HYD: ఐటీ జోష్‌
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 07:17 IST

HYD: ఐటీ జోష్‌

పెద్దఎత్తున కొత్త నియామకాలు

టీకాల అనంతరం ప్రాజెక్టుల వారీగా కార్యాలయాలకు
ఇంటి నుంచి పని భారం పెరిగిందంటోన్న ఉద్యోగులు
ఈనాడు, హైదరాబాద్‌

టీ ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయడం మొదలుపెట్టి 15 నెలలు అవుతోంది. మరికొన్ని రోజులు రిమోట్‌గానే పనిచేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలన్నీ తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేయిస్తున్నాయి. అది పూర్తి కాగానే ప్రాజెక్టుల వారీగా ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే ప్రణాళికలో సంస్థలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు భారీగా వస్తుండటంతో  ఉద్యోగుల్ని పెద్దఎత్తున  నియమించుకుంటున్నాయి. క్లయింట్లకు చూపించేందుకు ముందుగా ఉద్యోగుల్ని తీసుకుని తర్వాత వారికి శిక్షణ ఇప్పిస్తున్నాయి. అనుభవం, నైపుణ్యం కలిగిన వారికి భారీ ప్యాకేజీలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. దీంతో ఉద్యోగులు పెద్దఎత్తున కంపెనీలు మారుతున్నారు.  అదే సమయంలో పనిభారం పెరిగిందని ఉద్యోగులు అంటున్నారు.

మహమ్మారికి ముందు, తర్వాత ఉత్పాదకతపై ఆసియాలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలోని పదివేల మంది ఉద్యోగులపై అధ్యయనం చేపట్టారు. పని గంటలు 30 శాతం పెరిగాయి. ఇందులో 18 శాతం కార్యాలయాల పనిగంటలు ముగిసిన తర్వాత చేస్తుండటం గమనార్హం. అదే సమయంలో సగటు ఉత్పాదకతలో పెద్దగా మార్పు కనిపించలేదు. పెరిగిన పనిగంటలతో పోల్చిచూసినప్పుడు ఉత్పాదకత 20 శాతం తగ్గడం గమనించాలని అధ్యయనకర్తలు అంటున్నారు.  

ఎందుకిలా..: ఇంటి నుంచి పని వల్ల తోటి ఉద్యోగులతో సమన్వయం చేసుకునేందుకు ఎక్కువ గంటలు శ్రమించాల్సి వస్తోంది. ఎక్కువ సేపు వారితో సమావేశం కావాల్సి వస్తోంది. సమయం ఇక్కడే చాలా వృథా అవుతున్నట్లు ఉద్యోగులు అంటున్నారు. ఫలితంగా ఆ మేరకు ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది.  

పిల్లలున్న ఇంట్లో..
ఐటీ ఉద్యోగుల్లో యువతరమే ఎక్కువ. 20 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్లలోపు వారే ఎక్కువగా పనిచేస్తున్నారు. అత్యధిక శాతం మంది ఐటీ ఉద్యోగుల ఇళ్లలో బడిఈడు పిల్లలే అధికం. వీరిని ఒకపక్క చూసుకుంటూ మరో పక్క ఉద్యోగం చేయడం ముఖ్యంగా మహిళా  ఐటీ ఉద్యోగులకు సవాలే. 15 నెలలుగా సవాళ్లను అధిగమిస్తూ పనిచేసుకుంటూ సాగిపోతున్నారు. ఇక్కడే వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు లేని ఐటీ ఉద్యోగులతో పోలిస్తే... పిల్లలు ఉన్న ఇంట్లో పనిచేస్తున్న వారు ఎక్కువ గంటలు కృషి చేయాల్సివస్తోంది.  ఇంట్లో కార్యాలయాల వాతావరణం లేకపోవడంతో ఏకాగ్రత కుదరడం లేదు. ఇవన్నీ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నాయి. కార్యాలయాల్లో 5.08 గంటల్లో వందశాతం ఉత్పాదకత సాధిస్తే.. ఇంటి నుంచి పనితో 7.04 గంటలు పడుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో అధ్యయనంలో తేలింది.  

మన వద్ద పెరిగింది...
- సందీప్‌ మక్తాలా, అధ్యక్షుడు, తెలంగాణ
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటా)

మన దగ్గర ఉత్పాదకత కంపెనీ పరంగా చూస్తే పెరిగింది. ఇదే విషయాన్ని సంస్థలు చెబుతున్నాయి.   సైబర్‌ టవర్స్‌లో ఒక ఉద్యోగి పనిచేయాలంటే నెలకు రూ.5700 వరకు వ్యయం అవుతుంది.  ఇంటి నుంచి పనితో ఈ మేరకు కొంతైనా వ్యయం తగ్గినట్లే. పైగా మన దగ్గర ప్రతి ఉద్యోగి ఈరోజు, రేపు ఏం చేయాలనేది ముందే నిర్దేశిస్తారు. ఆ గడువు లోపల పని పూర్తి చేయాల్సిందే. ఆ మేరకు ఒత్తిడి ఉంటుంది. పనిభారం కొవిడ్‌ రెండోవేవ్‌తో మరింత పెరిగిన మాట వాస్తవం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని