
తాజా వార్తలు
తిరుపతి ఎంపీ అభ్యర్థిపై వారంలో నిర్ణయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్
తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్థిపై వారంలో నిర్ణయం ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తిరుపతిలో జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై మరోమారు సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. భాజపా బరిలో నిలిస్తే జీహెచ్ఎంసీ స్థాయిలో బలంగా పోటీ చేయాలన్నారు. జనసేన బరిలో నిలిస్తే 7 నియోజకవర్గాల్లోనూ తానే ప్రచారం చేస్తానన్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వంతో క్షేత్రస్థాయి సమస్యలు ఉన్నట్లు పీఏసీలో చెప్పినట్లు పవన్ తెలిపారు. గతంలో ఇబ్బందులు ఉంటే భాజపా అగ్రనాయకత్వంతో మాట్లాడానని పేర్కొన్నారు. మతం పేరిట రాజకీయాలు చేయలేకే రామతీర్థం వెళ్లలేదన్నారు. మత సామరస్యం కోసం రాజకీయ లబ్ధి వదులుకుంటానన్నారు. ఏ ప్రార్థనా మందిరంపై దాడి జరిగినా ఒకే విధంగా స్పందిద్దామని పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు జనసేన సిద్ధాంతమని ఆయన అన్నారు.
తిరుపతిలో సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం ఇంకా ప్రక్రియ ప్రారంభించలేదు. అయినప్పటికీ ఈ ఎన్నికను పలు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో తిరుపతిలో రాజకీయ సమరం నెలకొంది.
ఇవీ చదవండి..
ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?