close

తాజా వార్తలు

Updated : 05/03/2021 07:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ ఇంట్లో బంగారముంది

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా తెలుసు కదా.. అందులో మీది తెనాలి.. మాది తెనాలి అంటూ బ్రహ్మానందం, ఎంఎస్‌ నారాయణ తదితరులు ఏవీఎస్‌ను బోల్తా కొట్టించి రెట్టింపు చేస్తామంటూ ఒంటిపై ఉన్న బంగారమంతా కొట్టేసే సన్నివేశం గుర్తుంది కదా.. అచ్చం ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. మొత్తం నలుగుర్ని అరెస్ట్‌ చేసి రూ.5.85 కిలోల నకిలీ బంగారం, రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను గురువారం సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు.

వెలికి తీయకపోతే మరణమే... మీరాలం మండికి చెందిన స్థిరాస్తి వ్యాపారి మీర్జా అబ్బాస్‌ అలీ(46) తల్లికి ఇంట్లో దాచిపెట్టిన బంగారాన్ని తవ్వి బయటకు తీయకపోతే చచ్చిపోతావంటూ కొన్ని రోజుల కిందట కలొచ్చింది. అప్పటి నుంచి ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. ఛట్టా బజార్‌కు చెందిన మిత్రుడు అలీ అక్బర్‌ తయ్యబీకి అబ్బాస్‌ అలీ ఈ విషయాన్ని చెప్పాడు. అతను చార్మినార్‌కు చెందిన షేక్‌ హాఫీజ్‌, అబ్దుల్‌ ఫహీం సలహా కోరాడు. వాళ్లు ఓల్డ్‌ మల్లెపల్లిలో ఆర్‌ఎంపీగా వైద్యుడిగా చలామణీ అవుతున్న సయ్యద్‌ దస్తగిరి అహ్మద్‌కు చెప్పారు. ఇంటిని క్షుణ్నంగా పరిశీలించి.. మీ అమ్మకొచ్చిన కల నిజమేనంటూ బాధితుడికి చెప్పాడు. రూ.5 లక్షలు ఇస్తే పూజలు చేసి ఆ బంగారాన్ని బయటకు తీస్తానంటూ నమ్మబలికాడు. నిజమేనని భావించిన అబ్బాస్‌ అలీ ముందుగా రూ.3 లక్షలు చెల్లించాడు.

నకిలీ బంగారు బిస్కెట్లను పరిశీలిస్తున్న సీపీ సజ్జనార్‌

మూడో గొయ్యిలో మూట.. దస్తగిరి పూజ సామగ్రి, అబ్దుల్‌ ఫహీం సహకారంతో బంగారం పూతతో ఉన్న రాగి బిస్కెట్లను కొనుగోలు చేశాడు. ఇంట్లో నాలుగైదు చోట్ల గుంతలు తవ్వించారు. బంగారు పూతతో ఉన్న రాగి బిస్కెట్లను మూటలో కట్టాడు. కుటుంబ సభ్యులను మాటల్లో పెట్టి ఒక గుంతలో మూటను ఉంచాడు. ఆ తర్వాత అన్నింటిని పూడ్చేశాడు. అనంతరం పూజలు నిర్వహించి అబ్బాస్‌ అలీకి గునపం ఇచ్ఛి. మీ తల్లితో ఈ గుంతలను తిరిగి తవ్వించమని సూచించాడు. రెండు గుంతల్లో ఏం కనిపించలేదు. మూడో గుంత తవ్వేసరికి మూట కనిపించింది. తను చెప్పే వరకు ఆ మూటను తెరవొద్దని, అప్పటి వరకు పూజలు చేయాలంటూ దస్తగిరి హెచ్చరించాడు. అబ్బాస్‌ అలీ కుటుంబ సభ్యులు కుతూహలంతో మరుసటి రోజే తెరిచారు. అందులో బంగారం పూతతో ఉన్న రాగి బిస్కెట్లను చూసి అవాక్కయ్యారు. ముందే తెరవడం వల్ల ఇలా జరిగింది అంటూ దస్తగిరి చేతులెత్తేశాడు.


అసలు ఎలా బయట పడింది

తాను మోసపోయిన రూ.3 లక్షలు తిరిగి రాబట్టుకునేందుకు అబ్బాస్‌ అలీ.. అక్బర్‌ తయ్యాబీతో కలిసి పథకం వేశాడు. తులం బంగారం రూ.40వేలకు (మార్కెట్‌ ధర కంటే రూ.10వేలు తక్కువ) విక్రయిస్తామంటూ సన్నిహిత వర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఒకరిద్దరు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. ఆ బంగారు బిస్కెట్ల (తవ్వకాల్లో బయటపడిన)ను చూపించారు. అనుమానం రావడంతో క్షుణ్నంగా పరిశీలించగా అది నకిలీ బంగారమని తేలింది. రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శంషాబాద్‌ ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి అబ్బాస్‌ అలీ, అక్బర్‌ తయ్యాబీని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. 15-20 ఏళ్ల నుంచి దస్తగిరి ముఠా ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. బాధితులు ముందుకు రాకపోవడంతో వీరి ఆగడాలు బయటకు రాలేదని సీపీ సజ్జనార్‌ వివరించారు. దస్తగిరి, షేక్‌ హాఫీజ్‌, అలీ అక్బర్‌ తయ్యాబీ, మీర్జా అబ్బాస్‌ అలీని అరెస్ట్‌ చేశామని, అబ్దుల్‌ పహీం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన శంషాబాద్‌ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎస్‌హెచ్‌వో కనకయ్యను అభినందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని