close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఏపీ రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న బంద్‌

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులు, మహిళలపై నిన్న అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసుల లాఠీ ఛార్జికి నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి రాజధాని గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. 2 బిల్లులకు శాసనసభ ఆమోదం

పరిపాలన మొత్తాన్ని విశాఖకు తరలించేందుకు ఉద్దేశించిన ‘వికేంద్రీకరణ బిల్లు’ను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించింది. దీంతోపాటే ‘సీఆర్‌డీఏ’ చట్టం రద్దు బిల్లుకూ సభ ఆమోదం తెలిపింది. రాజధానిపై కీలక నిర్ణయం కోసమే ప్రత్యేకంగా ఉదయం 11 గంటలకు మొదలైన శాసనసభ తొలిరోజు సమావేశం.. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాడివేడి వాగ్వాదాల మధ్య రాత్రి 11 గంటల వరకూ సాగింది. చంద్రబాబు మినహా ప్రతిపక్ష తెదేపాకు చెందిన 17 మంది సభ్యులను సస్పెండ్‌ చేసి.. మూజువాణి ఓటుతో బిల్లులను ఆమోదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అన్ని ప్రాంతాలకూ సమన్యాయం

ఏ ప్రాంతానికీ అన్యాయం చేయడం లేదని- అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేసే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే అయిదేళ్ల తర్వాత ఇదే శాసనసభలో ఇలాగే కూర్చుని రాజధాని నిర్మించుకోలేకపోయామని చింతించాల్సి వస్తుందని అన్నారు. ఆ పరిస్థితులు రాకూడదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. చేతులెత్తి నమస్కరిస్తున్నా

‘ముఖ్యమంత్రి జగన్‌ నా కంటే వయసులో చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా... తొందరపడొద్దు... మూడు రాజధానులుగా విభజించొద్దు. అమరావతిని కొనసాగించండి...’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అభ్యర్థించారు. ఇక్కడ శాశ్వత భవనాలు ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని అభివృద్ధి చేస్తే ఆదాయం పెరగదు.. కొత్త నగరాన్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 3 రాజధానుల ముచ్చట మూణ్నాళ్లే

మూడు రాజధానుల ముచ్చట మూణ్నాళ్లేనని, రాజ్యాంగ పరిధిని అతిక్రమించి వైకాపా ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతో కాలం మనుగడ సాగించలేవని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘శాశ్వత పరిపాలన రాజధాని అమరావతిలో మాత్రమే ఏర్పాటవుతుంది. అది భాజపా- జనసేనలతోనే సాధ్యం. రాజధాని అమరావతి తరలించడం తాత్కాలికమే. పేపరులో మాత్రమే ఉంటుంది. 3 రాజధానులపై భాజపా అగ్రనాయకత్వంతో చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తాం’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 120 పురపాలక సంఘాలు, తొమ్మిది నగరపాలక సంస్థల్లో బుధవారం పోలింగ్‌ జరగనుంది. మొత్తం 53.55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 2,355 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. మిగిలిన చోట్ల పోలింగ్‌ ప్రక్రియను వీడియోరికార్డింగ్‌ చేయించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఎంఐఎంతో పెట్టుకుంటే కారు బోల్తా: అక్బరుద్దీన్‌

పౌరసత్వ సవరణ చట్టం సమస్య కేవలం ముస్లింలకు సంబంధించినది కాదని.. భారతీయులందరిదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎంఐఎం పుర అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ రాష్ట్రం దాటని తెరాస నాయకులకు ఎంఐఎం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసి గెలిచి వచ్చి మాట్లాడాలన్నారు. తమతో పెట్టుకుంటే కారు స్టీరింగ్‌ చేతికొచ్చి.. టైర్లు పగిలిపోయి.. బోల్తా పడుతుందని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. తుపాకీ గుండ్లు కురిపించినా వెనక్కి తగ్గం

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేసే వరకు పోరాడతామని, ఈ క్రమంలో తుపాకీ గుండ్లు కురిపించినా వెనక్కి తగ్గేది లేదని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. యంగ్‌ ఇండియా సమన్వయ కమిటీ హైదరాబాద్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. శిర్డీ వివాదానికి తెర

మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థల వివాదానికి తెరపడింది. పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగానే  పాథ్రీకి నిధులు మంజూరు చేస్తామంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. దానికి శిర్డీ గ్రామస్థులు అంగీకరించారు.  పాథ్రీని సాయిజన్మభూమిగా చెప్పడాన్నే వ్యతిరేకిస్తున్నామని, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని గ్రామస్థులు పేర్కొన్నారు.ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 1=70

భారత్‌లో 1 శాతం మంది వద్ద 95.3 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే నాలుగు రెట్ల సంపద ఉంది. దేశ జనాభాలో వీరు 70 శాతానికి సమానం కావడం గమనార్హం. మొత్తం భారత కుబేరుల సంపద ఒక పూర్తి ఏడాది బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉందని ఒక నివేదిక చెబుతోంది. ఓక్స్‌ఫామ్‌ అనే సంస్థ విడుదల చేసిన ‘టైమ్‌ టు కేర్‌’ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 2153 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపద మన భూగోళంపై ఉన్న జనాభాలో 60 శాతానికి సమానమైన 460 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే ఎక్కువ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.