close

తాజా వార్తలు

Updated : 14/01/2021 07:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా..

అద్దె బంధువుల సందడి

 నగరంలో నయా ధోరణి

నగరంలో ఓ వేడుకలో అద్దె బంధువులు

ప్రముఖ వ్యాపారి ఇంట పెళ్లి. అతిథి మర్యాదలు చేస్తూ యువతీయువకులు హడావుడి చేస్తున్నారు. ఆత్మీయమైన పలుకరింపులతో సందడి చేసే వారిని చూసి వరుసకు ఏమవుతారో తెలుసుకోవాలనిపిస్తుంది. వారిని అడిగితే మాత్రం ‘పెళ్లింటి బంధువులం’ అంటూ సమాధానమిస్తారు. ఆరా తీస్తే తెలుస్తుంది.. వారంతా అద్దె బంధువులని. శుభ కార్యాలకే కాదు.. చావు వంటి కార్యాల్లోనూ అద్దె బంధువులు కనిపిస్తున్నారు. నగరంలో ఈ ధోరణి ఎక్కువ కనిపిస్తోంది.

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో అద్దె బంధుత్వం కుదిర్చేందుకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఏ వయసు బంధువులు కావాలి ? డ్రెస్‌ కోడ్‌ ఎలా ఉండాలి ? ఎంత మంది కావాలని ముందే ఒప్పందం చేసుకుంటే సరి.. సమయానికి బంధుగణం కార్యక్రమంలో ప్రత్యక్షం అవుతుంది. కార్యక్రమంలో 6 గంటల పాటు సొంత మనిషిలా ఉన్నందుకు రూ.1000-1500 వరకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పెళ్లిళ్లు, చావులు కార్యమేదైనా జూనియర్‌ ఆర్టిస్టులకు మంచి గిరాకీ ఉంటోందని ఓ ఈవెంట్‌ మేనేజర్‌ తెలిపారు.
* 25ఏళ్ల కిందట హైదరాబాద్‌ వచ్చి ఇప్పుడు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిన ఓ కుటుంబం అమెరికాలో చదువు పూర్తి చేసిన కుమారుడి పెళ్లి ఇటీవల చేసింది. ఉద్యోగం, సంపాదన, పనుల్లోపడి చిన్ననాటి బంధువులు ఫోన్లో పలకరింపుల వరకే పరిమితమవడంతో వాట్సాప్‌ లేఖలు పంపారు. పెళ్లంటే ఎంతో సందడి ఉండాలని గుర్తుకొచ్చి కనీసం 200 మందైనా లేకపోతే పరువు పోతుందని ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను సంప్రదించింది. 5 నుంచి 6 గంటల పాటు డ్రస్‌ కోడ్‌తో పెళ్లిలో సందడి చేసేందుకు 200 మంది యువతీ, యువకులను పంపాలని కోరినట్లు ఓ ఈవెంట్‌ మేనేజర్‌ తెలిపారు.
దేనికైనా రెడీ..
కాస్తో కూస్తో డబ్బున్న కుటుంబాల్లో పెద్దవాళ్లు మరణించినప్పుడు కాటి వరకూ సాగనంపేందుకు కిరాయి మనుషులే పెద్ద దిక్కవుతున్నారు. ఓ శ్మశాన వాటిక వద్ద ఉన్న నలుగురు మహిళలను కదిలిస్తే..‘ఎవరో పెద్దాయన చనిపోతే మమ్మల్ని రమ్మన్నారు. వీలుంటే మరో కొందర్ని తీసుకొని రమ్మన్నారు. ఈ నెలలో ఇప్పటికీ మూడుసార్లు వెళ్లొచ్చాం. చనిపోయిన వ్యక్తి బంధువు అవుతారని కాసేపు నటిస్తే చాలు. ఒక్కొక్కరికి రూ.300-500 వరకు ఇస్తారు.’ అని చెప్పుకొచ్చారు.
ఎందుకిలా..
సంపదలు, కీర్తి ఎంత ఉన్నా కొందరి ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు అసలైన బంధువులు రాక ఫంక్షన్‌ హాలు నిండటమే కష్టంగా మారుతోంది. అందుకే.. తమ సర్కిల్‌లో పలుచన కావటం ఇష్టంలేక కిరాయి మనుషులతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందం, ఆకర్షణ రెండింటి కోసం యువతీ, యువకులను రప్పిస్తుంటారు. అసలు బంధువులు రాకపోవడం, బంధాలు సక్రమంగా నిర్వహించకపోవడం వంటివెన్నో ఈ ధోరణికి కారణమవుతున్నాయని మానసిక విశ్లేషకులు వివరిస్తున్నారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని