close

తాజా వార్తలు

Published : 23/01/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిట్ట నేర్పింది బ్రహ్మ చాటింది..!

సంకల్పిస్తే కానిదే లేదని

టిట్టిభం అనేది చాలా చిన్నపక్షిజాతి. దీన్నే లకుముకి పిట్ట అంటాం. టిట్టిభ జాతికి చెందిన ఓ ఆడ పక్షి ఓ సారి సముద్రతీరంలో గుడ్లు పెట్టింది... అవి బిడ్డలుగా మారాలని ఎదురుచూస్తోంది...ఓ రోజున ఆహారం కోసం బయటకు వెళ్లింది. ఇంతలో ఉద్ధృతంగా వచ్చిన సముద్రపు అల ఆ గుడ్లను సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది. ఇంతలో ఆ పక్షి తిరిగొచ్చింది... చూస్తే గుడ్లు లేవు. కట్టుకున్న కలలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి...తీవ్రంగా ఆవేదన చెందిందా పక్షి...తాను చూస్తే ఇంత... ఆ జలరాశేమో అనంతం... తన బిడ్డలకు ఎలాగైనా లోకం వెలుగు చూపించాలి. సముద్రం నుంచి తన గుడ్లు బయటకు తీసుకురావాలనుకుందా పక్షి. తన ముక్కుతో సముద్రపు నీటిని పీల్చి ఒడ్డున వదిలిపెట్టింది. ఇలా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడేస్తే తన గుడ్లు బయటకు వస్తాయని ఆ పిట్ట ఆలోచన. ఓ బుల్లి పిట్టకు సముద్రపు నీరంతా తోడటం సాధ్యమయ్యే పనేనా? పిట్టకు మాత్రం ఈ సందేహం రాలేదు. దాని మనసులో ఉంది ఒకే లక్ష్యం. నీరు తోడుతూనే ఉంది.
సాటి పక్షులు ఇదంతా చూశాయి. కొన్ని పక్షులు నిరాశపరిచాయి. మరికొన్ని తోటి పిట్టకు సాయం చెయ్యాలని తామూ నీరు తోడటం ప్రారంభించాయి. క్రమంగా  వేలాది పక్షులు ఈ పనికి జతకూడాయి. క్రమంగా ఈ విషయం పక్షిరాజు గరుత్మంతుడి వరకూ వెళ్ళింది. రాజాజ్ఞతో లక్షలాది పక్షులు సముద్రపు నీరు తోడటం ప్రారంభించాయి. తన తీరంలో జరుగుతున్న ఈ అల్లకల్లోలాన్ని సముద్రుడు గుర్తించాడు. విషయం తెలుసుకుని, తన గర్భంలో ఉన్న గుడ్లను తీసుకువచ్చి లకుముకి పిట్టకు అందించాడు. పిట్ట చిన్నదే. కానీ దాని సంకల్ప బలానికి సముద్రుడే తలవంచాడు.


 

మహాప్రళయం ముగిసింది...తిరిగి సర్వలోకాలనూ సృష్టించాలి...విశ్వాన్ని జవజీవాలతో నింపాలి.భగవత్‌శక్తితో సమస్తాన్నీ తేజోమయం చేయాలి...కానీ ఎలా?ఎటు చూసినా శూన్యం.అనంతమైన గాఢాంధకారం...చేతిలో పూచిక పుల్ల లేదు...ఉన్నదొకటే తీవ్రమైన కోరిక.ఎలాగైనా సకల ప్రాణకోటినీ సృజించాలనే ఆలోచన..ఆ ఆలోచన బలపడింది. సంకల్పంగా మారింది.అనంతాకాశం నుంచి ‘తప’..‘తప’ అనే శబ్దం వినిపించింది. ఆ ప్రచోదన ఆధారం చేసుకుని బ్రహ్మ తపస్సు చేశాడు.ఫలితంగా విరాట్పురుషుడైన నారాయణుడు ప్రత్యక్షమై బ్రహ్మకు వేదాలను అందించాడు. వాటి సాయంతో ఆయన సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించాడు. బ్రహ్మ ముఖం నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు. అక్కడ నుంచి మిగిలిన సృష్టి అంతా ఆవిష్కృతమైంది. మొత్తంగా మనం చూస్తున్న ఈ చరాచర జగత్తు మొత్తం వచ్చింది. బ్రహ్మ మనస్సులో జనించిన మహోన్నత సంకల్పం శూన్యం నుంచి సృష్టికి నాంది పలికింది.  సంకల్పానికి ఉన్న సర్వోన్నతమైనశక్తికి ఇది నిదర్శనం.
ఆ మూడు శక్తులూ...
సంకల్పమంటే... పట్టుదల. ఓ గట్టి నిర్ణయం. మొక్కవోని దీక్ష.  ప్రతి మనిషిలో ఇచ్ఛ, జ్ఞాన, క్రియలనే మూడు సహజ శక్తులు ఉంటాయి. అవి తనలో ఉన్నాయన్న ఎరుక కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. వీటిలో మొదటిదైన ఇఛ్చాశక్తే సంకల్పం. మనలో ఉండే అతి గొప్ప శక్తి వనరు ఇది. సంకల్పం మనలో ఉద్భవించిననాడు జ్ఞాన, క్రియా శక్తులు ఏకమై ఆ కార్యాన్ని నెరవేర్చుతాయి. సంకల్పం మనసుకు సంబంధించిందే అయినా దాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా ఓ పథకం ప్రకారం ముందుకు సాగితే గెలుపు అనివార్యం.

పరిశుద్ధమైన ఆలోచన...
సమ్యక్‌ అంటే పరిశుద్ధత... కల్పన అంటే ఆలోచనల సమూహం. సమ్యక్‌ కల్పనే సంకల్పం. పరిశుద్ధమైన ఆలోచనల సమాహారమే సంకల్పంగా మారాలని చెబుతుంది శాస్త్రం. పవిత్రమైన సంకల్పాలతో శక్తి ఉత్పన్నమవుతుంది. అపవిత్రమైనవాటిËతో ఉన్న శక్తి నాశనమవుతుంది. మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేే పవిత్ర ఆలోచనలను పోగు చేసుకోవడమే జీవిత పరమార్థం. సంకల్పం అనే వాహనం మనల్ని అజ్ఞానం నుంచి సత్యం వైపు తీసుకెళితేనే జీవితానికి సార్థకత.
ఎలా ఉండాలి?
మనిషికి ఎలాంటి సంకల్పం ఉండాలన్న విషయాన్ని వేదాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. రుగ్వేదంలో ‘ఓం వాజ్ఞ్మ మనసి ప్రతిష్ఠితా! మనోవాచి ప్రతిష్ఠితా. మాలిరావీర్మ ఏధి! శ్రుతం మే మా ప్రహసీర సేనాధితే నా హోరాత్రాన్‌ సందధామృతం వదిష్యామి! సత్యం వదిష్యామి! తన్మామవతు! తద్వక్తార మవతు! మావమవతు వక్తారమవతు వక్తారమ్‌!’
నా వాక్కు మనస్సులో ప్రతిష్ఠితం అవ్వాలి. నేను నేర్చుకున్నదీ, విన్నదీ నన్ను వీడిపోకూడదు. నేర్చుకున్న మంచిని సదా మననం చేస్తాను. నేను పారమార్థిక సత్యాన్ని పలుకుతాను... అంటూ ఈ మంత్రం సాగుతుంది. మనసు ఎప్పుడూ మంచి భావాలతో నిండి ఉండాలని చెబుతుంది.

శుభం అని తలచు...
యుజుర్వేదంలో అంతర్భాగంగా ఉన్న మహన్యాసంలోని శివసంకల్ప సూక్తంలో ‘యే వేదం భూతం భువనం భవిష్యతి...’ అంటూ సాగే 39 మంత్రాలు ఉంటాయి. ప్రతి మంత్రంలో ‘తన్మే మనశ్శివ సంకల్పమస్తు’ అనే వాక్యం కనిపిస్తుంది.
‘నా మనస్సులో ఎప్పుడూ మంగళకరమైన, పవిత్రమైన సంకల్పాలు కలుగుగాక’ అని దీని అర్థం. మన మనస్సు ఎప్పుడూ శుభాన్ని కోరుకోవాలి. అటువంటి ఆలోచనలే చెయ్యాలి. అప్పుడు మనకే కాదు... మన చుట్టూ ఉన్న సమాజానికి, అంతిమంగా లోకానికి క్షేమం కలుగుతుంది. వేదం ఆశించిన లోకక్షేమం ఇది.

వికల్పాలుంటాయి:
మనం సాధించే విజయానికి మూలకారణం మనలో కలిగే సంకల్పం. అది ఆలోచన రూపాన్ని దాటి ఆచరణలోకి రావడం అంత సులభమేమీ కాదు. అందుకు ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి.  వ్యతిరేక ఆలోచనలను వికల్పం అంటారు. సంకల్ప, వికల్పాల మధ్య మన మనస్సు ఎప్పుడూ కొట్టుమిట్టాడుతుంటుంది. ఈ సంఘర్షణలో విజయం సాధించటంలోనే మన నేర్పు ఆధారపడి ఉంటుంది. సాధన ద్వారా వికల్పాన్ని మనస్సు నుంచి దూరం చేస్తే ఆలోచనలు కార్యరూపం దాల్చి, అంతిమంగా సంకల్పసిద్ధి కలుగుతుంది.
- కప్పగంతు రామకృష్ణ


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.