
తాజా వార్తలు
‘‘కారం మెతుకులు తిని బతుకున్నారు’’
హైదరాబాద్: ‘‘లాక్డౌన్ ఎత్తేయగానే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పుడు ఉపాధి లేక ప్రజలు చస్తూ బతుకుతున్నారు’’ అని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, ప్రజల ఇబ్బందుల గురించి ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు. ఉపాధి లేక కారం మెతుకులు తిని బతుకుతున్నామని బస్తీ వాసులు చెబుతున్నారని కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ చికిత్స అందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 నగదు ఇవ్వాలి. మనిషిని కాపాడటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ప్రతి బస్తీలో పర్యటించి ప్రజలు సమస్యలు తెలుసుకుంటాం’’ అని కోదండరాం చెప్పారు.
కరెంటు భారం మోపొద్దు...
‘‘కరోనా పరిస్థితుల నుంచి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి. అఖిలపక్ష నేతలను కేసీఆర్ ఆహ్వానిస్తే కలసి కేంద్రంపై ఒత్తిడి తెద్దాం’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి చావులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ‘‘హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయంతో బతుకుతున్నారు. నగరంలో కరోనా పరీక్షలను పెంచాలి. కరెంటు బిల్లుల భారాన్ని ప్రజలపై పెద్ద ఎత్తున మోపుతున్నారు. పాత స్లాబుల కంటే ప్రజలు ఎక్కువ కట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రభుత్వం స్పందించకుంటే అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం’’ అని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
ఆ నిధులు వెంటనే విడుదల చేయాలి...
‘‘కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ డాక్టర్స్, నర్సుల పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలి’’అని భాజపా సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి కోరారు. గడిచిన రెండు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వివేక్ వెంకటస్వామి కోరారు.