, అవిసెగింజలు లాంటివి తీసుకుంటున్నప్పుడు నూనె పరిమాణాన్ని తగ్గించుకోవాలి.
* చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం.
* గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఈ ఒమేగా-3 పోషకం చాలా అవసరం. గర్భస్థ శిశువు మానసిక ఎదుగుదలకు, చిన్నారుల మెదడు పెరుగుదలకు ఇది ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఈ పోషకం ఉండే ఆహారపదార్థాలను తప్పకుండా తీసుకోవాలి.