close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120077104 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => hpD3gIlzpMM [video_short_link] => hpD3gIlzpMM [created_by] => [created_date] => [modified_by] => 9030164 [modified_date] => 2020-06-18 15:36:26.57544 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 18/06/2020 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగు రోజుల్లో జరిగే కథ ఇది

కీర్తిసురేష్‌... ‘మహానటి’తో జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించిన కథానాయిక. సావిత్రి పాత్రలో ఒదిగిపోయి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఘనమైన ఆ విజయం తర్వాత... అందుకు దీటైన కథలతో ప్రయాణం చేయాలనే తపనతో అడుగులు వేస్తోంది. ఆమె నటించిన బహుభాషా చిత్రం ‘పెంగ్విన్‌’ ఈ నెల 19న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ‘ఈనాడు సినిమా’తో ఫోన్‌లో ముచ్చటించారు కీర్తిసురేష్‌. ఆ విషయాలివీ...

పెద్ద తెరపై సినిమాని ఊహించుకుంటూ ‘పెంగ్విన్‌’లో నటించారు. మరి ఓటీటీ వేదికపై విడుదలవుతుండడంపై మీ అభిప్రాయం?

‘పెంగ్విన్‌’ సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందని ఊహించాను. ఒక సినిమాని థియేటర్‌లో చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. ఇలాంటి సమయంలోనూ నా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందనే సంతోషమే ఎక్కువగా ఉంది. ఓటీటీ వేదికపై నా సినిమా విడుదలవుతోందనేది అనూహ్యంగా, ఆశ్చర్యంగానే అనిపిస్తున్నా... ఈ వేదికల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువవుతుంది సినిమా. థియేటర్ల ద్వారా సినిమాని ఎంత మంది చూస్తారో ఏమో కానీ, అంతకంటే ఎక్కువమందే ఓటీటీ ద్వారా చూసే అవకాశాలు ఉంటాయి. ఈ వేదికలతో కొత్త ప్రేక్షకులకూ చేరువవుతాం.

‘మహానటి’ తర్వాత మీ నుంచి వస్తున్న నాయికా ప్రధానమైన సినిమా ఇదే కదా?

‘మహానటి’ తర్వాత నేను ఒప్పుకొన్న కథ కూడా ఇదే. మధ్యలో నావి కొన్ని సినిమాలు విడుదలైనా అవి దానికి ముందు ఒప్పుకొన్నవే. ఆ సినిమా విడుదలయ్యాక ఆరు నెలలు విరామం తీసుకుని కథలపై దృష్టి పెట్టా. మంచి కథని ఎంచుకుని చేయడానికి ఇంత సమయం పట్టింది.

‘పెంగ్విన్‌’ మీ తొలి థ్రిల్లర్‌ సినిమా. మీకు థ్రిల్లర్స్‌ ఇష్టమా?

ఒక ప్రేక్షకురాలిగా నేను అన్ని రకాల సినిమాల్నీ ఆస్వాదిస్తాను. నటిగా నేను చేసిన తొలి థ్రిల్లర్‌ చిత్రం ఇదే. దీన్ని ఎమోషనల్‌ థ్రిల్లర్‌ అనడమే కరెక్ట్‌. ఇందులో బలమైన భావోద్వేగాలు ఉంటాయి. థ్రిల్‌ అనేది కథలో ఒక ఉప అంశంలా ఉంటుంది. తల్లీబిడ్డల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది ‘పెంగ్విన్‌’. నాలుగు రోజుల్లో జరిగే కథ ఇది.

యువ కథానాయికలు తల్లిగా నటించడానికి ఒప్పుకోరు కదా. మరి సినిమా ఒప్పుకొన్నప్పుడు మీకు ఆ భయాలేమీ లేవా?

ఈ ప్రశ్నని ఇప్పుడందరూ అడుగుతుంటేనే తల్లి పాత్ర గురించి ఆలోచిస్తున్నా. కథ విన్నప్పుడు, చేస్తున్నప్పుడు దీని గురించి ఊహ కూడా రాలేదు. ఇందులో నేనొక యువ తల్లిగా నటించా. ఈ కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. కథ బలంగా ఉన్నప్పుడు, తల్లి పాత్రలో నటించడం అనేది పెద్ద విషయం కానే కాదు.

మాతృత్వం గురించి ఎలాంటి విషయాలు తెలిశాయి? పాత్ర గురించి ఎలా సన్నద్ధమయ్యారు?

ఈ సినిమాకి సంతకం చేశాక.... మాతృత్వానికి సంబంధించిన విషయాలన్నింటినీ మా అమ్మని అడిగి తెలుసుకున్నా. గర్భిణిగా కనిపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా నడవాలి? ఇలా బేసిక్స్‌ అన్నీ అమ్మకి ఫోన్‌ చేసి కనుక్కున్నా. చిత్రీకరణ సమయంలో దర్శకుడు కార్తీక్‌ ఈశ్వర్‌ చిన్న చిన్న విషయాలు కూడా ఓపికగా చెప్పాడు. ఇక తల్లి పాత్రలో భావోద్వేగాలు పండించడం అంటారా? నేను ఇప్పుడు తల్లిని కాకపోవచ్చు కానీ, మా అమ్మకి కూతురినే కదా. ఒక కూతురిగా నన్ను మా అమ్మ ఎలా కంటికి రెప్పలా చూసుకుంటుందో అర్థమైపోతుంది కదా. పైగా ఒక నటి మనసులోకి వంద కథలు వెళ్లిన తర్వాత... ఆ పాత్రల్ని ఎలా రక్తి కట్టించాలో సులభంగా అర్థమైపోతుంటుంది. సినిమా చేస్తున్నప్పుడు ఓ పాత్రని మూడో వ్యక్తిగా పరిగణిస్తూ ఎప్పుడూ నటించలేదు. సెట్‌లో ఉన్నంతసేపూ పాత్రలో లీనమైపోతుంటా. పాత్రే నేను, నేనే పాత్ర అన్నట్టుగా ఉంటుంది ఆలోచన. 

హిల్‌ స్టేషన్‌లో చిత్రీకరణ అనుభవాలేంటి?
లొకేషన్లు దర్శకుడి మనసులో ఎప్పటి నుంచో ఉన్నాయి. కొడైకెనాల్‌లో తీశాం. అక్కడ ఉదయం 6 గంటలకి షూటింగ్‌ మొదలయ్యేది. అలా 25 రోజులు చిత్రీకరించాం. ఇది చాలా పెద్ద సవాల్‌. షూటింగ్‌ మధ్యలో నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులు చిత్రీకరణ ఆపేసి, తర్వాత పూర్తిచేశాం.


కొత్తగా బయోపిక్‌ కథలు ఏమైనా విన్నారా?
ఈ జీవితానికి ఒక్క బయోపిక్‌ చాలు కదా (నవ్వుతూ).


మహేష్‌తో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారట కదా. నిజమేనా?  
అది ఇంకా ఖరారేమీ కాలేదండీ. అయితే నేనే చెబుతా.



‘మహానటి’ తర్వాత కథల ఎంపికలో మార్పులు వచ్చినట్టున్నాయి. వరుసగా నాయికా ప్రధానమైన కథలు ఎంచుకోవడానికి కారణం అదేనా?

‘మహానటి’ నాపై పెట్టిన బాధ్యత అలాంటిది. కథల ఎంపికలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నాకు నేనుగా ఇలాంటి సినిమాల్నే చేయాలని అనుకోలేదు. ‘మహానటి’ తర్వాత నా దగ్గరికి వస్తున్న సినిమాలన్నీ అలా బలమైన పాత్రలతో కూడుకున్నవే. అయితే మధ్యలో వాణిజ్య ప్రధానమైన సినిమాలూ చేస్తున్నా. నితిన్‌తో చేస్తున్న ‘రంగ్‌ దే’ రొమాంటిక్‌ కామెడీ. ఇలాంటి వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేస్తున్నప్పుడు నాకు మంచి పాత్ర ఉండాల్సిందే.


చిత్రీకరణల కోసం ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారా?

కరోనా ప్రభావం ఇంకా చాలా ఉంది. ఇప్పుడిప్పుడే షూటింగులంటే భయంగానే ఉంటుంది. అందుకే ఇంకో నెల, రెండు నెలల తర్వాతే బయటికెళతానేమో. ఇప్పుడైతే కష్టం. పని చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామనేది సందేహమే కదా.


లాక్‌డౌన్‌తో ఖాళీ సమయం దొరికింది కదా. ఏం చేశారు?

వ్యాయామం, యోగా చేస్తున్నాను. కాలేజీ రోజుల నుంచే వయొలిన్‌ నేర్చుకుంటున్నా. మధ్యలో సినిమాల వల్ల ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ దానిపై దృష్టి పెట్టా. ఇంట్లో స్వయంగా వండుకుంటూ మంచి ఆహారం తింటున్నా. నాకు నైకీ అని ఓ కుక్క పిల్ల ఉంది. చిత్రీకరణల వల్ల దానితో గడిపే సమయమే ఉండేది కాదు. ఇప్పుడు దానితో బాగా ఆడుకుంటున్నా.

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.