close

తాజా వార్తలు

Published : 06/04/2021 14:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈవీఎంతో సహా సేదతీరి..సస్పెండయ్యాడు

కోల్‌కతా: ఈవీఎంతో సహా తన బంధువైన తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో నిద్రించి..ఓ ఎన్నికల అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. అలాగే ఆ సమయంలో ఆయన చెంత ఉన్న ఆ ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎన్నికల్లో ఉపయోగించకుండా ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేయడంతోపాటు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పశ్చిమ్ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని ఉలుబెరియా ఉత్తర్ నియోజకవర్గ పరిధిలో తపన్ సర్కార్.. సెక్టార్ అధికారిగా నియమితులయ్యారు. రాష్ట్రం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమవుతోన్న వేళ..ఆయన తన బంధువైన తృణమూల్ నేత ఇంట్లో రాత్రిపూట సేదతీరారు. అప్పుడు ఆయనతో పాటు రిజర్వ్ ఈవీఎంను కూడా సదరు నేత ఇంటికి తీసుకెళ్లినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ‘ఈ తీరు భారత ఎన్నికల సంఘం ఆదేశాల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఆ సెక్టార్ అధికారిపై సస్పెన్షన్ విధించాం. ఆయనపై కఠిన చర్యలు తీసుకోనున్నాం’ అని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆయనతో అనుబంధంగా ఉన్న సెక్టార్ పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ రిజర్వ్ ఈవీఎంకు చెందిన అన్ని సీళ్లను పరిశీలించి, వేరుగా ఉంచినట్లు తెలిపింది.

ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ డిమాండ్ చేశారు. ఓటింగ్‌ రోజున ఇలా జరగడం..చాలా తీవ్రమైన విషయమని మండిపడ్డారు. ఇప్పటికే పశ్చిమ్ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రెండు దశల పోలింగ్ పూర్తయింది. నేడు మూడో దశలో 31 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇంతకు ముందు అస్సాంలో ఓ భాజపా నేత వాహనంలో ఈవీఎం కనిపించడం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో నలుగురు అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసి, రీపోలింగ్‌కు ఆదేశించింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని