close

తాజా వార్తలు

Published : 14/07/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హిందీ చీనీ... బైబై!

చైనా జిత్తులమారితనం

ద్దాఖ్‌ నుంచి చైనాకు బలమైన సందేశం పంపించడమే కాకుండా దాని దుందుడుకు వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ఇక్కట్లకు గురి చేస్తున్న జగడాలమారి పొరుగు దేశంపట్ల భారత వైఖరిలో ఎంతోకాలం నుంచి రావాలని ఆశిస్తున్న ఒక మార్పునకు నాంది పలికారు.

గతనెల గల్వాన్‌ లోయలో సరిహద్దులను తిరగరాయడానికి చైనా చేసిన ప్రయత్నం కొత్తదేమీ కాదు. ఎన్నో చొరబాట్ల జాబితాలో ఇది తాజా ఉదంతం మాత్రమే. ఇండియన్‌ ఆర్మీ వీర జవాన్లు పీఎల్‌ఏ(పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ) సైనికులను సాహసోపేతంగా అడ్డుకున్న తరుణంలో- భారత రాజకీయ పక్ష నాయకులు ధైర్యం, ఆత్మవిశ్వాసం లోపించి ప్రవర్తిస్తున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ రోజుల నుంచీ కూడా జరుగుతున్నది ఇదే. చైనాతో చెలిమి పేరిట నాటి నెహ్రూ ఏమాత్రం ఆచరణ సాధ్యంకాని కొన్ని అవాస్తవిక భావనలు కలిగి ఉండేవారు. విచిత్రం ఏమిటంటే, కాలక్రమంలో చైనాతో సంబంధాలు మెరుగవుతాయన్నది ఆయన గుడ్డి నమ్మకం. కాబట్టే పరిధిని దాటిపోయి ఆ దేశంతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. చైనాను భద్రతా మండలిలో సభ్యదేశంగా చూడాలన్న ఆయన ఆతురత ఇందుకు ఒక ఉదాహరణ.

చైనా రెటమతం...

చైనా మాత్రం అందుకు అనుగుణంగా ప్రతిస్పందించలేదు. ఇరు ప్రాంతాల నడుమ అధీన రేఖను ఖరారు చేసుకుని, సరిహద్దు సంబంధిత అంశాలను పరిష్కరించుకోవాలన్న అభిమతాన్ని ఏనాడూ కనబరచలేదు. వాస్తవ అధీన రేఖ (ఎల్‌ఏసీ)నే హద్దుగా ఉంచడానికి మొగ్గుచూపింది. ఎందుకంటే విభజన రేఖ అస్పష్టంగా ఉంటేనే ఎల్‌ఏసీకి అటువైపు ఉన్న ప్రాంతాన్ని కొద్దికొద్దిగా కబళించివేయవచ్ఛు ఈ దురుద్దేశంతోనే ఏడు దశాబ్దాలకుపైగా దేశ సరిహద్దుల్లో నిప్పుల కుంపటి చల్లారకుండా ఉంచుతూ వచ్చింది. దీన్నంతటినీ ఏమంటారు? చైనా ఒక శత్రుదేశమనేది సత్యం, చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ ఒక శత్రు సంస్థ అనేది పరమ సత్యం. ప్రముఖ న్యాయవాది మహేశ్‌ జఠ్మలానీ ఇటీవల వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.

లద్దాఖ్‌ ప్రసంగం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంపించిన సందేశం ఇంకా చెవుల్లో మోగుతుండగానే- చైనా యాప్‌లను నిషేధించాలని, పొరుగుదేశంతో ప్రాజెక్టుల బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలన్న ఆయన ప్రభుత్వ నిర్ణయం బీజింగ్‌ పాలకులకు గట్టి షాక్‌ ఇచ్చి ఉండాలి. గతంలో ఎప్పుడూ ఏ భారతీయ నాయకుడూ ఇంత తెగువతో మాట్లాడలేదు, వ్యవహరించలేదు. ‘విస్తరణ వాద యుగం ముగిసిపోయింది’ అంటూ మోదీ చేసిన విస్పష్ట ప్రకటన, తన పంథాను మార్చుకొని తీరాలన్న పదునైన సందేశాన్ని చైనా ప్రభుత్వానికి పంపించింది. ఆధిపత్య విధానాలను నమ్ముకున్న దేశాలు లేదా వాటిని అమలు చేయలనుకున్న దేశాలు సర్వనాశనమయ్యాయి. లేదంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ విధానాలకు తిలోదకాలిచ్చాయని చరిత్ర చెబుతోంది.

హిట్లర్‌ విస్తరణ వాద విధానం జర్మన్లలో తాము అజేయులమని, పొరుగుదేశాలను కబళించివేయగలమని; యూకే, రష్యా, అమెరికా మిత్ర కూటమి దేశాలను నాశనం చేయగలమన్న మిథ్యా విశ్వాసాన్ని నెలకొల్పింది. ఆస్ట్రియా, పోలండ్‌, చెకొస్లొవేకియా దేశాలను ఆక్రమించుకోవడంతో ఆధిపత్య దుస్సాహసానికి అతడు తెరతీశాడు. ఒక్కసారి వెనుతిరిగి చూస్తే.... అది ఒక దేశం ఒడిగట్టిన అవివేకపూరిత దుస్సాహసమని, ఆ నాయకుడి మితిమీరిన ఆత్మవిశ్వాసమని అర్థమవుతుంది. జపాన్‌, ఆస్ట్రేలియా, వియత్నాం, దక్షిణ కొరియా, సింగపూర్‌... ఇంకా అనేక దేశాలకు ఉన్న సాగర జలాల హక్కులను, వాటి సార్వభౌమిక అధికారాలను సవాలు చేస్తున్న చైనా- అదే కోవలో ఎల్‌ఏసీ పొడవునా భారత్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. తాజా లెక్కల ప్రకారం, 23 దేశాలతో చైనా జగడం పెట్టుకుంది. భారత్‌ పారాహుషార్‌ విజిల్‌తో ఉలిక్కిపడిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఏసియాన్‌ సభ్యదేశాలతోపాటు అనేక ప్రపంచ దేశాలూ చైనా తీరును తప్పుపడుతున్నాయి. బలం ఉన్న దగ్గరే శాంతి ఉంటుందని, ఎల్‌ఏసీ పొడవునా మౌలిక వసతుల్ని పెంచుకున్నామని దీన్ని ఇంకా పెంచుతామని ప్రధానమంత్రి మరో రెండు అతి ముఖ్యమైన సందేశాల్నీ లద్దాఖ్‌ నుంచి జారీ చేశారు.

కింకర్తవ్యం?

ప్రధానమంత్రి ప్రసంగానికి చైనా ప్రతిస్పందన హాస్యాస్పదం. సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలను రాజేయడానికిది సమయం కాదంటూ, ఎన్నో నెలలుగా సంఘర్షణ వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చిన అనంతరం, చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఇప్పుడు ప్రకటన విడుదల చేసింది. చైనా విషయంలో భారత్‌ ‘వ్యూహాత్మకమైన తప్పుడు అంచనాల’కు రాకూడదని పేర్కొంది. భారత్‌ విషయంలో ‘వ్యూహాత్మకమైన తప్పుడు అంచనాల’కు చైనాయే వచ్చిందని ఇప్పటివరకు జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి! ఇప్పటికే చాలా జరిగిపోయింది... ఇక ఆటలు సాగవు అనుకునే క్షణం- ప్రతి దేశానికీ తన జీవిత కాలంలో ఒకసారైనా వస్తుంది. చైనీయులకు సంబంధించినంత వరకు భారత్‌ ఇప్పుడదే స్థితికి వచ్చింది. మన సరిహద్దుల్లో ఒకటి కాదు, రెండు శత్రుదేశాలున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనల్ని అంతులేని వేదనకు గురిచేసిన శత్రుదేశం చైనా. ఈ వాస్తవాన్ని భారతీయులు అంగీకరించి తీరాల్సిందే. అప్పుడే మన ముందున్న కార్యం సులువు అవుతుంది. మనది 130 కోట్ల మంది ప్రజలున్న దేశం. ఇంకో రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా ఆవిర్భవిస్తాం. పంచశీలనిక మరిచిపోవాలి. హిందీ చీనీ భాయీ భాయీ మరిచిపోవాలి. తప్పదు. ప్రధానమంత్రి పదేపదే చెబుతున్నట్లు మనపై దుష్టనేత్రం సారించిన వారికి ఎదురొడ్డి నిలవాల్సిందే. పిరికితనం శాంతిని నెలకొల్పదు. బలం ఉంటేనే అది సాధ్యం!

- ఎ.సూర్యప్రకాశ్‌

(రచయిత- ప్రసార భారతి ఛైర్మన్‌)


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని