
తాజా వార్తలు
గ్లోబల్ సిటీ అని...ఫ్లడ్ సిటీగా మార్చారు
కేంద్ర మంత్రి ప్రకాశ్జావడేకర్
హైదరాబాద్: తెరాస పాలనలో జీహెచ్ఎంసీ స్థితిగతులు, గత ఎన్నికల్లో హామీలపై... ఆరేళ్లలో తెరాస 60 వైఫల్యాలంటూ భాజపా ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మాట్లాడుతూ.... తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. కేసీఆర్, అసదుద్దీన్ కేటుంబాలే పాలిస్తున్నాయన్నారు.
‘‘కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయి. మొన్నటి వరదల వల్ల హైదరాబాద్ 15 రోజులు నీళ్లలోనే ఉండిపోయింది. కనీసం సరైన డ్రైనేజీ కూడా తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేయలేకయింది. గ్లోబల్ సిటీ అని చెప్పారు.. ఫ్లడ్ సిటీగా మార్చారు. లక్ష ఉద్యోగాలు అంటూ ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి. వరద సాయం సొమ్ములో సగం తెరాస నాయకుల జేబుల్లోకి వెళ్లింది. లక్ష రెండు పడకగదుల ఇళ్లు కడతామన్నారు.. వెయ్యి కూడా కట్టలేదు. మోదీ రెండున్నర కోట్ల రెండు పడక గదుల ఇళ్లు కట్టి చూపించారు. కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేశారు. హైదరాబాద్ మేయర్‌గా ఎంఐఎం అభ్యర్థి కావాలా? భాజపా అభ్యర్థి కావాలా? తెలంగాణ రాష్ట్ర సాధనలో భాజపా కృషి ఉంది. తెలంగాణ సాధన కోసం భాజపా పోరాడింది ఇలాంటి పాలన కోసం కాదు’’ అని జావడేకర్ అన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్, అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.