close

తాజా వార్తలు

కోలీవుడ్ కొత్త ఆశలు..!

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సూపర్‌స్టార్‌

పలు ప్రయోగాత్మక చిత్రాలు సిద్ధం

రజనీకాంత్‌

ఏప్రిల్‌ నుంచి పలు పెద్ద బడ్జెట్‌ చిత్రాలు తమిళ తెరపై వాలడానికి ముస్తాబు అవుతున్నాయి. రవికుమార్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటిస్తున్న ఓ చిత్రం, ‘డాక్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఏదో ఒకటి సమ్మర్‌ స్పెషల్‌గా రానుంది. 2020లో తప్పనిసరిగా రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే తన లక్ష్యమని శివకార్తికేయన్‌ ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. అలాగే హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్న ‘వలిమై’ కూడా విడుదలయ్యే అవకాశముంది. ఏటా దీపావళికి సినిమాను విడుదల చేసే విజయ్‌.. ఈ సారి అంతకన్నా ముందే ప్రేక్షకులను అలరించే అవకాశముంది. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలోని ఆయన సినిమా మరో రెండు, మూడు నెలల్లో విడుదలవుతుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మిష్కిన్‌ దర్శకత్వంలో విశాల్‌ నటిస్తున్న ‘తుప్పరివాళన్‌ 2’ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. వేసవి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’గా ప్రేక్షకులకు భారీ వినోదాన్ని పంచనున్నారు. విడుదల తేదీనికి ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా కోసం శంకర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాశీఖన్నా

చిన్న బడ్జెట్‌ చిత్రాలే కీలకం

వినూత్నమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఏదంటే.. కోలీవుడ్‌ అని తప్పకుండా చెప్పొచ్ఛు చిన్న బడ్జెట్‌ చిత్రాలతో పెద్ద వినోదాన్ని పంచడం ఇక్కడ కొత్తేమీ కాదు. దీనికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న కొన్ని సినిమాలు 2020లో విడుదల కానున్నాయి. దక్షిణాదిలోనే ఎక్కువ సినిమాలను నిర్మించే ప్రత్యేకత తమిళ పరిశ్రమకు ఉంది. గత ఏడాది తమిళ చిత్రాలే 209 (మొత్తం 250 కిపైగా) విడుదలయ్యాయి. ఈ సారి ఈ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. అందులోనూ చిన్న బడ్జెట్‌ చిత్రాలే కీలకపాత్ర పోషించనున్నాయి. బహుశా అందుకే ఇప్పుడున్న అగ్ర హీరోలు కూడా మాస్‌, కమర్షియల్‌కు పెద్దపీట వేడయానికి బదులు వైవిధ్యానికి సలాం కొడుతున్నారు. ‘ఖైదీ’, ‘అసురన్‌’ వంటి వైవిధ్య సినిమాలు తెరకెక్కిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కొత్త సంవత్సరానికి 2019 చెప్పకనే చెప్పి వెళ్లింది. పలురకాల ప్రయోగాత్మక సినిమాలు కూడా ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి.

నాయిక అంటే...

తన చుట్టూ హీరోను తిప్పించుకోవడం.. హీరో చుట్టూ తాను తిరగడం వంటి పాత్రలకు కోలీవుడ్‌ హీరోయిన్లు అతీతమనే చెప్పాలి. ప్రారంభంలో అవకాశాల కోసం అలాంటి పాత్రలు ఎంచుకున్నా.. ఒకింత ఇమేజ్‌ వచ్చిన తర్వాత వైవిధ్య బాటే పడతారు. గత ఏడాది నయనతార ‘లేడీ సూపర్‌స్టార్‌’ అయిందంటే అందుకు కొత్తదనమే కారణం. హీరోయిన్‌ పాత్రలను కాస్త పక్కనపెట్టి.. తానే కథకు హీరోగా మారి పలు సినిమాల్లో నటిస్తున్న ఆమె ‘మూకుత్తి అమ్మన్‌’, ‘నెట్రికన్‌’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో కనిపించనున్నారు. ఇక గత ఏడాది పెద్దగా ఆకర్షించలేకపోయిన త్రిష.. ఈ సారి యాక్షన్‌ నాయికగా గుర్తింపు తెచ్చుకుంటుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆమె నటించిన యాక్షన్‌ చిత్రం ‘రాంగి’ త్వరలోనే తెరపైకి రానుంది. ఇంకా ‘పరమపదం విళయాట్టు’, ‘గర్జనై’, ‘సుగర్‌’ చిత్రాలు విడుదల కానున్నాయి. ‘సుల్తాన్‌’ సినిమా ద్వారా రష్మిక మెప్పించనుంది. ‘ఇండియన్‌ 2’లో కాజల్‌ ఎలాంటి గెటప్‌లో కనిపిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమన్నా, నిక్కీగల్రాణి, రాశీఖన్నా, రకుల్‌, నివేదా పెతురాజ్‌లు తమ చిత్రాల ద్వారా ఈ సంవత్సరంలో పేరు తెచ్చుకోవాలని ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి 2020లో సినీ ప్రేక్షకులు కోరుకొనే వినోదం కోలీవుడ్‌ నుంచి వస్తుందని అందరూ ఆశిద్దాం..!

నయనతార                              నివేదా పెతురాజ్‌

థ్రిల్లర్‌, హారర్‌, కుటుంబ కథలు, యాక్షన్‌.. ఇలా పలు రకాల కథలు 2019లో నిండు వినోదాన్ని అందించాయి. సంఖ్య పరంగానూ కోలీవుడ్‌ తన సత్తా చాటుకుని.. అదే ఉత్సాహం, వేగంతో 2020 లోకి అడుగుపెడుతోంది. తొలి వారంలో కొన్ని చిన్న బడ్జెట్‌ చిత్రాలు తెరపైకి వస్తున్నాయి. అయినప్పటికీ గత ఏడాది (సంక్రాంతికి ‘పేట’ విడుదల) మాదిరిగానే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ సారి కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ‘దర్బార్‌’తో కోలీవుడ్‌ ప్రేక్షకులకు తొలి భారీ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. 9వ తేదీన ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే కోలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ వెంటనే సంక్రాంతి రోజున ‘పటాస్‌’గా రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఈ సినిమాల అనంతరం పలు చిన్న బడ్జెట్‌ చిత్రాలు క్యూ కట్టనున్నాయి. ఆ తర్వాత సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇతర హీరోలు తమ మార్కును 2020లో కనబరచాలని ఉవ్విళ్లూరుతున్నారు.

అజిత్‌                            విజయ్‌                            ధనుష్‌

- న్యూస్‌టుడే, కోడంబాక్కం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.