close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/07/2020 00:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉసూరుమంటున్న ఉపాధి

చిన్న పరిశ్రమలు ఛిన్నాభిన్నం

ముంబయికి చెందిన మేధాసంస్థ భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం- భారత్‌లో నిరుద్యోగిత రేటు జూన్‌ 21తో ముగిసే వారాంతానికి 8.5 శాతం. మే నెలనాటి 27.1 శాతంతో పోలిస్తే, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడింది. చాలామంది తాజా గణాంకాలను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా, గ్రామీణ భారతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ఉద్యోగిత గణాంకాల్లో మెరుగుదల నమోదైందన్న సంగతి గుర్తించాలి. గ్రామీణ నిరుద్యోగిత విషయానికొస్తే- జూన్‌ రెండో తేదీతో ముగిసిన వారాంతానికి 7.26 శాతానికి తగ్గింది. ఇది లాక్‌డౌన్‌ ముందస్తు రోజులనాటి మార్చి 22తో ముగిసిన వారాంతంలో 8.3 శాతం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కార్యకలాపాలు ఆకస్మికంగా పెరగడం, గ్రామాల్లో విత్తనాలు నాటే సీజన్‌ ప్రారంభం కావడం వంటివి ఇందుకు దోహదపడ్డాయి. పట్టణ ప్రాంత నిరుద్యోగిత ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. లాక్‌డౌన్‌ ముందునాటికన్నా ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉండటం ఈ విషయంలో కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

వ్యవస్థాగత సవాళ్లెన్నో!

నిరుద్యోగ సమస్య పెచ్చరిల్లడానికి కొవిడ్‌ మహమ్మారి ఒక్కటే కారణం కాదు. నిరుద్యోగిత రేటుకు సంబంధించిన సమస్య అప్పటికే నెలకొని ఉండగా, కొవిడ్‌ దానికి మరింతగా ఆజ్యం పోసింది. అన్నింటికన్నా ముందుగా గుర్తించాల్సిన అంశం వ్యవసాయ రంగం వృద్ధిరేటు చాలా తక్కువ స్థాయిలో ఉండటం. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల వార్షిక వృద్ధిరేటు 2014-15 నుంచి 2018-19 వరకు 2.88 శాతంగా ఉంది. వృద్ధి ప్రక్రియ ఇంతేస్థాయిలో కొనసాగితే గ్రామీణ వేతనాల్లో స్తబ్ధత నెలకొనే అవకాశం ఉంది. దేశంలోని సుమారు 43 శాతం శ్రామికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంలో వేతనాల్లో స్తబ్ధత నెలకొంటే గ్రామీణ భారత్‌లో మొత్తం డిమాండులో క్షీణత నెలకొంటుంది. ఇది పారిశ్రామిక సరకుల డిమాండ్‌ పడిపోవడానికీ దారి తీస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే పరిశ్రమలు, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులకు ఇలాంటి పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంటుంది. ఈ పరిణామం తదుపరి స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో, ఎంఎస్‌ఎంఈలలో ఉత్పత్తి తగ్గుదలకు, ఉద్యోగాలు కోల్పోయేందుకు దారి తీస్తుంది. ఫలితంగా, ఆదాయాలు పడిపోయి గిరాకీ మరింత తగ్గుతుంది. పరిస్థితి మందగమనంలోకి జారుకుంటుంది. కరోనా వైరస్‌ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. ఈ రెండు రంగాలే దేశంలోని 80 శాతం శ్రామికులకు ఉపాధిని కల్పిస్తున్నాయన్న సంగతి మరవకూడదు.

ఈ రంగాల పునరుద్ధరణకు చర్యలు తీసుకొనేందుకు మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగాలు పోకుండా, కొత్త ఉద్యోగాల సృష్టి జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యతా విధాన నిర్ణేతలపై ఉంది. వ్యాపారాలు నష్టాల్లో నడుస్తున్నప్పుడు తమ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేదెలాగనే ప్రాథమిక ప్రశ్న యజమానుల్లో తలెత్తుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రస్తుతమున్న ఉద్యోగులు, కొత్త నియామకాల విషయంలో నిర్దిష్ట కాలవ్యవధితో వేతన రాయితీలు కల్పించే అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్ఛు దీనివల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని పరిహరించవచ్ఛు

స్ఫూర్తినిస్తున్న జపాన్‌

జపాన్‌ పారిశ్రామికీకరణ విజయం అనేది రెండో ప్రపంచయుద్ధ శిథిలాల నుంచి మొదలైంది. ఆ దేశం పారిశ్రామిక రంగంలో నాయకత్వ దశకు చేరుకుంది. ఇది భారత్‌కు ఎన్నో విలువైన పాఠాల్ని బోధిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగి, యజమాని సంబంధాల విషయంలో చాలా ఉపయోగాలున్నాయి. ప్రపంచంలోని మిగతా దేశాల మాదిరిగా కాకుండా, ఏ సంస్థలోనైనా మనుషులు మాత్రమే విలువైన ఆస్తులుగా జపాన్‌ పారిశ్రామికవేత్తలు పరిగణిస్తారు. ఈ వైఖరిలో కీలకమైన అంశం... ఉద్యోగికి జీవితకాలంపాటు ఉద్యోగం దక్కడంతోపాటు, వారిలో నైపుణ్యాలు ఇనుమడింపజేసేందుకు వీలవుతుంది. సీజన్‌ బాగా ఉండి కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నప్పుడు కొంతమొత్తాన్ని శ్రామికుల భవిష్యత్తు అవసరాల కోసం దాచి పెడతారు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఉపయోగిస్తారు. దీనివల్ల శ్రామికులకు ఉద్యోగ భద్రత దక్కడమే కాకుండా, సంస్థతో బలమైన మానసిక బంధం నెలకొంటుంది. ఇది నవకల్పనలకు దారితీస్తుంది. జపాన్‌ పారిశ్రామికవేత్తలకు తమ ఉద్యోగుల పట్ల ఉండే ఇలాంటి దృక్పథం కారణంగా ఇరుపక్షాల మధ్య మంచి ఐక్యతాభావన పరిఢవిల్లుతోంది. అందరూ సమష్టితత్వంతో పనిచేయడం వల్ల ఉత్పాదకత ఇనుమడిస్తోంది. ప్రపంచస్థాయి పోటీలో జపాన్‌ విజయాల వెనక ఇది ఒక కీలక కారణంగా నిలుస్తోంది. భారత పారిశ్రామిక సంస్కృతిలో మాత్రం కార్మికులను కేవలం ఉపకరణాలుగా మాత్రమే చూడటం కనిపిస్తుంది. జపాన్‌ పద్ధతిని మనవద్ద పాటిస్తే, సంక్షోభ సమయాల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత దక్కే అవకాశం ఉంటుంది!

(రచయిత- హెచ్‌ఎన్‌బీ గఢ్వాల్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ డీన్‌)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.