IPL: బబుల్‌లో Virus అలా అలా..
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 06:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: బబుల్‌లో Virus అలా అలా..

అహ్మదాబాద్‌

గత ఏడాది యూఏఈలో మాదిరే.. ఈసారి   స్వదేశంలోనూ బయో బబుల్‌లోనే నిర్వహించారు ఐపీఎల్‌ను. బబుల్‌ అంటే అందులో ఉన్న వాళ్లు బయటి వాళ్లను కలవరు. అందులోకి బయటి వాళ్లు రారు. బబుల్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చాకే అనుమతిస్తారు. బుడగలోకి వెళ్లాక బయటి వాళ్లతో సంబంధమే ఉండదు కాబట్టి.. లీగ్‌ మధ్యలో అసలు కరోనా కేసులు ఎలా బయటపడ్డాయన్నది అర్థం కాని విషయం. దీన్ని బట్టి బుడగ పకడ్బందీగా లేదు, ఎక్కడో లోపం జరిగిందన్నది స్పష్టం. అసలు బుడగలోకి వైరస్‌ ఎలా వచ్చింది.. ఎలా విస్తరించింది అన్న ప్రశ్నలు ఇప్పుడందరినీ తొలిచి వేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బబుల్‌ దాటి బయటికి వెళ్లడం, తిరిగి వచ్చాక యధావిధిగా జట్టును కలవడమే అని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే.. మే 1న అహ్మదాబాద్‌లో ఉన్న వరుణ్‌ కడుపులో సమస్య తలెత్తితే స్కానింగ్‌ కోసం తాను బస చేస్తున్న హోటల్‌ నుంచి బయటికి వెళ్లాడు. ఒక ఆసుపత్రిలో స్కానింగ్‌ పూర్తి చేసుకుని కాసేపట్లోనే తిరిగొచ్చాడు. అయితే ఇలా తప్పనిసరి పరిసితుల్లో ఎవరైనా బబుల్‌ దాటి బయటికి వెళ్లి తిరిగి వస్తే.. కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. కానీ వరుణ్‌ మాత్రం ఆ షరతును పాటించలేదని తెలుస్తోంది. నేరుగా సహచరులతో కలిసిపోయాడు. అతను తమిళనాడుకే చెందిన కోల్‌కతా జట్టు సహచరుడు సందీప్‌ వారియర్‌తో కలిసి హోటల్లో భోజనం చేశాడు. తర్వాత ఈ ఇద్దరూ జట్టు బస్సులో అందరితో కలిసి ప్రయాణించి ప్రాక్టీస్‌ కోసం స్టేడియానికి చేరుకున్నారు. అయితే స్టేడియానికి వెళ్లేసరికే తనకు కొంచెం అస్వస్థతగా ఉందని చెప్పడంతో అతణ్ని విశ్రాంతి కోసం అక్కడే ఉన్న మసాజర్‌ గదికి పంపించారు. మిగతా జట్టు ప్రాక్టీస్‌కు వెళ్లారు. మామూలుగా ఏ రెండు జట్లూ కలిసి సాధన చేయకూడదన్నది బబుల్‌ నిబంధన. కానీ కోల్‌కతా జట్టు అహ్మదాబాద్‌ స్టేడియం నెట్స్‌కు వెళ్లేసరికి అక్కడ దిల్లీ జట్టు ఆటగాళ్లు సాధన చేశారు. అక్కడికి కోల్‌కతా జట్టు సభ్యులు కూడా వెళ్లారు. అప్పటికే వరుణ్‌తో కలిసి భోజనం చేసి ఉన్న సందీప్‌.. నెట్స్‌లో సాధన చేస్తున్న దిల్లీ సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను కలిశాడు. ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత మిశ్రా జట్టుతో కలిసి హోటల్‌ గదికి వెళ్లాడు. అక్కడ అతడికి అస్వస్థతగా అనిపించింది. ఈలోపు సందీప్‌కు సైతం కరోనా లక్షణాలు కనిపించాయి. వరుణ్‌తో పాటు సందీప్‌, మిశ్రా ఒకరి తర్వాత ఒకరు పరీక్షలకు వెళ్లగా.. ఈ ముగ్గురూ పాజిటివ్‌గా తేలారు. ఐపీఎల్‌ అధికారుల విచారణలో వెల్లడైన నిజాలివి. లీగ్‌లో వెలుగు చూసిన మిగతా కేసుల విషయమై కూడా ఇలాగే వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. మొత్తంగా చూస్తే.. స్కానింగ్‌ కోసం వరుణ్‌ బయటికి వెళ్లడంతో మొదలైంది సమస్య. చివరికది వేల కోట్లతో ముడిపడ్డ ఐపీఎల్‌ అర్ధంతరంగా ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని