close

తాజా వార్తలు

Published : 18/10/2020 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా.. పట్టింపేదీ!

గత 20ఏళ్లలో 320పైగా ఉత్పాతాలు
ముందస్తు చర్యల్లో ప్రభుత్వాలు విఫలం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కుండపోత వానలు, వరదలతో తరచూ ఏదో ఒకచోట నష్టాలు తప్పడం లేదు. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంటోంది. ఇదే విషయం తేల్చిచెబుతోంది ఐక్యరాజ్యసమితి. రెండు దశాబ్దాల్లో భారత్‌లో పర్యావరణ మార్పులు, విపత్తులపై సమగ్ర నివేదిక అందించింది. ఎన్నో తుపానులు సంభవించినా వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడంలో ఇంకా ఉదాసీనతే కనిపిస్తోంది. ఫలితంగా విపత్తు వచ్చిన ప్రతిసారి ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటోంది. ముందస్తు అంచనాలు, అప్రమత్త చర్యలు కొరవడి నష్టాలు తగ్గించుకునే వీలు లేకుండా పోతోంది. 
గంటల వ్యవధిలోనే నెల రోజుల వర్షం!
సాధారణ పరిస్థితుల్లో తెలంగాణలో సుమారు నెల రోజుల్లో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల వ్యవధిలోనే రికార్డైంది. ఇప్పుడు ఆ ప్రభావంతో ప్రజలు ఎంతగా అవస్థలు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. వరద గండాన్ని మోసుకొచ్చిన వాయుగుండం ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ప్రకృతి ఉత్పాతాల్ని నిలువరించడం అసాధ్యమే అయినా వాటి తాలూకు నష్టాలు తగ్గించుకోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం ఆ దిశగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. 2100 సంవత్సరం నాటికి సగటు ఉష్ణోగ్రతలో 4.4డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుదల కనిపించే ప్రమాదం ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అప్పటికి వడగాలుల సంఖ్య 3, 4రెట్లు అధికమవుతుందని, తుపానుల తాకిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. 1980 నుంచి 2000 సంవత్సరాలతో పోలిస్తే గత రెండు దశాబ్దాల్లో ప్రకృతి విపత్తుల విధ్వంసం పెరిగిందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో, ముందస్తు హెచ్చరికలతో ప్రాణ నష్టాన్ని పరిమితం చేయాలని సూచిస్తోంది. 
భారత్‌ది మూడో స్థానం

భూతాపంలో 1.1 సెంటీగ్రేడ్‌ పెరుగుదల కారణంగా ఈ స్థాయిలో విపత్తులు ముంచెత్తుతున్నాయి. ఈ విషయంలో చైనా, అమెరికా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందని ఐరాస గణాంకాలతో సహా వివరిస్తోంది. 20ఏళ్లలో దేశంలో 320కిపైగా ప్రకృతి ఉత్పాతాలు సంభవించాయని, ఈ కారణంగా రూ.3లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని నివేదించింది. ప్రకృతి విపత్తుల్లో వరదల వాటా 44శాతం కాగా, ఏటా సగటున 17 భీకర వరదలతో భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది. దేశంలో 4 కోట్ల హెక్టార్ల భూభాగానికి వరద ముప్పు, 68శాతం ప్రాంతానికి కరవు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో తుపానులు తరచూ విరుచుకుపడుతున్నాయి. భారీ నష్టం మిగులుస్తున్నాయి. తీరప్రాంతాల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం గుర్తుచేస్తున్నాయి. 
తీర ప్రాంత రక్షణకు ప్రణాళికలు సున్నా


 

ఆరేళ్ల క్రితం తూర్పు కోస్తా తీరంపై విరుచుకుపడిన హుద్‌హుద్‌ వందేళ్లలోనే విధ్వంసక తుపానుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ అనుభవాలతో తీర రక్షణకు ప్రణాళికలు రచించడం, అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, వాతావరణంలో పెను మార్పులతో తలెత్తే విపత్తులను మానవాళి ఎదుర్కోవడం అసాధ్యం. అయితే ముందస్తు ఏర్పాట్లతో నష్ట ప్రభావాలు తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత భూభాగం వెంట 7,500 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరానికి 50కిలోమీటర్ల లోపు 25కోట్ల మేర జనాభా ఉంది. తీర ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు,  చిత్తడి నేలలతో పాటు అనేక రకాల ఇసుక నేలల్లో జీవవైవిధ్య సంపద ఉంది. అభివృద్ధి పేరిట తీరంలో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాలు, పరిశ్రమలు, ఓడరేవుల ఏర్పాటు వల్ల జీవ వైవిధ్యంపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది.  తీర ప్రాంతం ఎన్నో విపత్తులకు కేంద్ర బిందువుగా మారుతోంది. కోస్తా తీరంలో దివిసీమ, కోనసీమ, ఒడిశా తుపానులతో పాటు హుద్‌హుద్‌, తిత్లీ వంటివి తీరం వెంట ఉన్న ప్రాంతాలను విపరీతంగా దెబ్బతీశాయి. 2004 నాటి సునామీ దేశ తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఇటీవల అంఫన్‌  తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. 
ఆ దేశాల్లో ప్రత్యేక చట్టాలు
అమెరికా, కెనడా, ఆస్ర్టేలియా, నెదర్లాండ్ వంటి దేశాలు తీరప్రాంత పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. 60శాతం జనాభా తీర ప్రాంతంలో నివసిస్తున్న అమెరికా 1972 నుంచి తీరప్రాంత నిర్వహణ కోసం ప్రత్యేక చట్టాలను అమలు చేస్తోంది. భారత్‌లో తీరప్రాంత పెట్టుబడుల కోసం చేపట్టిన అభివృద్ధి విధానాల్లో ఆ ప్రాంత పరిరక్షణ, నిర్వహణకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలు పొందుపర్చకపోవడం ఆందోళనకరం. హుద్‌హుద్‌, తిత్లీ వంటి తుఫానుల వల్ల నష్టాల భర్తీ కోసం రూ.వేల కోట్ల ప్రపంచ బ్యాంకు, ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నా నిర్వహణలో పారదర్శకత కొరవడిందనే విమర్శలున్నాయి. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తుపానులతో నష్టపోయిన ప్రాంతాల పునర్మిర్మాణ ప్రక్రియకు చట్టబద్ధత కల్పిస్తారు. వీటివల్ల ప్రభుత్వ వ్యవస్థలకు జవాబుదారీ చేసే అవకాశం ఉంటుంది. భారత్‌లో అలాంటి విధానంలేదు. 
2050లో 3.20కోట్ల మందికి వరద తాకిడి

2050 నాటికి సముద్ర మట్టం పెరుగుదల వల్ల దేశంలో 3.20కోట్ల జనాభా తీవ్ర వరద తాకిడికి గురయ్యే అవకాశం ఉందని క్లైమెట్‌ సెంట్రల్‌ అనే అంతర్జాతీయ పరిశోధనా సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీర పరిరక్షణకు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. భూతాపం కారణంగా 20ఏళ్లలో ప్రకృతి విపత్తుల తీవ్రత 83శాతం మేర పెరిగిందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అంటే భూతాపంపై ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది. ప్రకృతి విపత్తులు విరుచుకుపడటానికి ప్రధాన కారణం వనరుల విధ్వంసమే. 
పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదాతో ఆందోళన
ప్రమాదాల బారి నుంచి బయటపడటమెలా అని ఆందోళన చెందుతున్న తరుణంలో కేంద్రం పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) నోటిఫికేషన్‌ ముసాయిదా ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. ముందస్తు పర్యావరణ అనుమతులు పొందకుండానే పరిశ్రమలు, ప్రాజెక్టులు స్థాపించడానికి వీలు కల్పించేలా ఉండటంపై పలువురు విమర్శిస్తున్నారు. పారిశ్రామిక, అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టుల స్థాపనలో పర్యావరణ అనుమతుల మంజూరు ప్రక్రియను మరింత పటిష్ఠపర్చాల్సింది పోయి సులభతరం చేయడమేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వాదన మరోలా ఉంది. పర్యావరణ అనుమతుల మంజూరును వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన అత్యంత పారదర్శక ప్రక్రియగా వివరిస్తోంది. వాదనల మాటలు ఎలా ఉన్నా విపత్తుల నష్టాన్ని తగ్గించడంపై దృష్టి సారించకపోతే ఎన్నాళ్లయినా పరిష్కారం దొరకదు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.