close

తాజా వార్తలు

Published : 22/10/2020 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉబికి వస్తున్న నీళ్లు

ముంపు ముప్పులో అపార్టుమెంట్లు
నీటి ఊటతో నిండిపోతున్న సెల్లార్లు
తోడేందుకు వేలాది రూపాయల ఖర్చు
భారీ వర్షాలతో గణనీయంగా పెరిగిన భూగర్భజలమట్టాలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్‌ నగరంలోని బహుళ అంతస్తు భవనాలకు కొత్త ముప్పు పొంచి ఉంది. చాలాచోట్ల సెల్లార్లలో భూగర్భం నుంచి నీరు ఊరుతోంది. 24 గంటలూ మోటార్లతో తోడాల్సి వస్తోంది. నగరంలోని 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 3,000కు పైగా ఉన్న చెరువుల్లో 95 శాతం వరకు నీటితో నిండిపోయాయి. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. పదేళ్ల తరువాత హిమాయత్‌సాగర్‌ నీటిని రెండుసార్లు వదిలారు. ఉస్మాన్‌సాగర్‌ కూడా గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి నెలకొంది. హుస్సేన్‌సాగర్‌ పొంగి పొర్లుతోంది. ఎన్నడూ లేనంతగా వర్షాలు కురవడం వల్ల చెరువులు, కుంటలు పొంగి నగరంలో దాదాపు 5,000 కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. దీనికితోడు భూగర్భజలమట్టం పెరిగి సెల్లార్లలో నీరు ఊరుతోంది. నగరవ్యాప్తంగా దాదాపు 2 లక్షల అపార్టుమెంట్లు/ఇతర భవనాల్లోని సెల్లార్లలో నీటి ఊట చేరి గోడలు, పిల్లర్లు నాని కట్టడాలకు ముప్పుగా పరిణమిస్తోంది. వేలాది మోటార్లు రాత్రి, పగలూ తేడా లేకుండా నీటిని తోడే పనిలో ఉన్నాయి.  ఒక్కో అపార్టుమెంట్‌ వారు గత పది రోజుల్లో రూ.50,000 నుంచి రూ. 2 లక్షల వరకు నీటిని తోడడానికే ఖర్చు చేశారు. అనేకచోట్ల సెల్లార్లలోని కరెంటు మీటర్లన్నీ కాలిపోయాయి. అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

భూగర్భజలం పైపైకి..
హైదరాబాద్‌ నగరంలో దాదాపు 20 లక్షల నిర్మాణాలున్నాయి. వాడకం పెరగడం వల్ల రెండు దశాబ్దాలుగా భూగర్భ జలాలు అడుగంటాయి. చాలాచోట్ల దాదాపు 1500-2000 అడుగుల లోతుకు వెళ్తేకానీ బోర్లలో నీరు పడని పరిస్థితి. ఏటా వేసవి వచ్చిందంటే చాలు 2-3 లక్షల బోర్లు అడుగంటేవి. ఈ ఏడాది ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఒక్కసారిగా భూగర్భ జల మట్టం పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 2.25 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలున్నాయని అధికారులు చెబుతున్నారు. లక్షలాది అపార్టుమెంట్లలో పార్కింగ్‌ కోసం సెల్లార్లు ఉన్నాయి. వీటిలోకి ఎప్పుడైనా వర్షం నీరు చేరితే భూమిలోకి ఇంకడం కోసం పిట్‌లను తవ్వుతారు. ఇప్పుడు ఈ పిట్‌ల నుంచే జలం పొంగుతోంది. కొన్నిచోట్ల సెల్లార్లలో విద్యుత్తు ఎర్తింగ్‌ ఏర్పాటుచేసిన పిట్‌లు, లిఫ్ట్‌ గుంతల్లోంచి కూడా నీరు పైకి ఉబుకుతోంది. వెంటవెంటనే తోడకుండా వదిలేస్తే రాత్రికి రాత్రే నాలుగైదు అడుగుల నీరు చేరుతోంది. మూసీ నది ఒడ్డున ఉండే ప్రాంతాల్లోనూ, చెరువులను ఆనుకుని కట్టిన వందలాది అపార్టుమెంట్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయి.
* పీర్జాదిగూడ న్యూసాయినగర్‌ శ్రీబాలాజీ అపార్టుమెంట్‌లో సెల్లార్లో నీటిని తోడించడానికి రూ. 60,000 ఖర్చు చేసినట్లు యజమానులు చెబుతున్నారు. లోపల ఉన్న 19 విద్యుత్తు మీటర్లలోకి నీరు వెళ్లి కాలిపోయాయి.
* ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీలో గత కొన్నేళ్లుగా భూగర్భ జలాలు అడుగంటడంతో చాలా అపార్టుమెంట్ల వారు ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుంటుంటారు. ఇప్పుడు వర్షాల వల్ల తెల్లారేసరికి సంపులు నీటి ఊటతో నిండిపోతున్నాయి.


భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి
గతంలో ఎప్పుడూ లేనట్లుగా నగరంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. చాలా ప్రాంతాల్లో తక్కువ లోతులోనే బోర్లకు నీరు అందుతోంది. మూడేళ్లుగా ఆరేడు లక్షల ఇంకుడు గుంతలు తవ్వించడం కూడా భూగర్భ జలాలు పెరగడానికి ఓ కారణం.

- దానకిషోర్‌, జలమండలి ఎండీ

 

రెండున్నర మీటర్లపైనే నీరు
ఎస్‌ఆర్‌నగర్‌లో పరిశీలిస్తే నీటి మట్టం రెండున్నర మీటర్ల లోపే ఉందని తేలింది. వేలాది అపార్టుమెంట్ల సెల్లార్లు ఊటతో నిండిపోయాయి. భూగర్భ జలాల వాడకం పెరిగాక ఊట తగ్గే అవకాశం ఉంది. సెల్లార్లలో నీటిని ఎప్పటికప్పుడు తోడేయకపోతే భవనాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

- జాలా సత్యనారాయణ, భూగర్భ జల నిపుణుడు




Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.