close

తాజా వార్తలు

Updated : 05/01/2020 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బుజ్జి బొజ్జాయిలు..

చిన్నారుల్ని చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలు
ఎత్తుకు తగ్గ బరువుపై అవగాహనాలేమి.. అశ్రద్ధ
ఊబకాయం ముప్పుపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు
అమరావతి ఫీచర్స్‌, న్యూస్‌టుడే

గుంటూరుకు చెందిన ఆరేళ్ల నివాస్‌ ఉన్నత కుటుంబానికి చెందిన పిల్లాడు. ఏది కావాలంటే అది తింటూ బాల భీముడిలా మారాడు. తల్లిదండ్రులు కూడా అతడు ఏం కావాలంటే అది క్షణాల్లో పెట్టేవారు. అతడి వయసు.. ఎత్తునుబట్టి 20 కేజీలలోపు బరువు ఉండాలి. కానీ 38 కేజీల బరువు ఉన్నాడు. బలంగా బాబు ఉన్నాడని తల్లిదండ్రులు మురిసిపోయారే తప్పించి అతడి బాల్యాన్ని అనారోగ్యం చిదిమేస్తుందని గుర్తించలేదు. కొంచెం దూరం నడకకే ఆయాసం రావడం.. ఒళ్లంతా ఎప్పుడూ వేడిగా ఉండటం వంటి లక్షణాలతో అతడి తండ్రికి అనుమానం కలిగింది. వైద్య నిపుణుడి వద్దకు తీసుకెళ్తే వివిధ రకాల పరీక్షలు నిర్వహించి థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బరువుతగ్గి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండేందుకు ఆ చిన్నారి కోసం ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

విజయవాడకు చెందిన ఆయూబ్‌ వయసు పదేళ్లు. బాల్యంలోనే అతడికి మాంసాహారంపై ఇష్టం కలిగింది. ఎత్తుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకంటే మూడింతలు అధికంగా ఉన్నాడు. తరచూ జ్వరం.. జలుబు.. దగ్గు వంటి సమస్యలతో సతమతమయ్యేవాడు. మాంసంతో రోగ నిరోధకశక్తి మెరుగ్గా ఉండాల్సినప్పటికీ అనారోగ్య సమస్యలు కుమారుడిని చుట్టుముడుతుండటంపై తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. వారు వైద్య నిపుణుడి వద్దకు వెళితే పరీక్షించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికే కొన్ని పేగులు గ్యాస్ట్రిక్‌ సమస్యతో పాడైపోయినట్లు గుర్తించి శస్త్రచికిత్స చేశారు.

నివాస్‌.. ఆయూబ్‌ల మాదిరిగా నవ్యనగరిలో ఎంతోమంది చిన్నారులు ఊబకాయం సమస్యతో సతమతమవుతున్నారు. యాంత్రిక జీవితం.. మారిన జీవనశైలి.. చిరుతిండ్లు.. పిల్లల ఎదుగుదలపై పెద్దల్లో లోపిస్తున్న శ్రద్ధతో బాల్యాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. బొద్దుగా ఉండి ముద్దొస్తున్నాడే అంటే పిల్లల్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కానీ ఆ బరువు వెనుక ఉన్న అవరోధాల్ని వారు చేయిదాటకముందే గుర్తించలేకపోతున్నారు. గతంలో 40, 50 ఏళ్లకు ఊబకాయం సమస్య వచ్చేది. ఇప్పుడు నాలుగైదు వయసుల నుంచే ఇది చుట్టుముడుతోంది. నవ్యనగరిలోని నగరాలు.. పట్టణాల్లో నివశించే పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. వయసు.. ఎత్తుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుపై శ్రద్ధ లోపించడమే అసలు సమస్యగా మారుతుంది.

ఊబకాయం సమస్య తలెత్తాక బరువు తగ్గడం అంటే మహా కష్టంగా ఉంటుంది. ఒకేసారి బరువు తగ్గాలనుకోవడం కూడా సరికాదు. వారానికి కనీసం అరకేజీ తగ్గుతూ పోతే ఎటువంటి రుగ్మతలు తలెత్తవు. దీనికి ఏకైక మార్గం వ్యాయామం చేయడమే. బరువు తగ్గేందుకు నిపుణుల సూచనలివే..

* సీజనల్‌గా లభించే పండ్లను చిన్నారులకు అలవాటు చేయాలి. పండ్లలో పీచు పదార్థం ఉంటుంది. దీంతో బరువు పెరిగే సమస్య ఉండదు. పైగా అనారోగ్య సమస్యల్ని పండ్లు దరిచేరనివ్వవు.
* సాధారణ పద్ధతుల్లో బరువు తగ్గాలంటే నడక, గుట్టలెక్కడం, తోటపని, నృత్యం, యోగా, ప్రాణాయామం చేయవచ్చు.
* చిన్నారుల్లో ఊబకాయాన్ని తగ్గించేందుకు ఆహారంలో కోత బదులు శారీరక శ్రమ పెంచడం మేలు. ఒకేసారి కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం అందించాలి.
* జాగింగ్‌, సైక్లింగ్‌, ఈత, ఏరోబిక్స్‌, బ్రిస్క్‌ వాకింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా స్థూలకాయ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చని ఎన్‌ఐఎన్‌కు చెందిన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
* ఉదయంపూట ఎండలో వ్యాయామం చేయడంతో శరీరానికి అవసరం మేరకు డీ మిటమిన్‌ అందుతుంది. అది పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
* వనస్పతి, బేకరీ ఆహారం, మిఠాయిలకు దూరంగా ఉంచాలి.
* కొవ్వు పరిమితంగా ఉండే పాలను ఇవ్వాలి. చక్కెర, ఉప్పు, శీతల పానీయాలకు కోత వేయాలి.
* పిల్లలకు ఊబకాయంతో వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు సాధ్యమైనంత మేరకు దూరంగా ఉంచాలి.

అమరావతిలో ఓ ఆరోగ్య సంస్థ ఇటీవల చేపట్టిన సర్వే ప్రకారం రాష్ట్రంలోనే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని చిన్నారులు ఊబకాయంలో ముందున్నారు. ఆ సర్వే గుంటూరు జిల్లాలోని 2,52,909 మంది చిన్నారుల్ని పలకరిస్తే వారిలో 36,928 మంది ఊబకాయులు ఉన్నట్లుగా తేలింది. కృష్ణాలో 2,10,394 మంది చిన్నారులకు 36,788 మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.

మీరు బలంగా ఉన్నారా..
ఎత్తుకు తగ్గ బరువుంటే ఆరోగ్యంగా జీవింవచ్చు. అది పెరిగితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. పోషకారస్థాయిని శరీర బరువుతో కొలుస్తారు. బాడీ మాస్‌ ఇండెక్ట్‌(బీడీఎం) ద్వారా మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో ఎవరైనా సులువుగా తెలుసుకోవచ్చు.
* వ్యక్తి బరువు కేజీల్లో.. ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. బరువు, ఎత్తుతో భాగిస్తే వచ్చే అంకెలు మన శరీరస్థితిని తెలియజేస్తాయి. 18.5 కంటే తక్కువగా ఉంటే పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు. 25 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయం ఉచ్చులో పడినట్లే. 30 కంటే ఎక్కువ ఉంటే అత్యంత ప్రమాదకరంలో ఉన్నట్లు.
* చిన్నారులు ఊబకాయులుగా మారకుండా ఉండేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వాలు బాధ్యతగా దీన్ని భావిస్తూ వివిధ రకాల చర్యల్ని తీసుకుంటున్నాయి. పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉన్న దేశాల్లోని ప్రజల ఆయుఃప్రమాణం పెరుగుతూ ఉంది. దీనికి కారణం ఆరోగ్యంపై వారు బాల్యం నుంచి చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధగా ఉంది. నవ్యనగరిలోనూ అలాంటి విధానాలు వచ్చి బాల్యం పరిపుష్టిగా ఉండేలా తల్లిదండ్రులు.. విద్యాశాఖ.. ప్రభుత్వం నుంచి కృషి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని