close

తాజా వార్తలు

Published : 14/08/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీవన వేడుక

ఈ సువిశాల జగత్తులో నవ్వడమన్నది అత్యద్భుత జీవక్రియ. అది మనిషికి ప్రకృతి(దివ్యావరణ) ప్రసాదించిన గొప్ప వరం. పశు పక్ష్యాదులు నవ్వలేవు. హాయిగా నవ్వుతున్నపుడు జనించే జీవన మాధుర్యాన్ని అవి రుచి చూడలేవు. జీవ కోటిలో మానవుడికి తప్ప మరే జీవికీ నవ్వు తాలూకు స్పృహ ఉండదు. నవ్వడం అనేది ఎవరో నేర్పితే అబ్బేది కాదు. సేకరించి జమ చేసుకునే అంశం అంతకన్నా కాదు. అది సహజంగా జరిగేది. మాతృమూర్తి ముద్దు మురిపాలతో పసిపిల్లల్లో బోసినవ్వులు పుడతాయి. జీవన పయనంలో ఒక భాగంగా కిలకిలారావాల నవ్వులతో శైశవం మొదలవుతుంది. ఆ తరవాత వచ్చే బాల్యం ఆటపాటలతో వికసిస్తుంది. ఆ క్రమంలో బుద్ది బలమూ పెరుగుతుంది.

పూలు పూసిన మొక్కలు ఎంతటి శోభనిస్తాయో నవ్వులు విరబూసిన మోములూ అంతటి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తాయి. దాంతో పాటు ఆనందాన్ని పంచుతాయి. నగుమోములున్న వ్యక్తుల చుట్టూ ఇతరులూ గుమిగూడుతారు. ప్రత్యేక గౌరవాభిమానాలు చూపుతారు. ఎప్పుడూ వీడిపోని అనుబంధాలు పెంచుకుంటారు. మనసారా నవ్వడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలెన్నో దూరమవడమే కాకుండా, ఎలాంటి కష్టాలూ దరిచేరవని విజ్ఞులు చెబుతారు.

కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. సుఖసంతోషాలు కలిగినప్పుడు పొంగిపోకూడదు. మనిషి వర్తమానంలో నిలిచినప్పుడు మనసు బానిసైపోతుంది. అంటే, మనిషి చెప్పినట్లు మనసు వింటుంది. అప్పుడు జీవితం వేడుక అవుతుంది. అలా కాకుండా భూత భవిష్యత్తుల మధ్య డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతుంటే మనిషిని కీలుబొమ్మగా చేసి ఇష్టానుసారం ఆడుకుంటుంది. దుఃఖసాగరంలో ముంచి ఆనందోత్సవం జరగకుండా చూస్తుంది.

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతంలో ఉన్నట్లు అస్సలు ఉండదు. అది నిత్యం మారిపోతూ కొత్తగా ఉంటుంది. సర్వమూ ఎరిగి, అంతటా వ్యాపితమైన చైతన్యశక్తి ఎత్తని రూపమంటూ ఉండదు. వర్తమానం అనేకానేక నూతనావిష్కరణల కర్మాగారం.

దారి దిక్కు తెలియక, ఎటువైపు వెళ్లాలో తోచక అయోమయ స్థితిలో ఉన్నపుడు ఎదురైన బాటసారికి ఇదీ దారి అని చూపితే కలిగే ఆనందమే వేరు. దీన్ని బట్టి తెలుస్తోంది ఏమిటంటే- ఆనందానికి జ్ఞానమే మూలం అని. ఏదైనా కొత్త విషయం తెలియగానే అంటే, జ్ఞానం పొందగానే కలిగే ఆనందం ఇంతా అంతా కాదు. నిజానికి జ్ఞానం, ఆనందం వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకేదాన్ని సూచించే పర్యాయపదాలు. ఆనందోబ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ అనే పదబంధాలు వేద వాంగ్మయంలో చూస్తాం. జ్ఞానం వల్ల ఆనందం, ఈ రెండింటితో ఆరోగ్యమూ సమకూరుతుంది. ఆరోగ్యవంతుడు మాత్రమే తన చేతిలోని పనిని సంపూర్ణంగా పూర్తిచేయగలడు. నూతన ఆలోచనలతో కొత్త వాటిని కనిపెట్టి ప్రపంచానికి కానుకలుగా సమర్పించగలడు.

ఆత్మ, మనసు, శరీరం ఎలాగైతే కలిసి ఉంటాయో జ్ఞానం, ఆనందం, ఆరోగ్యం... ఈ మూడూ ఒక దానితో ఒకటి ముడివడి ఉంటాయి. ఒక వ్యక్తి పై మూడింటినీ సమపాళ్లలో కలిగి ఉండి అతడు ఏ పనిచేసినా అందులో కళాత్మకత ఉట్టిపడుతుంది. ఈ భూమ్మీద వెలసిన కళలన్నీ, మనిషి ఆనందంగా ఉన్నప్పుడు పుట్టుకొచ్చినవే. ఆ కళల లక్ష్యమూ మనిషిని ఆనందపరచడమే. ఆరోగ్యపు ఊర్థ్వతలమే ఆనందం. ఆనందం శిఖర భాగమే దివ్యత్వం. ధ్యాన సాధనతో సచ్చిదానంద రహస్యాన్ని కనుగొని ఓ క్షణ కాలమైనా ఆ వైయక్తిక అనుభూతిని చవి చూసిన మనిషి జీవితం మొత్తాన్ని వేడుక చేసుకుంటాడు!

- మునిమడుగుల రాజారావు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.